వీఐపీ ఘాట్‌ను వదిలి గోష్పాద క్షేత్రం ఘాట్‌లో పర్యటించిన సీఎం
జన సమ్మర్ధం నడుమ కొనసాగిన చంద్రబాబు నడక
మీడియా ప్రతినిధులపై కస్సుబుస్సు
పుష్కరాలకు ఇంకా చాలా చేయాలని వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పుష్కరాల తొలి రోజు రాజమండ్రిలో చోటుచేసుకున్న దారుణ ఘటన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తీరులో మార్పు రాలేదు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట సీఎం పర్యటించడం, గంటల కొద్దీ స్నానఘట్టంలోనే ఉండటం వల్లే రాజమండ్రిలో విషాద ఘటన జరిగిందన్న వాదనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కొవ్వూరు వచ్చిన ముఖ్యమంత్రి వీఐపీ ఘాట్‌ను సందర్శిస్తారని, ఏరియల్ సర్వే ద్వారా ఏర్పాట్లను పరిశీలిస్తారని అందరూ భావించారు. కానీ సీఎం మాత్రం జిల్లాలో పుష్కర యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండే కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆకస్మిక పర్యటన చేశారు.
గంట ముందు మాత్రమే పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో పోలీసులు పెద్దసంఖ్యలో ఘాట్‌కు చేరుకున్నారు. అప్పటికే సుమారు 40వేల మంది వరకు భక్తులు ఉండటంతో అధికారులు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌కు గురయ్యారు. సరిగ్గా 11.40 గంటలకు సీఎం కాన్వాయ్ గోష్పాద క్షేత్రం ఘాట్ ప్రాంగణంలోకి వచ్చింది. అక్కడ వాహనం దిగిన చంద్రబాబు కాలినడకన ఘాట్ చివరి వరకు వెళ్లారు. మొత్తం ప్రాంగణమంతా కలియదిరిగారు. పారిశుధ్య పరిస్థితి, ఏర్పాట్లను పరిశీలించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ యాత్రికులను అడిగి తెలుసుకున్నారు.
గోదావరి జలాలను శుభ్రం చేయిస్తున్నాం
పుష్కరాల నేపథ్యంలో గోదావరి జలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని సీఎం చెప్పారు. గోష్పాద క్షేత్రం ఘాట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ‘పుష్కరాలకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పా ట్లు చేశాం.. అయినా ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు. కొవ్వూరులో ఘాట్ల వెంబడి ప్రధాన రోడ్డు ఒకటే ఉండటం, అనుసంధాన రహదారులు లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని సీఎం అంగీకరించారు. కొవ్వూరుకు బస్సుల సంఖ్య పెరగాల్సి ఉందని విలేకరులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, ఎన్ని అవసరమైతే అన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పడవల్లో వెళ్లొచ్చుగా..
ఘాట్లలో క్షేత్రస్థాయి పర్యటన కంటే మీరు ఘాట్ల వెం బడి పడవల ద్వారా ఏర్పాట్లు పరిశీలించొచ్చు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘ఆ చూద్దాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దశలో ప్రశ్నలు సంధిస్తున్న మీడియా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మీడియా (సాక్షి కాదు) లోగోను పక్కకు నెట్టేశారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైనప్పటి నుంచి నరాలు తెగే ఉత్కంఠకు గురైన అధికారులు అర్ధగంటకుపైగా సాగిన సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న ఘాట్లలో ఆకస్మికంగా పర్యటించడం సరికాదన్న అభిప్రాయం అధికార వర్గాల నుంచే వ్యక్తమవడం గమనార్హం. కనీసం ముందుగా సమాచారం వచ్చినా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించే వాళ్లమని అధికారులు చెబుతున్నారు. కాగా, పర్యటనలో సీఎం వెంట మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి మురళీమోహన్, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు ఉన్నారు.
అయినా.. మారలేదు
Published Fri, Jul 17 2015 2:04 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement