దమ్ముంటే విజయవాడ కాల్‌మనీ నిందితులను శిక్షించండి | Kothapalli Subbarayudu fire on tdp govt | Sakshi
Sakshi News home page

దమ్ముంటే విజయవాడ కాల్‌మనీ నిందితులను శిక్షించండి

Published Fri, Dec 18 2015 1:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Kothapalli Subbarayudu fire on tdp govt

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యానికి పరాకాష్టగా నిలిచిన విజయవాడ కాల్‌మనీ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులైన టీడీపీ నాయకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అవసరానికి అప్పు తీసుకున్న పేద మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, వారిని అసభ్యంగా చిత్రించి వీడియోలను బయట పెడతామని బెదిరింపులకు పాల్పడడం టీడీపీ నాయకులకు తప్పుగా అనిపించకపోయినప్పటికీ, సభ్య సమాజం ఈ విషయం తెలుసుకుని ఛీత్కరించుకుంటోందన్నారు.
 
  చంద్రబాబు ప్రభుత్వం అటువంటి వారందరినీ వెనకేసుకు వస్తూ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తలవంపులన్నారు. టీడీపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నేరస్తులున్నారనడానికి విజయవాడ సంఘటనే నిదర్శనమన్నారు. వీరిని కేసుల నుంచి తప్పించి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ప్రభుత్వం అమాయకులైన చిరు వ్యాపారులపై దాడులకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. అసలు నేరస్తులను విడిచిపెట్టి వైఎస్సార్ సీపీ నాయకులను నేరస్తులుగా చిత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సుబ్బారాయుడు హితవు పలికారు. అమాయకులైన చిరు వ్యాపారులను వదిలేసి టీడీపీలోని నేరస్తులైన నేతలను అరెస్టు చేయడం ద్వారా చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని, ప్రజా సంఘాలు, బాధితులతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement