mla jayaramulu
-
బద్వేలు ‘దేశం’లో మూడు ముక్కలాట
సాక్షి, కడప : బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ముగ్గురు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. బిజివేముల వీరారెడ్డి మృతితో ఆయన కూతురు విజయమ్మ టీడీపీ పగ్గాలు చేతపట్టి పార్టీని నడిపిస్తున్నారు. వీరారెడ్డి మృతి సానుభూతితో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, 2004లో డీసీ గోవిందరెడ్డి చేతిలో పరాజయం పాలయినా, తన తండ్రి వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం కావడంతో 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎంపిక చేసిన కమలమ్మను బద్వేలు చరిత్రలో ఎన్నడు లేని విధంగా 36 వేల ఓట్ల మెజారిటీతో డీసీ గోవిందరెడ్డి గెలిపించారు. కమలమ్మ కాంగ్రెస్‌లో ఉండిపోవడంతో 2014లో వైఎస్సార్సీపీ తరపున జయరాములు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయజ్యోతిపై విజయం సాధించారు. ఆ తరువాత విజయమ్మకు, విజయజ్యోతికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. అవి రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో జయరాములు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిపోయారు. దాంతో అంతవరకు రెండు కత్తులున్న ఒరలో మూడుకత్తులయ్యాయి. కొన్నాళ్లకే ముగ్గురివి మూడు దారులయ్యాయి. ఈ నేప«థ్యంలో టీడీపీ అభ్యర్థిగా విజయమ్మ సూచించిన లాజరస్ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దానిపై తీవ్ర వ్యతిరేక రావడంతో విజయమ్మ ప్రత్యామ్నాయంగా ఓబులాపురం రాజశేఖర్‌ను సూచించి, ముఖ్యమంత్రితో ఆమోదముద్ర వేయించుకున్నారు. దాంతో విజయజ్యోతి రగిలిపోయారు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి, 2014లో ఓడిపోయినా పార్టీలో కొనసాగుతూ 2019పై ఆశతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకపోతున్న తనను కాదని ఎవరో కొత్త వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ముఖ్యమంత్రిని నిలదీయడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చేసిన రాజీప్రయత్నాలు సఫలం కాలేదు. ఇదిలా ఉండగా బుధవారం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల రామస్వామి ఆలయంలో విజయమ్మ ఆమె కుమారుడు రితీష్‌రెడ్డి, పార్టీ నాయకులు రాజశేఖర్‌తో కలసి పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు తాను ముఖ్యమంత్రితో చర్చి స్తున్న సమయంలోనే విజయమ్మ ప్రచారం షురూ చేయడం జ్యోతికి పుండుమీద కారం చల్లినట్లయింది. తనకు టీడీపీ టిక్కెట్ లభించదనే నిర్ణయానికి వచ్చిన విజయజ్యోతి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు శుక్రవారం పోరుమామిళ్లలోని వసుంధర కల్యాణమండపంలో తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా, విజయజ్యోతిని గెలిపించండి అంటూ పలు పోస్టర్లు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశంగా మారింది. రగులుతున్న జయరాముడు ఇదిలా ఉండగా మరో వైపు ఎమ్మెల్యే జయరాములు కూడా తనను అధిష్టానం పట్టించుకోకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తాను కూడా పోటీలో ఉంటానని, స్వతంత్రంగా అయినా పోటీ చేస్తానని, తన వర్గీయులతో అంటున్నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం బద్వేలు టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. -
చంద్రబాబు పర్యటన లొల్లి..! అయోమయంలో అధికారులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి నేతృత్వం వహించేందుకు బద్వేలు నియోజకవర్గంలోని రెండు వర్గాల మధ్య కుమ్ములాట మొదలైంది. వివరాలు.. బద్వేల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 17) పర్యటించనున్నారని టీడీపీ వెల్లడించించి. అయితే హెలీప్యాడ్, బహిరంగ సభ వీరారెడ్డి కాలేజీలో పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సన్నాహకాలు చేస్తుండగా.. ఎమ్మెల్యే జయరాములు ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాలేజీలో సభ ఏర్పాట్లు చేయొద్దంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో సభ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గ పోరుతో అయోమయంలో పడ్డారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో పశ్చాత్తాపం
-
జయరామయ్యా.. అభివృద్ధి ఏదయ్యా?
