
నోట్ల రద్దుతో నేతల విలవిల
► ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజాప్రతినిధులు
► అర్ధంతరంగా నిలిపివేసిన జనచైతన్యయాత్రలు
► అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు సైతం దూరం
విశాఖపట్నం : పెద్ద నోట్ల రద్దు దెబ్బకు అధికార పార్టీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఏదో రూపంలో నిత్యం ప్రజల్లో ఉండే టీడీపీ నేతలు ప్రస్తుతం పూర్తిగా ఇళ్లకే పరిమితమై పోతున్నారు. మంత్రులు సైతం ప్రజల్లో తిరగలేక గెస్ట్‌హౌస్‌లను విడిచిపెట్టడం లేదు. ఏరోజుకారోజు పెరుగుతున్న నోట్ల కష్టాలతో పెల్లుబికుతున్న వ్యతిరేకతను ఎదర్కోలేక ముఖం చాటేస్తున్నారు.
పెద్దనోట్లు రద్దు ప్రకటన వెలువడి 40 రోజులైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ నిర్ణయాన్ని సానుకూల స్పందన రావడంతో మాకు ఇక తిరుగులేదని మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు జబ్బలు చరిచారు. ఆరంభంలో ఎక్కడకెళ్లినా నల్లకుబేరులను ఎరివేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. నల్లధనం వెనక్కి రప్పించాలంటే ఇలాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఊరువాడా చెప్పుకొచ్చారు.
కానరాని యాత్రలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్‌కు పోటీగా తలపెట్టిన జన చైతన్య యాత్రల పేరిట ఆరంభంలో హడావుడి చేశారు. సెప్టెంబర్‌లో గ్రామగ్రామాన యాత్రల పేరిట హల్‌చల్ చేసిన టీడీపీ నేతలు నవంబర్‌లో రద్దు ప్రకటన వెలువడిన తర్వాత నెమ్మదించారు. నవంబర్ 15వ తేదీ వరకు అడపదడపా యాత్రలు చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం వాటికి స్వస్తి చెప్పారు. ఆరంభంలో పెద్ద నోట్ల రద్దుకు వచ్చిన సానుకూలత ఆవిరైపోయింది. పైగా రోజు రోజుకు నోట్ల కష్టాలు పెరుగుతూ వచ్చాయి. చిల్లర నోట్లు దొరక్క.. రూ.2వేలు నోటు మార్చుకునే దారిలేక తొలి పదిహేను రోజులు అష్టకష్టాలు పడ్డారు. ఆ తర్వాత జీతాలు జమైనప్పటికీ చేతికి సొమ్ములందక కష్టాలు రెట్టింపయ్యాయి.
దెబ్బతిన్న వ్యాపారాలు
సామాజిక పింఛన్‌దారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నగదు కొరత కారణంగా ప్రజలు పొదుపు మంత్రాన్ని జపించడంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సంక్రాంతి ముందు నెల కావడంతో డిసెంబర్‌లో జోరుగా సాగాల్సిన అమ్మకాలు మచ్చుకైనా కన్పించకపోవడంతో చాలా వ్యాపార సంస్థలు దివాళా తీసే పరిస్థితికి చేరాయి. మరో పక్క నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులుతీరి నిల్చోవల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు పనిపాటలను మానుకొని పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు నోట్ల కష్టాలతో కాలం గడిచిపోతుంది. మరో వైపు వాస్తవాలను పట్టించుకోకుండా నగదు రహిత లావాదేవీలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊదరగొట్టేస్తుండడం ప్రజలు జీర్ణీంచు కోలేకపోతున్నారు. దీంతో తొలుత పెద్దనోట్ల రద్దు నిర్ణయం, నగదు రహిత లావాదేవీలపై ఎక్కడపడితే అక్కడ మాట్లాడే అధికార పార్టీ నేతలు నేడు పెదవి విప్పేందుకు కూడా సాహసించలేకపోతున్నారు. 50 రోజుల్లో కష్టాలన్నీ తొలగిపోతాయని కేంద్రం ప్రారంభంలో ప్రకటించింది.
వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మరో రెండు మూడు నెలలైనా ఈ కష్టాలు తీరే అవకాశాలు కనుచూపు మేరలో లేకపోవడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. చీటికిమాటికి జిల్లాకు రావడం.. సమీక్షలు, సమావేశాలు, అభివృద్ధి, శంకుస్థాపనలంటూ హడావుడి చేసే మంత్రులు సైతం గడిచిన నెల రోజులుగా ముఖం చాటేశారు. ఉంటే హైదరాబాద్‌లో లేదా.. వైజాగ్ వస్తే ఇళ్లకు పరిమితమవడం తప్ప ప్రజల్లో తిరిగలేకపోతున్నారు. గడిచిన 40 రోజుల్లో విశాఖ ఎంపీ హరిబాబు ఒకటి, రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అంతర్గత సంభాషణల్లో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు నోట్ల రద్దు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాత్తు బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు నోట్ల రద్దు వల్ల తానే స్వయంగా తీవ్ర అసహానికి లోనయ్యాయని వ్యాఖ్యానించడం.. ఆ తర్వాత ఎక్కడా జనంలో కన్పించకపోవడం గమనార్హం. వారానికోసారి వచ్చే సీఎం కూడా గడిచిన 40 రోజుల్లో రెండుసార్లు మాత్రమే జిల్లాకు రావడం..పైగా ఎక్కడా నగదు కష్టాలపై పెద్దగా మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రతిపక్షాల ఆందోళన బాట
మరో పక్క నోట్ల కష్టాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ, వామపక్ష నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 22న వామపక్ష నేతలు బ్యాంకుల ఎదుట సత్యాగ్రహదీక్షలు చేయనున్నారు. ప్రజలు ఇక్కట్లను పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ప్రతిపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు.