డిసెంబర్ 4న కేబినెట్కు జీవోఎం నివేదిక
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎట్టకేలకు జీవోఎం నివేదిక ఓ కొలిక్కి వచ్చింది.విభజన నివేదికపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణపై జీఓఎం నివేదిక డిసెంబరు 4న కేబినెట్ ముందుకు రానుంది. అదే రోజు ముసాయిదా బిల్లు ఆమోదం పొందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు పంపనున్నారు. అక్కడ నుంచి వారంలోపే అసెంబ్లీకి పంపిస్తారని హోంశాఖ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికమంత్రి చిదంబరం కార్యాలయంలో జీవోఎం సభ్యులు భేటీ ముగిసింది.
సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేష్, చిదంబరం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత షిండే వెళ్లిపోయారు. అనంతరం సుమారు 40 నిమిషాలపాటు ఆర్థికశాఖ అధికారులతో చిదంబరం, జైరాం రమేష్ చర్చలు జరిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని హోంశాఖవర్గాలు చెబుతున్నాయి. రేపు కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవోఎం నివేదికపై చర్చించే అవకాశముంది. మరోవైపు... పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి ప్రారంభం కానున్నాయి.