► పార్టీ ఫిరాయింపు సమయంలో ప్రజలకు భారీగా హామీలు ► తర్వాత అటకెక్కించిన ఎమ్మెల్యే ► ఏడాదిన్నరలో మరింత పెరిగిన జనం సమస్యలు ► తన అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించారని మండిపడుతున్న జనం పార్టీ ఫిరాయించిన రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఇప్పుడు తన హామీల ఒట్టు తీసి గట్టున పెట్టారు. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత తాను జనానికి ఇచ్చిన హామీల సంగతేమిటని మంత్రులను, సీఎంను గట్టిగా నిలదీసి నిధులు సాధించుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే నిజంగా నియోజకవర్గ అభివృద్ధి మీద ధ్యాసతోనే పార్టీ ఫిరాయించి అధికార పార్టీ ఎమ్మెల్యే అవతారం ఎత్తి ఉంటే ఇప్పటి వరకూ హామీలను ఎందుకు నెరవేర్చలేక పోతున్నారని ప్రజలు రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నాననీ, అధికార పార్టీలో చేరుతున్నందువల్ల నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఇట్టే పరిష్కరిస్తానని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు గట్టిగా చెప్పారు. హామీలు దంచేసి ఏడాదిన్నర కావస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులో జనం నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీళ్లే దిక్కు. జయరాములు నివాసం ఉంటున్న పోరుమామిళ్ల జనం దప్పిక తీర్చడానికి రూ.90 లక్షలతో సగిలేరు నుంచి పోరుమామిళ్ల వరకు నిర్మించిన తాగునీటి పథకం పనులు నాసిరకంగా జరిగినా కాంట్రాక్టర్లు, అధికారులను ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. పోరుమామిళ్లవాసుల గొంతులు తడపడానికి రోజుకు రూ.50 వేలు ఖర్చుచేసి 115 ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నా నీటి కటకట తీరడం లేదు. పోరుమామిళ్ల జనం నీళ్లో జయరామయ్యా అని గొంతు చించుకుంటున్నా ఎమ్మెల్యే వారి ఇబ్బందుల గురించి గొంతు విప్పే పరిస్థితిలో లేరు. సొంత అభివృద్ధి కోసమే..: ఎమ్మెల్యే జయరామయ్య గారు సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నోరు విప్పడం లేదంటే గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన జయరాములు ఎందుకోసం టీడీపీ కండువా కప్పుకున్నారనే విషయం వేరేగా చెప్పక్కర్లేదు. తాను ఇచ్చిన హామీలకు ఏడాదిన్నర నిండబోతున్న నేపథ్యంలోనైనా జయరాములు తన హామీల గురించి ఆలోచించాలని జనం కోరుతున్నారు. ఈ పనైనా చేయండి బద్వేలు మండలం అప్పరాజుపేట నుంచి అట్లూరు మండలంలోని చివరి ఆయకట్టు వరకు బ్రహ్మసాగర్ కుడికాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్సార్ సీఎంగా ఉండగా ఈ పనులు వేగంగా జరిగాయి. ఆయన మరణం తర్వాత నిధులు లేక నీరసించాయి. ఎమ్మెల్యే జయరాములు మూడు, నాలుగు కోట్ల నిధులు సాధించి ఈ పనైనా పూర్తి చేయిస్తే సుమారు 15వేల ఎకరాల భూములకు సాగునీరందించవచ్చు. ఇదీ హామీల గతి హామీ: బద్వేలు అభివృద్ధి కోసం రూ.100కోట్ల నిధులు తెస్తా. అమలు : ఇంతవరకూ ప్రత్యేకంగా రూపాయి కూడా తేలేదు. హామీ : గోపవరం, బద్వేలు మండలాల తాగునీటి ఎద్దడి నివారణకు సోమశిల బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా ఒక టీఎంసీ నీరు సరఫరా చేయిస్తా. అమలు : ఇంతవరకూ అతీగతి లేదు. హామీ : కాశినాయన మండలానికి తెలుగుగంగ ఎడమ కాలవ నుంచి సావిశెట్టిపల్లి, ఆకులనారాయణపల్లి, వరికుంట్ల, భాలాయపల్లి, గొటువారిపల్లి, గంగనపల్లి పంచాయతీలలోని గ్రామాలకు సాగునీరు అందిస్తా. అమలు : ఇంతవరకూ దాని ఊసేలేదు. హామీ : కలసపాడు మండలానికి స్పెషల్ కోటా కింద వెయ్యి పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా. అమలు : అన్ని మండలాలకు కేటాయించిన విధంగా 130 ఇళ్లే మంజూరయ్యాయి. స్పెషల్ కోటా ప్రస్తావనే లేదు. హామీ : బి.కోడూరుకు 200 వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తా. అమలు : 80 పింఛన్లు మాత్రమే మంజూరు చేయించారు. హామీ : బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లి ఎస్సీకాలనీపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ లైను మార్పిస్తా అమలు : ఇంతవరకూ విద్యుత్ లైన్ మార్చలేదు. హామీ : అట్లూరు మండలంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం సిద్దవటం సమీపంలో నుంచి పెన్నా నీరు ఎత్తిపోతల పథకం ద్వారా సరఫరా చేయిస్తా అమలు : ఆ పనులు ప్రతిపాదనల దశకు కూడా చేరలేదు. హామీ : బద్వేలు నుంచి పోరుమామిళ్ల వరకూ ఉన్న సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్పిస్తా. అమలు : ఆ ఊసే లేదు హామీ : పోరుమామిళ్ల చెరువుకు బ్రహ్మసాగర్ నీరు తెస్తా. అమలు : ఆ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. హామీ : ప్రతి జర్నలిస్టుకు ఇంటిస్థలంతో పాటు పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా. అమలు : ఈ హామీకి అతీగతీ లేదు. -
