న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి స్లాబ్ విధాన మార్పుసహా పలు అంశాలపై సంబంధిత రేట్ల హేతుబద్ధీకరణ మంత్రివర్గ కమిటీ (జీవోఎం) కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు అవసరంపై సమీక్ష నిర్వహించి ఆయా అంశాలను జీఎస్‌టీ కౌన్సిల్ ముందు సమర్పించాలని పన్ను అధికారుల కమిటీని కోరింది.
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్‌టీ అంశాన్ని కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తడం గమనార్హం. అయితే ఈ అంశాన్ని తదుపరి డేటా విశ్లేషణ కోసం కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సెప్టెంబరు 9న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్ 54వ అత్యున్నత స్థాయి సమావేశంనేపథ్యంలో తాజా మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది.
జీవోఎం కన్వీనర్‌గా తన మొదటి సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘జీఎస్‌టీ పన్ను స్లాబ్‌లలో మార్పు చేయరాదని కొంతమంది జీవోఎం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతాయి, ఆపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్‌టీ విధానంలో సున్నా, 5, 12, 18. 28 శాతం ఐదు విస్తృత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. లగ్జరీ– డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా 28 శాతం రేటు కంటే ఎక్కువ సెస్‌ను విధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment