టీడీపీ జనచైతన్యయాత్రకు చుక్కెదురు!
కడప: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు చేపట్టిన జనచైతన్య యాత్రకు వైఎస్ఆర్ కడప జిల్లాలో చుక్కెదురైంది. జనచైతన్య యాత్రలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి ఎమ్మెల్యే జయరాములు వెళ్లారు. రామేశ్వరం గ్రామస్తులు మాత్రం ఎమ్మెల్యే జయరాములును తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తికావస్తున్నా తమ తాగునీటి సమస్య తీర్చలేదని రామేశ్వరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ సభ్యత్వం రెన్యువల్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ స్థలాలు వాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం రామేశ్వరం గ్రామస్తులు తాగునీటి సమస్యలపై విన్నవిస్తున్నా నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, స్థానికులకు అక్కడ కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల్లో తప్పకుండా సమస్యలు తీర్చుతామని హామీ ఇవ్వడంతో చివరికి గ్రామస్తులు శాంతించారు.