భగ్గుమన్న విభేదాలు
- ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రచ్చ తారాస్థాయికి బద్వేలుఅర్బన్ : గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య ఏర్పడిన విబేధాలు బుధవారం జనచైతన్య యాత్ర ముగింపు సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. గత నెల 1వ తేదీనుంచి ప్రారంభమైన కార్యక్రమాల్లో వీరివురు వేర్వేరుగా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలో టీడీపీలోని కొందరు నేతలు విజయమ్మ వ్యవహార శైలి నచ్చడం లేదని జయరాములు పంచన చేరారు. ఆమె తీరుపై పార్టీ అధిష్ఠానానికి సైతం కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఎంపికలో సైతం ఇద్దరు నేతల మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా జనచైతన్యయాత్రలు చేసుకుంటూ వచ్చారు. చివరిరోజైన బుధవారం పట్టణంలోని నాగులచెరువు కట్ట ఆంజనేయస్వామి గుడి నుంచి మార్కెట్‌యార్డు వరకు ఎమ్మెల్యే జయరాములు తన అనుచరులతో బైక్‌ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో బైక్ ర్యాలీ వచ్చే దారిలో పైపులైన్ మరమ్మతుల పేరుతో రోడ్డును తవ్వారు. ఎమ్మెల్యే వర్గీయులు బైక్ ర్యాలీ వద్దకు వెళ్తుండగా గమనించి సంబంధిత సిబ్బందితో వాగ్వివాదం చేశారు. ఎక్కడైనా ప్రధాన రహదారిలో మరమ్మతులు రాత్రి వేళలో చేసుకోవాలని ఉదయం 9 గంటలకు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ , ఆమె ప్రధాన అనుచురుడైన మున్సిపల్ చైర్మన్ పార్థసారథి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీని అడ్డుకోవాలని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజినాయక్ ,రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి , అట్లూరు ఎస్ఐ మహ్మద్ రఫి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే వర్గీయులను శాంతింపచేయడంతోపాటు రోడ్డుపై తీసిన గుంతను మట్టితో పూడ్పించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. జనంలేక వెలవెలబోయిన సభ: జనచైతన్య యాత్ర ముగింపు సందర్భంగా మార్కెట్‌యార్డు ఆవరణలో బహిరంగసభ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి హాజరయ్యారు. కొంతమంది యువతను సమీకరించి ర్యాలీ నిర్వహించినప్పటికీ సభలో మాత్రం యువకులు లేకుండా వెనుతిరిగారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో పాటు జనంలేక సభ వెలవెలబోయింది. -
బద్వేలు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కడప: వైఎస్సార్‌జిల్లా బద్వేల్ టీడీపీలో మరోమారు విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే జయరాములు చేపట్టిన జన చైతన్య యాత్రను అడ్డుకునేందుకు మరో నేత విజయమ్మ యత్నించారు. ఎమ్మెల్యే బైక్ ర్యాలీ చేయాలనుకున్నరోడ్డుపై జేసీబీతో అడ్డంగా కాల్వ తీశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాములు, ముందు నుంచి పార్టీలో ఉన్న విజయమ్మ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఒకే గ్రామలో పోటాపోటీగా యాత్రలు చేసిన ఇరువర్గాలు ఇప్పుడు బహిరంగంగా వివాదాలకు దిగుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పార్థసారథి ఎమ్మెల్యే యాత్రను అడ్డుకునేందుకు జేసీబీ అడ్డుపెట్టించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జేసీబీని తొలగించారు -
అట్టహాసంగా ప్రారంభమైన ఖేల్‌ఇండియా క్రీడలు
గోపవరం (బద్వేలు) : బద్వేలు, గోపవరం మండలాల్లో శనివారం అట్టహాసగా ఖేల్‌ఇండియా క్రీడలు ప్రారంభమయ్యాయి. గోపవరం మండలానికి సంబంధించి రాచాయపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడలను ఎమ్మెల్యే జయరాములు ప్రారంభించారు. బద్వేలు మండలానికి సంబంధించి బిజివేములవీరారెడ్డి డిగ్రీకళాశాలలో ఎంపీడీఓ డాక్టర్ వెంకటేష్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు దోహదపడనున్నాయన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలస్థాయి విద్యార్థులను అందరిని ఒకచోటకు తీసుకువచ్చి క్రీడలు నిర్వహించడం ఖేల్‌ఇండియా క్రీడల ప్రత్యేకత అన్నారు. క్రీడల్లో షార్ట్‌పుట్, పరుగుపందెం, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను విద్యార్థులకు నిర్వహించారు. విజేతలుగా ఎంపికైన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో గోపవరం ఇన్‌ఛార్జి ఎంపీడీఓ నాగార్జునుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణశర్మ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ జనచైతన్యయాత్రకు చుక్కెదురు!
