పదేపదే అదే సీన్ రిపీట్!
ఏలూరు (మెట్రో) : ముఖ్యమంత్రి చంద్రబాబు అదే సీన్ రిపీట్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో 21 సార్లు పర్యటించిన ఆయనకు వచ్చిన ప్రతిసారీ జిల్లా రుణం తీర్చుకోలేనిది అంటూ మాట్లాడటం అలవాటుగా మారింది. దెందులూరులో గురువారం నిర్వహించిన జనచైతన్య యాత్రల్లోనూ ఇదే మాట వల్లెవేశారు. జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఈ జిల్లాపై నాకో అభిమానం ఉంది, జిల్లాపై నాకో బాధ్యత ఉంది. పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకోలేనిది’అంటూనే జిల్లాకు ఒక్క వరాన్నీ ప్రకటించలేదు. జిల్లాలో అందరు ఎమ్మెల్యేలనూ గెలిపించారు, అన్ని మునిసిపాలిటీలను ఇచ్చారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సొసైటీలు ఇలా ప్రతి ఒక్కదానిలో తెలుగుదేశాన్ని దీవించిన జిల్లా రుణం తీర్చుకోలేనిది అంటూ ప్రసంగించారు.
అభివృద్ధికి అధ్యయనం చేయండి
జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యేలు, నాయకులు, మేయరు అందరూ అధ్యయనం చేయాలని కోరారు. అధ్యయనం అనంతరం ఏమి కావాలో చెబితే అది చేస్తానంటూ ఏ వరమూ ప్రకటించకుండానే ప్రసంగం ముగించారు. ఆక్వాకల్చర్ కింద జిల్లాకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి, అభివృద్ధి అవుతుందని అన్నారు. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే రోడ్లు, మురుగునీటి పారుదల ప్రక్రియ వంటివి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఇళ్లు కట్టించడం పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే భూముల విలువ పెరిగిపోయింది. దీంతో ఇళ్ల నిర్మాణాలపై ఆలోచన చేస్తున్నాం అన్నారు. త్వరలోనే జిల్లాలోని పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
కొల్లేరుపైనా దాటవేత
కొల్లేరులో చాలామంది పేదలున్నారు. వారికి న్యాయం చేయాలి అని మాట్లాడిన చంద్రబాబు ఏళ్లనాటి కొల్లేరు సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పలేదు. నిట్ కోసం సేకరించిన 400 ఎకరాల స్థలంలో మంచి ఇండస్ట్రీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. జిల్లాలో ఉన్న కృష్ణాడెల్టా పరిధిలో గోదావరి జలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముందుగా దెందులూరుకు హెలికాప్టర్‌లో చేరుకున్న చంద్రబాబు హెలిపాడ్ నుంచి సైకిల్ తొక్కుతూ దళితవాడలోకి వెళ్లారు. దళితవాడ మొత్తం పాదయాత్ర చేశారు. సభావేదిక వద్దకు చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీయే అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు,పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవ నాయుడు, పితాని సత్యనారాయణ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.