18న సీఎం రాక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ప్రజలతో కలిసి 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తానని చంద్రబాబు గతంలో ప్రకటిం చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకచోట పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా లో కలెక్టర్ సహా ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోనే ఆయన పర్యటన ఖరారు కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని వెలివెన్ను నుంచి కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణగూడెం వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర ఏడు గ్రామాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగేలా సన్నాహాలు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లో ఓ పల్లెను స్మార్ట్ విలేజ్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది. స్వచ్ఛ భారత్ కింద కూడా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఉభయగోదావరి జిల్లాలో ఏదో ఒక జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 18న పర్యటిస్తారని సమాచారం వచ్చిందని కలెక్టర్ చెప్పా రు. సీఎం మన జిల్లాలోనే పాదయాత్ర చేస్తారని తాము భావిస్తున్నామని, ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎవరికీ సెలవులు లేవు
చంద్రబాబు నాయుడు ఈ నెల 18న జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నారని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో ఆయన చర్చించారు. అధికారులంతా సంక్రాంతిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈనెల 17, 18 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ సెలవులు ఇచ్చేది లేదని చెప్పారు. జిల్లా అధికారులంతా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ కోరారు.