కడప: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు చేపట్టిన జనచైతన్య యాత్రకు వైఎస్ఆర్ కడప జిల్లాలో చుక్కెదురైంది. జనచైతన్య యాత్రలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి ఎమ్మెల్యే జయరాములు వెళ్లారు. రామేశ్వరం గ్రామస్తులు మాత్రం ఎమ్మెల్యే జయరాములును తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తికావస్తున్నా తమ తాగునీటి సమస్య తీర్చలేదని రామేశ్వరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ సభ్యత్వం రెన్యువల్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ స్థలాలు వాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం రామేశ్వరం గ్రామస్తులు తాగునీటి సమస్యలపై విన్నవిస్తున్నా నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, స్థానికులకు అక్కడ కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల్లో తప్పకుండా సమస్యలు తీర్చుతామని హామీ ఇవ్వడంతో చివరికి గ్రామస్తులు శాంతించారు. -
పట్టణాభివృద్ధి ఇష్టం లేదా ?
బద్వేలు అర్బన్: పట్టణాభివృద్ధికి సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని 7 నెలలు అవుతున్నా ఇంతవరకు రిపోర్ట్ తయారు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని అసలు పట్టణాభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా అంటూ ఎమ్మెల్యే జయరాములు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో చైర్మన్ పార్థసారథి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ కార్యాలయంలోనైనా అధికారులు అంకితభావంతో పనిచేసినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇష్టానుసారంగా సమయానికి విధులకు రాకుండా అలసత్వం వహిస్తే ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని అన్నారు. పట్టణంలో నివాసం లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వరాదని, కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపాలిటీకి పన్నుల నుంచి వచ్చే ఆదాయం మినహా ఇతర ఆదాయం లేకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని నిధులు మంజూరుచేయించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. అంతకుముందు వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే , చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తొలుత ఊరీ ఘటనలో మృతిచెందిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై రూపొందించిన అజెండాపై చర్చించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కమిషనర్ శివరామిరెడ్డి , డిఈ తులసికుమార్, ఆర్ఓ శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ మధుకుమార్‌లతో పాటు వైస్‌చైర్మన్ గాజులపల్లె శ్రీదేవి, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ సింగసాని గురుమోహన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బద్వేలు టీడీపీలో అంతర్యుద్ధం..!
ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల సమావేశం నాకెలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా సమావేశం నిర్వహిస్తావ్.. ఎమ్మెల్యేకి ఫోన్‌చేసి నిలదీసిన టీడీపీ నేత విజయజ్యోతి కడప: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు టీడీపీలో అంతర్యుద్ధం నెలకొంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కిందని ఓ నేత భావించగా, అంతలోనే పానకంలో పుడకలా మరోనేత అడ్డుతగిలారు. అవకాశవాద రాజకీయాల ముందు ప్రభుత్వ ఉద్యోగం త్యాగం చేసిన గుర్తింపు సైతం కరువైంది. వెరసి తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. మంగళవారం నిర్వహించిన ఓ సమావేశం కారణంగా విభేదాలను బహిర్గతం చేసిన వైనమిది. బ్యాంకు ఉద్యోగిగా విజయజ్యోతి బద్వేలు నియోజకవర్గ వాసులకు సుపరిచితురాలు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆమె బ్యాంకు ఉద్యోగం త్యజించారు. ఆపై ప్రత్యక్షరాజకీయాలలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైఎస్సార్సీపీకి ఉన్న అపార కేడర్ కారణంగా ఓటమి పాలయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓవైపు విజయజ్యోతి, మరోవైపు విజయమ్మ పోటీ పడుతూ ప్రత్యక్ష పోరాటం నిర్వహించారు. ఈ క్రమంలో విజయజ్యోతికి యోగివేమన యానివర్శిటీ పాలకమండలి సభ్యురాలిగా పదవి కట్టబెట్టారు. కాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గా ఎన్నికైన జయరాములు అవకాశవాద రాజకీయాల కారణంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం టీడీపీ నేత విజయజ్యోతికి ఏమాత్రం రుచించడం లేదని పరిశీలకుల భావన. ఎలాగైనా పార్టీకోసం కలుపుగోలుగా వెళ్లాలని భావించినా, ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే భావనకు ఆమె వచ్చిన ట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంపై మండిపడ్డట్లు సమాచారం. సమాచారమే లేకుండా ఎలా నిర్వహిస్తావ్.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేశాను. వైవీయూ మెంబర్‌గా ఉన్నా. నాకు సమాచారమే లేకుండా మాజీ ఎమ్మెల్యేతో కలిసి అధికారులతో ఎలా సమావేశం నిర్వహిస్తావంటూ విజయజ్యోతి స్వయంగా ఎమ్మెల్యే జయరాములుకు ఫోన్ చేసినట్లు సమచారం. ప్రోటోకాల్ రీత్యా తనకు అధికారుల సమావేశానికి వెళ్లే అర్హత ఉంది. పార్టీని కలుపుగోలుగా వెళ్లాలంటే సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి, అలా కాకుండా ఏకపక్షంగా సమావేశం నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ఆమె నిలదీసినట్లు సమచారం. ఓ దినపత్రిక నిర్వహించిన సమావేశానికి మాత్రమే హాజరయ్యానని చెప్పుకొచ్చినట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యే జయరాములు వైఖరిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ నేత విజయజ్యోతి సాక్షికి ధ్రువీకరించింది. -
ప్రజల అభిప్రాయాలను పట్టించుకోని కలెక్టర్
ఎమ్మెల్యే జయరాములు బద్వేలు(అట్లూరు): ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన కలెక్టర్ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిసర ప్రజలతో పాటు సీమాంక్ రహదారికోసం గృహాలు కోల్పోనున్న రామాంజనేయనగర్ వాసులతో కలిసి పలు విషయాలపై చర్చించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలకు భయపడాల్సిన అవసరం లేదని వారిలో ధైర్యం నింపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామనే ఆలోచన లేదని, పచ్చచొక్కాలకు ఏజంటుగా పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. మహిళల ప్రసూతి, చిన్న పిల్లల కోసం నిర్మించిన సీమాంక్ ఆసుపత్రిలో జనరల్ ఆసుపత్రిని ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. సీమాంక్ ఆసుపత్రికి నాలుగువైపులా రహదారులున్నాయని ఏ ఒక్కరి ఇల్లుగాని, చర్చి స్థలం గాని ఆసుపత్రి రహదారికి అవసరం లేదని ఆయన అన్నారు. ఆ గృహాలకు సంబంధించిన వారి అభిప్రాయాలను సేకరించకుండానే కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బద్వేలు మాజీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భీమారెడ్డి, కలసపాడు మాజీ జెడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, కాలువపల్లె మాజీ సర్పంచ్ శ్రీరాములు, కౌన్సిలర్ గోపాలస్వామి, ఎస్సీ సెల్ బద్వేలు కన్వీనర్ క్రిష్ణ తదితరులు ఉన్నారు. -
ఆస్పత్రి తరలింపునకు నిరసనగా ‘బద్వేలు’ బంద్
బద్వేలు : వైఎస్సార్ జిల్లాలోని బద్వేలులో ప్రభుత్వాస్పత్రి తరలింపును నిరసిస్తూ అన్ని పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ జరిగింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జయరాములుతో పాటు స్థానిక ప్రజలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. బద్వేలులో 100 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వాస్పత్రిని భవనం శిధిలావస్థకు చేరిందనే కారణంతో ఇటీవల ప్రసూతి వైద్య సేవల ఆస్పత్రి ప్రాంగణంలోకి మార్చారు. దీన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉన్న పాత ప్రభుత్వాస్పత్రి భవనంలోనే ప్రాథమిక వైద్య సేవలనైనా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం బంద్ నిర్వహించారు.