సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు.. నిస్సిగ్గుగా బుకాయింపు! ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గోబెల్స్‌ను తలదన్నే రీతిలో అంతులేని అబద్ధాలాడారు. యథాప్రకారం హైదరాబాద్‌ను తానే నిర్మించానని.. సెల్‌ఫోన్‌నూ తానే కనిపెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇదేం ఖర్మరా.. అని అంతా అనుకోవాల్సిందే మరి!
1. మేనిఫెస్టో మాయం..
చంద్రబాబు: కేవలం ఆరు పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలు చెప్పుకున్న సీఎం జగన్ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.
వాస్తవం: అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలోనే 98 శాతం హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ సిసలైన నిర్వచనం చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకూ రూ.1,77,585.51 కోట్లు అందచేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఈ స్థాయిలో పేదల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే ప్రథమం. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర పేదలకు ప్రయోజనం చేకూర్చారు.
ఇది పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తోందని సామాజికవేత్తలు ప్రశంసిస్తుంటే చంద్రబాబుకు రుచించడం లేదు. 2014 ఎన్నికల్లో వందలకొద్దీ హామీలను గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానంటూ నమ్మబలికారు. అసలు రూ.87 వేలు కోట్లు, వడ్డీ రూ.24 వేలు కోట్లు కలిపి మొత్తం రూ.1.11 లక్షల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు విదిల్చి (అది కూడా సున్నా వడ్డీని ఎగ్గొట్టి) నయ వంచన చేశారు. రూ.14 వేల కోట్ల రుణాలను మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను దగా
2. ఓ గేటులో 1/4 బిగించి హంగామా
చంద్రబాబు: పోలవరం ప్రాజెక్టుకు గేట్లు పెట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో సహా 72 శాతం పనులు నేనే పూర్తి చేశా...
వాస్తవం: పోలవరం స్పిల్‌వేకు 25.72 మీటర్ల స్థాయిలో 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి హైడ్రాలిక్ సిలిండర్లు, హాయిస్ట్‌లను అమర్చాలి. చంద్రబాబు హయాంలో పోలవరం స్పిల్‌వే పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్‌వేలో 39, 40 పియర్స్ మాత్రమే 32 మీటర్ల స్థాయి వరకు చేశారు. ఆ స్థాయిలో గేట్లను అమర్చడానికి వీలుకాదు. 2018 డిసెంబర్ 24న రెండు పియర్స్ మధ్య నాలుగు స్కిన్ పేట్లను వెల్డింగ్ చేసి (ఇది ఒక గేటులో నాలుగో వంతు) అడ్డుగా నిలిపారు.
దీంతో 48 గేట్లు అమర్చినట్లు, ప్రాజెక్టు పూరై్తనట్లు భ్రమ కల్పించారు. చంద్రబాబు అమర్చిన గేటు అనంతరం గాలి ఉద్ధృతికి రెండు పియర్స్ నుంచి కిందకు పడిపోయింది. ప్రాజెక్టు వద్దకు బస్సు యాత్రలతో భజన చేయించుకునేందుకు ఏకంగా రూ.వంద కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా తీవ్రతలోనూ, గోదావరి వరద ఉద్ధృతిలోనూ స్పిల్‌వేను పూర్తి చేసి 48 గేట్లను బిగించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరదను అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యే దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 12,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంకల్పించారు. మొత్తమ్మీద ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 47.94% పూర్తయ్యాయి.
పరిహారం.. ఫలహారం
చంద్రబాబు: న్యాయస్థానాల్లో దాఖలు కేసులను ఉపసంహరించుకునేలా రైతులతో చింతమనేని ప్రభాకర్ ద్వారా చర్చించి పోలవరం కుడి కాలువను పూర్తి చేశా..
వాస్తవం: దివంగత వైఎస్సార్ హయాంలోనే పోలవరం కుడి కాలువ 95% పూరై్తంది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారితో భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు వేయించి కుడి కాలువ పనులను చంద్రబాబు అడ్డుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను కేసులు వేయించిన రైతులతో చింతమనేని ద్వారా మంతనాలు జరిపి ఎకరానికి గరిష్టంగా రూ.69 లక్షల చొప్పున రూ.720 కోట్ల మేర పరిహారాన్ని అందించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా ఐదు శాతం పనులు చేశారు.
4. అవగాహనారాహిత్యంతో..
నాడు కమీషన్లు వచ్చే పనులకే చంద్రబాబు పచ్చజెండా ఊపారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే నదీ గర్భంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక మధ్యలోనే వదిలేశారు.
