నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి
* జీవోఎంతో సమావేశం
* 21న కేంద్ర మంత్రివర్గానికి టీ-బిల్లు
* ఆ రోజే ఆమోదం, రాష్ట్రపతికి నివేదన
* బిల్లును అసెంబ్లీకి పంపనున్న ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. తెలంగాణ బిల్లు చకచకా సిద్ధమవుతోందని, దాన్ని నవంబర్ 21న కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనున్నారని సమాచారం. అదే రోజున బిల్లుకు మంత్రివర్గం ఆమోదం కూడా తెలుపుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విభజన విధి విధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తాను కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదికకు ఇప్పటికే తుది రూపునిస్తోంది. రాష్ట్రానికి చెందిన పార్టీలతో భేటీలు పూర్తి చేసిన జీవోఎం, కేంద్ర శాఖల కార్యదర్శులతో సమావేశాలను కూడా గురువారంతో ముగించనుంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రితో కూడా సమావేశమయ్యాక నివేదిక కసరత్తును అది వేగవంతం చేయనుంది.
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జరిపే భేటీతో జీవోఎం పని పూర్తవుతుంది. ఆ వెంటనే అది నివేదికను పూర్తి చేసి ఈ నెల 21న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించనుంది. జీవోఎం నివేదికతో పాటే తెలంగాణ బిల్లు కూడా సిద్ధమవుతుందని, దానికి 21నే మంత్రివర్గం ఆమోదం కూడా తెలుపుతుందని చెబుతున్నారు. అనంతరం తెలంగాణ బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. బిల్లును పరిశీలించే క్రమంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించే ఆస్కారముంది. అవసరమనుకుంటే మరింత స్పష్టత, వివరణ వంటివి కోరుతూ బిల్లును మంత్రివర్గానికి ఆయన తిప్పి పంపవచ్చు. అనంతరం బిల్లుపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూ శాసనసభకు ఆయన పంపుతారు.
అభిప్రాయం తెలిపేందుకు అసెంబ్లీకి ఎంత గడువివ్వాలన్నది కూడా రాష్ట్రపతి విచక్షణకు లోబడే ఉంటుంది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయనందున, మూడు రోజుల ముందు నోటీస్ జారీ చేసి దాన్ని సమావేశపరిచే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. రాష్ట్రపతి నుంచి బిల్లు అందిన మూడు నాలుగు రోజుల్లోనే అసెంబ్లీని స్పీకర్ సమావేశపరుస్తారని జీవోఎం వర్గాలంటున్నాయి. అంతా కేంద్రం అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ 5న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. అంతేగాక మొత్తం ప్రక్రియనూ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామన్నాయి.
నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం
ఓడరేవులు, రైల్వే, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులతో జీవోఎం గురువారం భేటీ కానుంది. కార్యదర్శులతో దాని చర్చలు అక్కడితో ముగుస్తాయి. రాత్రి 8 గంటలకు జీవోఎం ముందు హాజరవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆహ్వానం అందింది. దాంతో గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. విభజనకు సంబంధించి సీమాంధ్రలో చేపట్టాల్సిన అంశాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవోఎంకు సవివరంగా నివేదిక సమర్పించడం తెలిసిందే. ఈ తరుణంలో కిరణ్ కూడా తన అభిప్రాయాలను జీవోఎం ముందుంచనున్నారు. ఆ భేటీ అనంతరం కేంద్రంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు. తరువాత నేరుగా విశాఖ జిల్లాకు చేరుకుని, అక్కడ జరిగే రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారని సీఎంవో వర్గాలు వివరించాయి.
పూర్తయిన మొక్కుబడి
మరోవైపు నివేదిక రూపకల్పనలో జీవోఎం బిజీగా ఉంది. జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి తదితరులు తమ రోజువారీ కార్యక్రమాలను పక్కనబెట్టి మరీ కొద్ది రోజులుగా పనుల్లోనే తలమునకలుగా ఉన్నారు. రాష్ట్ర పార్టీలతో జీవోఎం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు బుధవారం ముగిశాయి. ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో మంగళవారం, విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎం, వైఎస్సార్‌సీపీలతో బుధవారం జీవోఎం చర్చలు జరిపింది.
ఇక విభజనపై వైఖరిని ఎటూ తేల్చకుండా గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న టీడీపీ మాత్రం జీవోఎం ముందుకు రాలేదు. విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలను ప్రధానంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, ఉమ్మడి రాజధాని పరిధి, ఆదాయ పంపిణీ గురించే జీవోఎం ప్రశ్నించింది. యూటీ ప్రతిపాదనను అవన్నీ తిరస్కరించడం, హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పడం తెలిసిందే.
కాంగ్రెస్ మాత్రం యథాప్రకారంగా తన డబుల్ గేమ్‌ను కొనసాగించింది. ఆ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విభజనకు అనుకూలంగా, మంత్రి వట్టి వసంతకుమార్ వ్యతిరేకంగా వాదన వినిపించారు. వైఎస్సార్‌సీపీతో జరిపిన 20 నిముషాల భేటీలో మాత్రం జీవోఎం సభ్యులు ఏ అంశాన్నీ ప్రస్తావించకుండా మౌనముద్ర దాల్చారు. పార్టీ ప్రతినిధులు ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు. పైగా వారడిగిన పలు ప్రశ్నలకు సభ్యులు తెల్లమొహాలు వేసినట్టు సమాచారం.
ఇక సీపీఎంతో భేటీని 10 నిమిషాల్లో ముగించారు. పైగా మంగళవారం ఐదు పార్టీలతో చర్చలకు జీవోఎం సభ్యుల్లో దాదాపు అందరూ హాజరవగా బుధవారం సీపీఎం, వైఎస్సార్‌సీపీలతో చర్చలకు మాత్రం ముగ్గురే వచ్చారు! మొత్తంమీద పార్టీలతో చర్చలను తూతూమంత్రంగా ముగించారు. అన్ని పార్టీలతోనూ చర్చించామని నివేదికలో పేర్కొనడానికి మినహా వీటితో జీవోఎం సాధించిందంటూ ఏమీ లేదు. పార్టీలు పేర్కొన్న అభిప్రాయాలను నివేదికలో యథాతథంగా పొందుపరచనున్నారు.