పాతపాటే
సాక్షి ప్రతినిధి, ఏలూరు :నూతన సంవత్సరం తొలి రోజున జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మళ్లీ పాతపాటే పాడారు. అన్ని స్థానాలూ కట్టబెట్టిన ఈ జిల్లాను చాలా అభివృద్ధి చేయాలని ఉన్నా భూముల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోందని చేతులెత్తేశారు. అయినా సరే.. అన్ని జిల్లాల కంటే ‘పశ్చిమ’కే తన ప్రాధాన్యమంటూ ‘రుణం’ మాటలు వల్లెవేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి పోలవరం, ఏలూరు మం డలం చాటపర్రు గ్రామాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన నిట్, నరసాపురం పోర్టు విషయాలను మరోసారి ప్రస్తావించడం తప్ప జిల్లా ప్రగతికి దోహదపడే ఏ ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడంతోపాటు సంక్రాంతి సంబరాలను ప్రారంభించేలా ముఖ్యమంత్రి పర్యటనను ఖరారు చేశారు. అరుుతే, ఉన్న ట్టుండి షెడ్యూల్ మారిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడంతోపాటు ఎత్తిపోతల పథకంపై స్పష్టమైన ప్రకటన చేసేం దుకు చంద్రబాబు నేరుగా గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి పోలవరం వెళ్లారు.
ఎత్తిపోతలపై స్పష్టీకరణ
గత నెలలో జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు పోలవరం ఎత్తిపోతలపై సూటిగా మాట్లాడకుండా సముద్రం లోకి వృథాగా పోతున్న నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని ప్రకటించారు. గురువారం దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. పోలవరంలో, ఆ తర్వాత చాటపర్రు బహిరంగ సభలో మాట్లాడుతూ.. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను రాయలసీమకు తరలిస్తామని కుండబద్దలు కొట్టారు. పోలవరం ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకం రెండూ అవసరమేనని చెప్పుకొచ్చారు.
తూతూమంత్రంగా చాటపర్రు టూరు
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు తమ గ్రామానికి వస్తున్నారని సంబరపడిన చాటపర్రు గ్రామస్తులకు ఆయన పర్యటన మొక్కుబడిగా సాగడంతో కొంత నిరాశకు లోనయ్యారు. ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్ స్వగ్రామం కావడంతో చాటపర్రులో సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సమయం తక్కువగానే ఉన్నా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామానికి సంక్రాంతి కళ తీసుకొచ్చారు. గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి గిరిజన నృత్యా లు, హరిదాసుల గీతాలాపనలు, భోగి మంటలకు సన్నాహాలు చేశారు. గంగి రెద్దులను ఆడించేందుకు ముస్తాబు చేశారు. అయితే, బాబు ఇవేమీ చూడకుండానే గ్రామంలో మొక్కుబడిగా పర్యటన ముగించేశారు. గ్రామస్తులతో ఎక్కడా ముఖాముఖి మాట్లాడలేదు. పోలవరం ఆకస్మిక పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు రావాల్సిన చంద్రబాబు సాయంత్రం 4.55 గంటలకు చాటపర్రు చేరుకున్నారు. వచ్చీరావడంతో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, చాటపర్రు వాసి రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌తో రెండు నిమిషాలపాటు మాట్లాడించిన చంద్రబాబు ఆ తర్వాత మైకు తీసుకుని ప్రసంగించారు. చీకటి పడుతుండటంతో గతంలో మాదిరిగా కాకుండా కేవలం ఇరవై నిమిషాల్లోనే ప్రసంగం ముగించేశారు.
ప్రాజెక్టులు అడుగుతారు కానీ..భూముల ఊసెత్తరు
చంద్రబాబు తన ప్రసంగంలో జిల్లా ప్రజాప్రతినిధులకు రెండే రెండు మాటలతో క్లాసు పీకారు. ‘జిల్లాలో ఏమైనా పరిశ్రమలు స్థాపించాలని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రాజెక్టులు అడుగుతారు. కానీ.. భూములిప్పించరు. మరి నేను ఎలా పరిశ్రమలు తేగలను. ఇప్పటికైనా భూములు ఎక్కడున్నాయో చూడండి. అవసరమైతే ప్రభుత్వమే కొనేలా ఏర్పాటు చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. ఓ ఏడాదిపాటు ఆలస్యమైనా నిట్ జిల్లాకే దక్కుతుందని భరోసా ఇచ్చిన సీఎం మాగంటి బాబు విజ్ఞప్తి మేరకు వేలాది ఎకరాలకు సాగునీరిందించే పోణంగిపుంత అభివృద్ధికి రూ.9 కోట్లు వెంటనే విడుదల చేయిస్తానని ప్రకటించారు. అదేవిధంగా స్మార్ట్ విలేజ్‌గా మార్చేందుకు చాటపర్రుకు ప్రభుత్వపరంగా రూ.కోటి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికప్పుడు చేసిన ఈ రెండు ప్రకటనలు తప్పించి జిల్లా ప్రగతి రూపురేఖలు మార్చే బృహత్తర ప్రాజెక్టులు గానీ నిధుల విడుదలకు సంబంధించిన ప్రకటన గానీ సీఎం నోటివెంట రాలేదు.