2019 మే 29 నాటికి పరిస్థితి ఇదీ! 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరదలు వచ్చాయి. నదీ గర్భంలో కాఫర్ డ్యామ్‌లు అడ్డంకిగా ఉండటం వల్ల వరద ఉద్ధృతి పెరిగి ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గత సర్కారు అవగాహనా రాహిత్యం, కమీషన్ల దాహమే పోలవరం పనుల్లో జాప్యానికి మూలకారణం.
5. కళ్లాల వద్దే కొనుగోళ్లు కనపడవా?
చంద్రబాబు: ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. దళారులతో కలిసి అధికారపార్టీ నేతలు రైతులను దోచుకుంటున్నారు.
వాస్తవం: ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మూడున్నరేళ్లలో రూ.48,974 కోట్లతో రైతుల నుంచి 2.62 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం రైతులను దగా చేస్తుంటే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.
బీసీల వెన్నెముక విరిచింది మరిచావా బాబూ..?
చంద్రబాబు: సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు. జనాభాలో 50% ఉన్న బీసీలకు పదవులివ్వకుండా సామాజిక అన్యాయం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ పథకాలతో ఎంత ప్రయోజనం చేకూర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. టీడీపీకీ బీసీలే వెన్నెముక.
వాస్తవం: బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకగా అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని రీతిలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పది మందికి స్థానం కల్పించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం లాంటి అత్యంత కీలకమైన శాఖలు అప్పగించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు.
అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీకి 8 రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో 4 సీట్లు బీసీలకే ఇచ్చారు. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలతో హైకోర్టులో సవాల్ చేయడంతో 24 శాతానికి తగ్గిపోయాయి. చంద్రబాబు కుట్ర వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంతో, గతంలో ఉన్న 33% కంటే ఎక్కువగా అవకాశం ఇస్తానని మాటిచ్చిన సీఎం జగన్ ఆ మేరకు సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ మేయర్లుగా సింహభాగం బీసీ వర్గాల వారినే నియమించారు. బీసీల కోసం శాశ్వత కమిషన్‌ను నియమించారు.
బీసీ సామాజిక వర్గాల కోసం 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో సింహభాగం ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో ఇప్పటిదాకా రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్లు దక్కాయి. పరిపాలన భాగస్వామ్యం కల్పించడం, ఆర్థికంగా చేయూత, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ వర్గాల సామాజిక సాధికారతకు సీఎం జగన్ బాటలు వేశారు.
తోకలు కత్తిరిస్తా.. తాటతీస్తా!
2014లో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ బెదిరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హెచ్చరించారు. నాడు చంద్రబాబు 25 మందితో కూడిన తన మంత్రివర్గంలో బీసీలకు ఆరు పదవులు మాత్రమే ఇచ్చారు. 2014–19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు.
జీవనాడి జాప్యానికి బాబే కారణం
చంద్రబాబు: ప్రతి సోమవారాన్ని పోలవారంగా పరిగణించి సమీక్ష చేశా. నెలకు ఒకసారి ప్రాజెక్టు వద్దకే వెళ్లి సమీక్షించా. కేంద్రమే నిధులు ఇస్తుంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాశనం చేసింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి నేనే కారణమంటున్నారు..
వాస్తవం: విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల దాహం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నాడు చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని ఒప్పుకోవడంతో కేంద్రం రూ.20,398 కోట్లకే పరిమితం చేసింది. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు కాగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168 కోట్లు అవుతుంది. ఇదే అంశాన్ని సీఎం జగన్ పలు దఫాలు కేంద్రానికి వివరించి సవరించిన అంచనా వ్యయం ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు.
అరకొరగా ఫీజులు.. ఆపై బడాయిలు
చంద్రబాబు: నేను అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చా. సీఎం జగన్ కేవలం 11 లక్షల మందికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. అదీ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. విద్యార్థుల తండ్రులు ఆ డబ్బులు తీసుకుని మద్యం తాగుతున్నారు.
వాస్తవం: ఇంజనీరింగ్ కళాశాలలో గరిష్టంగా ఫీజు రూ.1.10 లక్షలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. రూ.1,700 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్ డబ్బులను ఎగ్గొట్టడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. సీఎం జగన్ అధికారంలో చేపట్టాక ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ఏటా రెండు వాయిదాలలో రీయింబర్స్‌మెంట్ కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లులు కాలేజీలకు వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుని సదుపాయాలు, బోధనలో నాణ్యతను ఆరా తీయాలనే ఉద్దేశంతో వారి ఖాతాల్లో జమ చేస్తుంటే దారుణంగా అవమానించడం చంద్రబాబుకే చెల్లింది.
చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా..
Comments
Please login to add a commentAdd a comment