ఊపందుకుంటున్న తెలంగానం.. డిసెంబర్ 15న పార్లమెంటులో బిల్లు
డిసెంబర్ 4న కేబినెట్ ముందుకు తెలంగాణ ముసాయిదా బిల్లు రానుంది. అదే రోజు కేబినెట్ ముందుకు జీవోఎం సిఫార్సులు కూడా వెళ్తాయి. డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతుండగా అదే రోజు తెల్లవారుజామున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు తెలంగాణ బిల్లు వెళ్లనుందని హోం శాఖ వర్గాలు తెలిపాయి. అప్పటి నుంచి వారం రోజుల్లోనే అసెంబ్లీ నుంచి బిల్లు తిరిగివచ్చే అవకాశం ఉందని, డిసెంబర్ 15న పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతారని హోం శాఖ వర్గాలు చెప్పాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రెండు మూడు రోజుల్లో ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరగనుంది. ప్రస్తుతానికి ప్రతి అంశాన్నీ పైపైనే చూశామని, అన్ని అంశాలను సూక్ష్మంగా చూడలేదని కేంద్ర హోం శాఖ వర్గాలు చెప్పాయి. సమస్యల పరిష్కారాలు, ప్రత్యామ్నాయాల జోలికి పోలేదని, బిల్లు ఆమోదం పొందాకే వీటిపై దృష్టి పెడతామని హోం శాఖ వర్గాలు అన్నాయి. బిల్లులో హైదరాబాద్ యూటీ, రాయల తెలంగాణ ప్రస్తావనే ఉండబోదని తెలుస్తోంది.