ఉద్యమం.. ఉద్రిక్తం | Tension oN Municipal contract workers Strike | Sakshi
Sakshi News home page

ఉద్యమం.. ఉద్రిక్తం

Published Fri, Oct 12 2018 8:26 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Tension oN Municipal contract workers Strike - Sakshi

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ పారి శుధ్య కార్మికుల సమ్మె తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తతకు దారితీసింది. 279 జీఓను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్ట ణాలలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం అధికారులు గురువారం కాంట్రాక్ట్‌ కార్మికుల స్థానంలో వేరే వారితో స్థానిక వీకర్స్‌ కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసి సమ్మెలో ఉన్న కార్మికులు అక్కడికి చేరుకుని ప్రైవేట్‌ వ్యక్తులను పనులు చేయవద్దని కోరారు. తాము సమ్మెలో ఉన్నామని, సహకరించాలని కోరారు.

 ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులను బలవంతంగా జీపులోకి ఎక్కించడం మొదలుపెట్టారు. దాంతో కార్మికులకు, పోలీస్‌లకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళా కార్మికులు మర్రి చంద్రకళ, మండెల్లి జుయసుధ, కూనుపాముల దయామణి స్పృహ తప్పారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జీపులోకి మహిళా కార్మికులను ఎక్కించి వెనుక డోర్‌ వేయకుండానే వాహనాన్ని పోనివ్వడంతో కొంతమంది కార్మికులు కింద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

మహిళా కార్మికులు తాటికొండ మిరియ, ముత్యాలమహాలక్ష్మి లకు తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గోసాల రవి అనే కార్మికుడి చేయి బెణికింది. తరువాత స్థానిక ఏరియా ఆసుపత్రి అత్యవసర విభాగం వద్దకు పారిశుధ్య కార్మికులు చేరుకుని ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్‌ కార్మికులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్మిక నేతలు కర్రి నాగేశ్వరరావు, డి.సోమసుందర్, మండల నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు, గుంపుల సత్యకృష్ణ, జనసేన నాయకులు నీలపాల దినేష్, సీఐ మూర్తి, ఎస్సైలు, ట్రాఫిక్‌ పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో చర్చలు జరిగాయి. 

ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదు
ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డి.సోమసుందర్, కర్రి నాగేశ్వరరావులు హెచ్చరించారు. ఓ వైపు కార్మికులు సమ్మె చేస్తుండగా పోటీగా కూలీ లను తీసుకువచ్చి పారిశుధ్య పనులు చేయించడం సరికాదన్నారు. 279 జీవో విధానం అంతా లోపభూయిష్టమన్నారు. ఎన్నో ఉద్యమాలు చూశామని పోలీసులు దౌర్జన్యం చేసినా, పోటీ కార్మికులను దింపినా ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు. 

రానున్న ఎన్నికలలో సత్తా చూపించండి
ప్రభుత్వం పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికులపై కక్షసాధింపులు చేస్తున్నందున, కార్మికులు రానున్న ఎన్నికలలో తమ సత్తా చాటాలని ఓట్లు రూపంలో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని ఏఐటీయూసీ నాయకులు డి.సోమసుందర్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. రక్తం కారుతున్నప్పటికి సమ్మె వీడవద్దన్నారు. ఉద్యమాలు తీవ్రతరం చేద్దాం అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ, తమ ఇళ్ళు వద్ద ఆయా సందర్భాలలో పారిశుధ్య కార్మికులచే పనులు చేయించుకుంటున్నారని, వీరికి కాంట్రాక్ట్‌ కార్మికులు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారులకు సైతం పారిశుధ్య కార్మికుల సంక్షేమం పట్టడం లేదన్నారు. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి: సీఐ మూర్తి
పారిశుధ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల స్థానంలో ప్రభుత్వం వేరే కార్మికులతో పనులు చేయిస్తుందని, వారిని అడ్డుకోవడం తగదని సీఐ మూర్తి అన్నారు. పోలీసులు డ్యూటీలు చేస్తున్నారే తప్ప కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని వివరించారు. 

8వ రోజుకు సమ్మె
పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం నాటికి 8వ రోజుకు చేరింది. పురపాలక సంఘం శిబిరం వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేయడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement