అడుగడుగునా నిలదీత
శ్రీకాకుళం : ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో ప్రచారం చేసేందుకు తెలుగుదేశం చేపట్టిన జనచైతన్య యాత్రలకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ యాత్రల్లో పాల్గొన్న నేతలను ప్రజలు అడుగడుగునా నిలదీశారు. సంక్షేమ పథకాల అమలులో వివక్షపై పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన టెక్కలిలోని పెదరోకళ్లపల్లిలో గ్రామస్తులు జనతచైతన్య బృందాన్ని నిలదీశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును విమర్శించారు. రేషన్ దుకాణాల్లో వేలిముద్ర వ్యవస్థ సక్రమంగా సరుకులు అందడం లేదని మండిపడ్డారు.
పాఠశాల లోపలి నుంచి మురుగు కాలువ తవ్వడంపై ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సర్పంచ్ భర్త ధర్మారావుతో వాగ్వాదానికి దిగారు. నరసన్నపేట నియోజకవర్గంలోని వనవిష్ణుపురంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని గ్రామస్తులు నిలదీశారు. నౌతలలో ప్రజల నుంచి స్పందన లేకపోగా తామరాపల్లిలో సీఐ, ఎస్‌ఐల పర్యవేక్షణలో యాత్ర కొనసాగింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో శాసనసభ్యుడు కిమిడి కళా వెంకటరావు గైర్హాజరు కాగా ఆయన కుమారుడు మల్లిక్ హాజరయ్యారు. పాతపట్నం నియోజకవర్గంలో జరిగిన జనచైతన్య యాత్రలకు ఆ పార్టీ ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. పలాస నియోజకవర్గంలోని మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో ప్రజల నుంచి స్పందన కరువైంది.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. పాలకొండ నియోజకవర్గంలోని వెలగవాడలో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. పీఆర్ రాజుపేటలో జరిగిన కార్యక్రమంలో ఓ వృద్ధురాలు తనకు పింఛను ఇవ్వడం లేదని అధికారులను నిలదీసింది. రాజాం నియోజకవర్గంలోని బుచ్చిం పేట, ఆగూరులో ఇళ్లు మంజూరు చేయకపోవడంపై పలువురు మహిళలు ఎమ్మెల్సీ ప్రతిభాభారతిని ప్రశ్నించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలకు విప్ రవికుమార్ గైర్హాజరయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో జరిగిన జనచైతన్య యాత్రను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు.