datthathreya
-
తూటాకు తూటాతోనే సమాధానం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పాకిస్తాన్‌కు తాము తూటాకు తూటాతోనే సమాధానం చెప్పామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే ఉగ్ర వాదానికి తమలా దీటైన సమాధానం చెప్పగలవా అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ఐదు పార్లమెంట్ స్థానాల బీజేపీ క్లస్టర్‌స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి పరాయి దేశానికి వత్తాసు పలికేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో వాయుసేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి తగిన గుణపాఠం చెబితే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు సాక్ష్యాలు అడుగుతున్నారని మండిపడ్డారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌పై పాకిస్తాన్ మీడియా, కాంగ్రెస్ మిత్రపక్షాల మాటల తీరు ఒకేలా ఉందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జవాన్లకు మద్దతివ్వాల్సింది పోయి.. ఆధారాలు అడగడం ఎంత వరకు సమంజసమని షా ప్రశ్నించారు. బీజేపీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు మాత్రమే కాదు, భారత్ కూడా సర్జికల్‌స్ట్రైక్‌లు చేయగలదని నిరూపితమైందన్నారు. పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పామని.. ఇది మోదీ నేతృత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి మిత్ర పక్ష పార్టీలకు జెండా, ఎజెండాలు లేవని, సిద్ధాంతాలను పక్కన బెట్టి రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తమ ఎజెండా ఏమిటో రాహుల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారనే తాము ప్రకటిస్తున్నామని, మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరనేది ఎందుకు ప్రకటించడం లేదని షా ప్రశ్నించారు. రోజుకొకరు ప్రధాని అభ్యర్థి అంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలతో దేశం సురక్షితంగా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా రాలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరునూ అమిత్ షా ఎండగట్టారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. 16+1 అంటున్న కేసీఆర్ ఓ స్థానం రజాకార్ల పార్టీ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబైలలో ఉగ్రమూలాలను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ అసాంఘిక శక్తులను ఏరివేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కేసీఆర్, చంద్రబాబు, రాహుల్‌గాంధీల నుంచి సరైన సమాధానం ఆశించలేమని అన్నారు. ఈ ఎన్నికలు సీఎంను ఎన్నుకునేందుకు కావని, ప్రధానిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 2.45 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని అమిత్ షా వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, తెలంగాణ పార్లమెంట్ ఇన్చార్జి అరవింద్ లింబావలి, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ధర్మపురి అర్వింద్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో గెలుపు అవకాశాలు: లక్ష్మణ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజాంషుగర్స్ పునరుద్ధరణ వంటి హామీల అమలులో కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆయన మండిపడ్డారు. దేశాన్ని పాలించేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ సామర్థ్యం కేవలం మోదీకి మాత్రమే ఉందని ఉద్ఘా టించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 16+1 అంటూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. -
తెలంగాణలో బీజేపీదే అధికారం: పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ కురుక్షేత్రం ప్రారంభం అయిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అమిత్‌షా నేతృత్వంలో ఇటీవల బీజేపీలో చేరిన పరిపూర్ణానంద తొలిసారిగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని, ధర్మాన్ని బీజేపీ కాపాడుతున్నందుకే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. అలాగే కులాలకు, కుటుంబ వారసత్వానికి తావులేకుండా బీజేపీ పని చేస్తోం దన్నారు. మిషన్ 70 పేరుతో లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ చక్కగా పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. తనకు పదవులు అక్కర్లేదని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇక్కడ పూర్తయ్యాక మరో రాష్ట్రానికి వెళతానన్నారు. అమిత్‌షా పదవి ఇస్తానన్నా..పదవి కాదు..పని చేస్తానని చెప్పానన్నా రు. తెలంగాణలో జనతా సర్కార్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అద్వానీ, వాజ్‌పేయి జోడీ పార్టీని నడిపించిందని, ఇప్పుడు అమిత్ షా, మోదీ జోడీ పార్టీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువస్తుందన్నారు. పార్టీ అధ్యక్షు డు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల మొద టి విడత ప్రచారంలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని వెల్లడించారు. పరిపూర్ణానంద చేరికను స్వాగతిస్తు న్నామన్నారు. ఆయన చేరికతో ప్రజల నుంచి బీజేపీకి ఎనలేని మద్దతు లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నార న్నారు. అధికారంలోకి వచ్చే వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం తీయనని అంటున్నారని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, హిమాలయాలకు వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందన్నారు. -
మాకోసారి అవకాశం ఇవ్వండి
-
మాకోసారి అవకాశం ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : ‘ఎవరెవరికో అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఈసారి మాకు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మార్పుకోసం పేరిట శనివారం బీజేపీ జన చైతన్యయాత్రను యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులు యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం గుట్ట నుంచి భువనగిరికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ జన చైతన్యయాత్రను ప్రారంభించిందన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, మోదీ పాలనలో విజయాలు, కేంద్ర పథకాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో దగా పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో నవ్వులపాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రానికి కోట్లాది నిధులను మంజూరు చేసిందని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించిందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేసీఆర్, చంద్రబాబుల తర్వాత వారి పార్టీల ఉనికి ప్రశ్నార్థకమన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని కాంట్రాక్టర్లు జలగల్లా తాగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ టీఆర్ఎస్లోకి బదిలీ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ చెప్పుచేతల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. టీఆర్ఎస్ నుంచి అధికారాన్ని తమకు ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామన్నారు. సమా వేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నాయకులు పేరాల చంద్రశేఖర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు పాల్గొన్నారు. -
చిచ్చా.. జర పాన్ మానేయ్: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నాటి కేసుకు సంబంధించి బుధవారం బోయిగూడ రైల్వే కోర్టులో హాజరయ్యేందుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పద్మారావు, కేటీఆర్ సహా పలువురు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. పద్మారావును కేటీఆర్ చిచ్చా అని పిలుస్తున్నారు. కేటీఆర్‌ను పద్మారావు రామ్ అని సంబోధిస్తారు. వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా ‘చిచ్చా.. జర పాన్ , జర్ధాలు తినడం మానేయ్’ అని కేటీఆర్.. పద్మారావుకు సలహా ఇస్తారట. కోర్టు ఆవరణలోనూ కేటీఆర్ ఇదే విధంగా పద్మారావుకు సూచించారు. దీనికి స్పందించిన పద్మారావు ‘రామ్.. నీకు ఏ అలవాటు లేకే గదా! నన్ను పాన్ మానేయ్ అంటున్నావ్. నువ్వు కూడా ఈ చాక్లెట్లు తినూ..’ అంటూ కేటీఆర్‌కు ఇవ్వబోయారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు.