
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ చేపట్టిన జనచైతన్య యాత్ర మంచి ఫలితాన్ని ఇచ్చిందని పార్టీ కోర్‌కమిటీ అభిప్రాయపడింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతోందని, ఈ నెల 13న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన తర్వాత మళ్లీ యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ కోర్‌కమిటీ, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో యాత్ర అనుభవాలు, అమిత్‌షా పర్యటనపై ప్రధానంగా చర్చించారు. అమిత్‌షా పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమలనాథులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఆ రోజున 7 నుంచి 8 వేల మంది శక్తి ప్రముఖ్‌లతో జరిగే సమావేశంతో పాటు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు నియమించిన పార్టీ హోల్‌టైమర్లను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. అదే రోజున మళ్లీ కోర్‌కమిటీ, జనరల్ సెక్రటరీలతో సమావేశం జరుగుతుందని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment