10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఓకే | Cabinet nod puts to rest speculation on Telangana composition | Sakshi
Sakshi News home page

10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఓకే

Published Fri, Dec 6 2013 1:55 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఓకే - Sakshi

10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఓకే

* విభజన దిశగా ముందడుగు
* ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013 ముసాయిదాకు ఆమోదం
* 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు
* పదేళ్ల పాటు జీహెచ్‌ఎంసీ ఉమ్మడి రాజధాని.. శాంతిభద్రతలు టీ-గవర్నర్‌కు
* ప్రజల ప్రాణ, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణ బాధ్యతలు కూడా.. సాయంగా ఇద్దరు కేంద్ర సలహాదారులు
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని 45 రోజుల్లో ఖరారు.. ఎంపికకు నిపుణుల కమిటీ
* కృష్ణా, గోదావరి నదీ జలాలపై పర్యవేక్షణ బోర్డులు.. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం
* బొగ్గు, విద్యుత్, చమురు, గ్యాస్, ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై బిల్లులో నిర్దేశాలు
* రెండు రాష్ట్రాల్లోనూ 371-డి కొనసాగింపు.. ప్రత్యేక హోదాతో సమాన అవకాశాల కల్పన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనమండళ్లు కొనసాగింపు
విద్యా సంస్థల్లో ప్రస్తుత ప్రవేశ విధానాలే ఐదేళ్ల పాటు కొనసాగింపు
రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు
*  నేడు లేదా రేపు రాష్ట్రపతికి ముసాయిదా బిల్లు.. ఆర్టికల్ - 3 కింద రాష్ట్ర అసెంబ్లీకి
*  అసెంబ్లీ నుంచి బిల్లు తిరిగి రాష్ట్రపతికి.. అక్కడినుంచి మళ్లీ ప్రభుత్వానికి
*  మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చర్చించి తెలంగాణ తుది బిల్లు ఖరారు
*  శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు వస్తుందని భావిస్తున్నామన్న షిండే
*  సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ.. చర్చకురాని రాయల తెలంగాణ
 
 సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర విభజనపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013’ ముసాయిదాను గురువారం ఆమోదించింది. హైదరాబాద్ నగరాన్ని జీహెచ్‌ఎంసీ పరధిలో పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా చేస్తూ.. అందులో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగిస్తూ.. కృష్ణా, గోదావరి నదులపై నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేస్తూ.. ఆస్తులు, అప్పుల పంపకానికి సవివరమైన విధివిధానాలను నిర్దేశిస్తూ రూపొందించిన ఈ బిల్లును శుక్ర, శనివారాల్లో రాష్ట్రపతికి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు.

బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకోవాలని రాష్ట్రపతిని కోరతామని.. ఆయన ఆ బిల్లును అసెంబ్లీకి పంపిస్తారని ఆయన చెప్పారు. అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత తిరిగి కేంద్ర కేబినెట్‌లో చర్చించి తుది బిల్లును ఖరారు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. బిల్లు విషయంలో అసెంబ్లీకి రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారనేది తనకు తెలియదని.. అయితే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

కేబినెట్‌కు ముందే ‘రాయల’ తొలగింపు...
గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశానికి.. కేంద్రమంత్రులైన ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా హాజరుకాలేదు. కేబినెట్ భేటీకి ముందు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో.. రాయల తెలంగాణ ప్రతిపాదనను నివేదిక నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మంత్రివర్గం ముందుకు వెళ్లిన జీవోఎం నివేదికలో రాయల తెలంగాణ ప్రస్తావనే లేదు. మంత్రివర్గం భేటీలో రాష్ట్ర విభజనపై జీవోఎం రూపొందించిన నివేదిక, ముసాయిదా బిల్లులపై కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా భద్రాచలం డివిజన్ మీదే దాదాపు 50 నిమిషాల పాటు చర్చ జరిగింది. భేటీ ముగిసిన తర్వాత హోంమంత్రి షిండే మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర విభజనపై తన అధ్యక్షతన ఏర్పాటయిన జీవోఎం ఏడు సార్లు సమావేశమైందని.. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జీవోఎంకు 11 అంశాలపై వచ్చిన 18 వేల వినతులను పరిశీలించామని తెలిపారు. తమకు ఇచ్చిన 11 మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గానికి సిఫారసులు చేశామని చెప్పారు. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిందని ప్రకటిస్తూ.. అందులోని ముఖ్యాంశాలు చదివి వినిపించారు.

పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధాని...
విభజన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలు, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉంటాయని షిండే ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతం ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల కాలానికి మించకుండా ఉంటుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి ప్రాణ, ఆస్తి, స్వాతంత్య్రాల భద్రతను కాపాడే ప్రత్యేక బాధ్యతను తెలంగాణ గవర్నర్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో గవర్నర్‌కు సహకారం అందించడానికి ఇద్దరు సలహాదారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు.

విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని గుర్తించటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఇది 45 రోజుల్లో సిఫారసులు సమర్పిస్తుందని వెల్లడించారు. కొత్త రాజధాని నిర్మాణానికి, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వనరుల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రమేయంతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పులతో పాటు బొగ్గు, విద్యుత్, చమురు, సహజవాయువుల పంపిణీకి అనుసరించాల్సిన విధానాలను రూపొందించామన్నారు. విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పనకు వీలుగా రాజ్యాంగంలోని 371డీ అధికరణ రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే ఐదేళ్ల పాటు కొనసాగించనున్నామన్నారు.

ఇరు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముసాయిదా బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రపతికి పంపించనున్నట్లు షిండే చెప్పారు. (అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు. తిరిగి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎప్పుడు బిల్లు సమర్పిస్తారో తెలియాల్సి ఉంది.)
 
..పార్లమెంటు స్తంభనకే సీమాంధ్ర ఎంపీల నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలను అడ్డుకోవాలని, మెజార్టీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విభజనను జాతీయ పార్టీల పెద్దల దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు.

పార్లమెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరాదని ఇప్పటికే టీడీపీ సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించగా, కాంగ్రెస్ ఎంపీలు సైతం అదే నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఇక రాష్ట్ర విభజన బిల్లు కేబినెట్ ముందుకు రావడానికి ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు.. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సుదీర్ఘ సమాలోచనలు సాగించారు. ఈ భేటీలో పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement