సీఎం ఎందుకు వస్తున్నట్టో!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటన ఓ ప్రసహనంలా మారనుంది. గతేడాది జనవరి 1న ఏలూరు సమీపంలోని చాటపర్రులో పర్యటించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం ఈ ఏడాదిలో తొలి రోజైన శుక్రవారం కూడా ఏలూరులోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన పర్యటనకు ఎంచుకున్న ఏలూ రు ప్రభుత్వాసుపత్రిలోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) ప్రారంభోత్సవ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎంసీహెచ్ భవన నిర్మాణం పూర్తయింది.
అయితే, ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించేందుకు ఒక్క పరికరాన్నీ ఏర్పాటు చేయలేదు. కనీసం మంచాలు కూడా లేవు. తల్లీబిడ్డలకు వైద్యసేవలు అందించేందుకు వైద్యు లు, సిబ్బంది నియామకం పూర్తి కాలేదు. ఇక్కడ నెలకొల్పాల్సిన టెలీ రేడియోలజీ విభాగం, 60 రకాల రోగనిర్ధారణ ల్యాబ్, ప్రత్యేక కార్డియాలజీ విభాగం ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఇవేమీ లేకుండా ఖాళీ భవనాలను సీఎం ప్రారంభించడం వల్ల ప్రయోజనమేమిటన్న వాదనలు ఆసుపత్రి వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అయితే, సీఎం రాకను పురస్కరించుకుని కొన్ని మంచాలను రాత్రికి రాత్రికి ఆసుపత్రిలో వేసినా సౌకర్యాల కల్పన మాత్రం ఇంకా పూర్తికాలేదు.
వైఎస్ హయాంలో అంకురార్పణ
జిల్లా కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించిన ఈ నూతన ఆసుపత్రి భవనానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ప్రథమార్థంలో అంకురార్పణ చేశారు. జిల్లా నలుమూలల నుంచి త రలివచ్చే రోగులకు ఆధునిక వైద్య సేవలందించే లక్ష్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్ మంజూరు చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత బాలారిష్టాల మధ్య ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఆసుపత్రిలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం నేటికీ మాటలకే పరిమితమైంది.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా
ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. నూతన సంవత్సరంలో తొలి రోజైన శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన తల్లీబిడ్డల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో అందుబాటులోకి వచ్చే ఉచిత ఆరోగ్య పరీక్షల సౌకర్యాన్ని, 102 కాల్ సెంటర్‌ను, టెలీ మెడిసిన్, త ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకాలను ముఖ్యమంత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం విలేకరులతో మాట్లాడతారు. సాయంత్రం 4.45 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విజయవాడ వెళతారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొంటారు.