ఎమ్మెల్యే జయరాములు
బద్వేలు(అట్లూరు): ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన కలెక్టర్ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిసర ప్రజలతో పాటు సీమాంక్ రహదారికోసం గృహాలు కోల్పోనున్న రామాంజనేయనగర్ వాసులతో కలిసి పలు విషయాలపై చర్చించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలకు భయపడాల్సిన అవసరం లేదని వారిలో ధైర్యం నింపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామనే ఆలోచన లేదని, పచ్చచొక్కాలకు ఏజంటుగా పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు.
మహిళల ప్రసూతి, చిన్న పిల్లల కోసం నిర్మించిన సీమాంక్ ఆసుపత్రిలో జనరల్ ఆసుపత్రిని ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. సీమాంక్ ఆసుపత్రికి నాలుగువైపులా రహదారులున్నాయని ఏ ఒక్కరి ఇల్లుగాని, చర్చి స్థలం గాని ఆసుపత్రి రహదారికి అవసరం లేదని ఆయన అన్నారు. ఆ గృహాలకు సంబంధించిన వారి అభిప్రాయాలను సేకరించకుండానే కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదన్నారు.
బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బద్వేలు మాజీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి భీమారెడ్డి, కలసపాడు మాజీ జెడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, కాలువపల్లె మాజీ సర్పంచ్ శ్రీరాములు, కౌన్సిలర్ గోపాలస్వామి, ఎస్సీ సెల్ బద్వేలు కన్వీనర్ క్రిష్ణ తదితరులు ఉన్నారు.
ప్రజల అభిప్రాయాలను పట్టించుకోని కలెక్టర్
Published Wed, May 6 2015 5:04 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement