నిధులు, నీళ్లు, నియమకాలపై జీవోఎం దృష్టి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన కోసం ఏర్పాటయిన మంత్రుల బృందం ఎనిమిది శాఖల కార్యదర్శులతో సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. జీవోఎం సారధి సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే వచ్చే సమస్యలు.. వాటికి పరిష్కారాలు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరిగింది.
కార్యదర్శుల నుంచి కొన్ని సూచనలు.. సలహాలను తీసుకున్న జీవోఎం.. ప్రత్యేకంగా మూడు విషయాలు నిధులు, నీళ్లు, నియమకాల విషయంపై దృష్టి పెట్టింది. జల వనరులకు సంబంధించి ఏడు అంశాలపై ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శికి సూచించింది. ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ అభిప్రాయం కోసం తెలంగాణ బిల్లును పంపించాలనే పట్టుదలతో ఉన్న కేంద్రం.. ఆ దిశగా.. మిగిలిన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తోంది.
కాగా నార్త్ బ్లాక్‌లో ఓ వైపు సమావేశం జరిగిన సమయంలో బయట టీఎన్జీవో ఉద్యోగులు హైదరాబాద్ సిర్ప్ హమారా అంటూ నినాదాలు చేశారు. నార్త్‌బ్లాక్ ముందు ధర్నా చేపట్టిన తెలంగాణ ఉద్యోగులు... సీమాంధ్ర ఉన్నతాధికారులు తప్పుడు నివేదికలతో హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం తెలంగాణలో భాగమేనని... భద్రాచలం వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎక్కడివారక్కడే కొనసాగడాన్ని తాము అస్సలు ఒప్పుకోమని తేల్చిచెప్పారు.