పట్టణాభివృద్ధి ఇష్టం లేదా ?
బద్వేలు అర్బన్: పట్టణాభివృద్ధికి సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని 7 నెలలు అవుతున్నా ఇంతవరకు రిపోర్ట్ తయారు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని అసలు పట్టణాభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా అంటూ ఎమ్మెల్యే జయరాములు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో చైర్మన్ పార్థసారథి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ కార్యాలయంలోనైనా అధికారులు అంకితభావంతో పనిచేసినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇష్టానుసారంగా సమయానికి విధులకు రాకుండా అలసత్వం వహిస్తే ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని అన్నారు. పట్టణంలో నివాసం లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరాదని, కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపాలిటీకి పన్నుల నుంచి వచ్చే ఆదాయం మినహా ఇతర ఆదాయం లేకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని నిధులు మంజూరుచేయించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. అంతకుముందు వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే , చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తొలుత ఊరీ ఘటనలో మృతిచెందిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై రూపొందించిన అజెండాపై చర్చించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కమిషనర్ శివరామిరెడ్డి , డిఈ తులసికుమార్, ఆర్‌ఓ శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మధుకుమార్‌లతో పాటు వైస్‌చైర్మన్ గాజులపల్లె శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ సింగసాని గురుమోహన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.