జయరాములు, విజయమ్మ, విజయజ్యోతి
సాక్షి, కడప : బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ముగ్గురు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. బిజివేముల వీరారెడ్డి మృతితో ఆయన కూతురు విజయమ్మ టీడీపీ పగ్గాలు చేతపట్టి పార్టీని నడిపిస్తున్నారు. వీరారెడ్డి మృతి సానుభూతితో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, 2004లో డీసీ గోవిందరెడ్డి చేతిలో పరాజయం పాలయినా, తన తండ్రి వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం కావడంతో 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎంపిక చేసిన కమలమ్మను బద్వేలు చరిత్రలో ఎన్నడు లేని విధంగా 36 వేల ఓట్ల మెజారిటీతో డీసీ గోవిందరెడ్డి గెలిపించారు. కమలమ్మ కాంగ్రెస్‌లో ఉండిపోవడంతో 2014లో వైఎస్సార్‌సీపీ తరపున జయరాములు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయజ్యోతిపై విజయం సాధించారు. ఆ తరువాత విజయమ్మకు, విజయజ్యోతికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. అవి రాజుకుంటూనే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో జయరాములు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిపోయారు. దాంతో అంతవరకు రెండు కత్తులున్న ఒరలో మూడుకత్తులయ్యాయి. కొన్నాళ్లకే ముగ్గురివి మూడు దారులయ్యాయి. ఈ నేప«థ్యంలో టీడీపీ అభ్యర్థిగా విజయమ్మ సూచించిన లాజరస్‌ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దానిపై తీవ్ర వ్యతిరేక రావడంతో విజయమ్మ ప్రత్యామ్నాయంగా ఓబులాపురం రాజశేఖర్‌ను సూచించి, ముఖ్యమంత్రితో ఆమోదముద్ర వేయించుకున్నారు. దాంతో విజయజ్యోతి రగిలిపోయారు.
బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి, 2014లో ఓడిపోయినా పార్టీలో కొనసాగుతూ 2019పై ఆశతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకపోతున్న తనను కాదని ఎవరో కొత్త వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ముఖ్యమంత్రిని నిలదీయడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చేసిన రాజీప్రయత్నాలు సఫలం కాలేదు. ఇదిలా ఉండగా బుధవారం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల రామస్వామి ఆలయంలో విజయమ్మ ఆమె కుమారుడు రితీష్‌రెడ్డి, పార్టీ నాయకులు రాజశేఖర్‌తో కలసి పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు తాను ముఖ్యమంత్రితో చర్చి స్తున్న సమయంలోనే విజయమ్మ ప్రచారం షురూ చేయడం జ్యోతికి పుండుమీద కారం చల్లినట్లయింది.
తనకు టీడీపీ టిక్కెట్ లభించదనే నిర్ణయానికి వచ్చిన విజయజ్యోతి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు శుక్రవారం పోరుమామిళ్లలోని వసుంధర కల్యాణమండపంలో తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా, విజయజ్యోతిని గెలిపించండి అంటూ పలు పోస్టర్లు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
రగులుతున్న జయరాముడు
ఇదిలా ఉండగా మరో వైపు ఎమ్మెల్యే జయరాములు కూడా తనను అధిష్టానం పట్టించుకోకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తాను కూడా పోటీలో ఉంటానని, స్వతంత్రంగా అయినా పోటీ చేస్తానని, తన వర్గీయులతో అంటున్నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం బద్వేలు టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment