ఇది న్యాయమేనా?: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో విభజన జరిగిందని అన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నమా, భారతదేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. జగన్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నియంత అంటే ఇంతకుముందు హిట్లర్ గుర్తుకు వచ్చేవారని ఇప్పుడు మాత్రం సోనియా గాంధీ గుర్తుకు వస్తారని జగన్ అన్నారు. అసెంబ్లీ వద్దన్న బిల్లును పార్లమెంట్లో అప్రజాస్వామికంగా ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలే లేకుండా 23 నిమిషాల్లో లోక్సభలో బిల్లును ఆమోదించారని తెలిపారు. లోక్సభలో జరుగుతున్న సన్నివేశాలు బయటకు రాకుండా ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి అంధకారమయంలో రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండానే బిల్లును ఆమోదించారని చెప్పారు. ప్రధాని ఒకటిన్నర పేజీలు చదివి మమ అనిపించారని దుయ్యబట్టారు.
కొత్త రాజధానికి ఎంత డబ్బు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారన్న ప్రస్తావనే లేదని జగన్ విమర్శించారు. ఇది న్యాయమేనా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ మినహాయిస్తే ఏడాదికి సీమాంధ్రలో 15 వేల కోట్ల రెవెన్యు లోటు ఉంటుందని, దీన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదన్నారు. స్పెషల్ ప్యాకేజీ తర్వాత పరిస్థితి ఏంటని నిలదీశారు. స్పష్టత లేకుండా మీ చావు మీరు చావండి అన్నట్టుగా కేంద్రం వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
ఓట్లు, సీట్లు కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. అధికార, ప్రతిపక్షం కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసం చేస్తోందన్నారు. విభజనపై రాష్ట్రపతిని కలుస్తామని, అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు. న్యాయస్థానంలోనూ పోరాటం కొనసాగిస్తామన్నారు.