సాక్షి ప్రతినిధి, కడప: నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నాననీ, అధికార పార్టీలో చేరుతున్నందువల్ల నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఇట్టే పరిష్కరిస్తానని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు గట్టిగా చెప్పారు. హామీలు దంచేసి ఏడాదిన్నర కావస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులో జనం నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీళ్లే దిక్కు. జయరాములు నివాసం ఉంటున్న పోరుమామిళ్ల జనం దప్పిక తీర్చడానికి రూ.90 లక్షలతో సగిలేరు నుంచి పోరుమామిళ్ల వరకు నిర్మించిన తాగునీటి పథకం పనులు నాసిరకంగా జరిగినా కాంట్రాక్టర్లు, అధికారులను ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. పోరుమామిళ్లవాసుల గొంతులు తడపడానికి రోజుకు రూ.50 వేలు ఖర్చుచేసి 115 ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నా నీటి కటకట తీరడం లేదు. పోరుమామిళ్ల జనం నీళ్లో జయరామయ్యా అని గొంతు చించుకుంటున్నా ఎమ్మెల్యే వారి ఇబ్బందుల గురించి గొంతు విప్పే పరిస్థితిలో లేరు.
సొంత అభివృద్ధి కోసమే..:
ఎమ్మెల్యే జయరామయ్య గారు సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నోరు విప్పడం లేదంటే గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన జయరాములు ఎందుకోసం టీడీపీ కండువా కప్పుకున్నారనే విషయం వేరేగా చెప్పక్కర్లేదు. తాను ఇచ్చిన హామీలకు ఏడాదిన్నర నిండబోతున్న నేపథ్యంలోనైనా జయరాములు తన హామీల గురించి ఆలోచించాలని జనం కోరుతున్నారు.
ఈ పనైనా చేయండి
బద్వేలు మండలం అప్పరాజుపేట నుంచి అట్లూరు మండలంలోని చివరి ఆయకట్టు వరకు బ్రహ్మసాగర్ కుడికాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్సార్ సీఎంగా ఉండగా ఈ పనులు వేగంగా జరిగాయి. ఆయన మరణం తర్వాత నిధులు లేక నీరసించాయి. ఎమ్మెల్యే జయరాములు మూడు, నాలుగు కోట్ల నిధులు సాధించి ఈ పనైనా పూర్తి చేయిస్తే సుమారు 15వేల ఎకరాల భూములకు సాగునీరందించవచ్చు.
ఇదీ హామీల గతి
హామీ: బద్వేలు అభివృద్ధి కోసం రూ.100కోట్ల నిధులు తెస్తా.
అమలు : ఇంతవరకూ ప్రత్యేకంగా రూపాయి కూడా తేలేదు.
హామీ : గోపవరం, బద్వేలు మండలాల తాగునీటి ఎద్దడి నివారణకు సోమశిల బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా ఒక టీఎంసీ నీరు సరఫరా చేయిస్తా.
అమలు : ఇంతవరకూ అతీగతి లేదు.
హామీ : కాశినాయన మండలానికి తెలుగుగంగ ఎడమ కాలవ నుంచి సావిశెట్టిపల్లి, ఆకులనారాయణపల్లి, వరికుంట్ల, భాలాయపల్లి, గొటువారిపల్లి, గంగనపల్లి పంచాయతీలలోని గ్రామాలకు సాగునీరు అందిస్తా.
అమలు : ఇంతవరకూ దాని ఊసేలేదు.
హామీ : కలసపాడు మండలానికి స్పెషల్ కోటా కింద వెయ్యి పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా.
అమలు : అన్ని మండలాలకు కేటాయించిన విధంగా 130 ఇళ్లే మంజూరయ్యాయి. స్పెషల్ కోటా ప్రస్తావనే లేదు.
హామీ : బి.కోడూరుకు 200 వృద్ధాప్య పింఛన్‌లు ఇప్పిస్తా.
అమలు : 80 పింఛన్లు మాత్రమే మంజూరు చేయించారు.
హామీ : బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లి ఎస్సీకాలనీపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ లైను మార్పిస్తా
అమలు : ఇంతవరకూ విద్యుత్ లైన్ మార్చలేదు.
హామీ : అట్లూరు మండలంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం సిద్దవటం సమీపంలో నుంచి పెన్నా నీరు ఎత్తిపోతల పథకం ద్వారా సరఫరా చేయిస్తా
అమలు : ఆ పనులు ప్రతిపాదనల దశకు కూడా చేరలేదు.
హామీ : బద్వేలు నుంచి పోరుమామిళ్ల వరకూ ఉన్న సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్పిస్తా.
అమలు : ఆ ఊసే లేదు
హామీ : పోరుమామిళ్ల చెరువుకు బ్రహ్మసాగర్ నీరు తెస్తా.
అమలు : ఆ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
హామీ : ప్రతి జర్నలిస్టుకు ఇంటిస్థలంతో పాటు పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా.
అమలు : ఈ హామీకి అతీగతీ లేదు.