ఢిల్లీలా హైదరాబాద్ | Hyderabad like a Delhi, kiran kumar reddy propose to Centre | Sakshi
Sakshi News home page

ఢిల్లీలా హైదరాబాద్

Published Tue, Nov 12 2013 1:14 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

ఢిల్లీలా హైదరాబాద్ - Sakshi

ఢిల్లీలా హైదరాబాద్

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉమ్మడి రాజధాని.. శాంతిభద్రతలు కేంద్రం చేతిలో..
విభజనకు మార్గనిర్దేశనం చేసిన కిరణ్ ప్రభుత్వం
*  సమైక్యవాదినని చెప్పుకొంటూ విభజనకు ఆది నుంచీ సీఎం పూర్తి సహకారం
తాజాగా విభజన ఎలా చేయాలో చెబుతూ  కేంద్రానికి సీఎస్ ద్వారా ప్రత్యేక నివేదిక
ఇరు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి..
డీఎస్సీ, జోనల్ పోస్టుల్లో నియమితులైన స్థానికేతరులను ఇక్కడే ఉంచాలి..
సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉంటామంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలి..
*  భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో, మునగాలను కృష్ణా జిల్లాలో కలపాలంటూ సూచనలు
 
ఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: సమైక్య చాంపియన్.. అంటూ తన గురించి తాను ప్రచారం చేయించుకుంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అసలు ‘విభజన’ రూపం మరోసారి బట్టబయలైంది. విభజన తుపాన్‌ను ఎలాగైనా అడ్డుకుంటానని పైకి చెబుతూ.. మరోవైపు అధిష్టానానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఆయన.. విభజన అసలు ఎలా ఉండాలన్నదానిపై ఇటీవల తన ప్రభుత్వ యంత్రాంగంతో ఒక కీలక మార్గదర్శక నివేదిక తయారు చేయించారు.

రాష్ట్రాన్ని ఎలా విభజించాలో.. హెచ్‌ఎండీఏలో ఎంత పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయాలో.. రెండు ప్రాంతాల ఉద్యోగులను ఎలా పంచాలో చెబుతూ ఆ నివేదికలో పలు సిఫార్సులు చేశారు. ఆ నివేదిక ద్వారా విభజనలో తన కోర్కెల చిట్టాను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. వారం కిందటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి దాన్ని కేంద్రానికి సమర్పించారు. నివేదికలోని వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధినంతటినీ ఉమ్మడి రాజధాని కిందకు తెచ్చి.. శాంతిభద్రతల అంశాన్ని ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని అందులో కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతోపాటు.. సీమాంధ్ర ప్రజలు ప్రధానంగా హైదరాబాద్‌పైనే ఆందోళన చెందుతున్నారని, వారి రక్షణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉండేలా విధానం రూపొందించాలని సలహా ఇచ్చారు. ఉద్యోగుల పంపిణీ, ఉద్యోగ నియామకాలకు సంబంధించి 371డి, ఆస్తులు, ఆదాయం పంపిణీలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. నివేదికలో చేసిన కీలక సిఫార్సులివీ..

ఆ ఉద్యోగుల్ని ఇక్కడే కొనసాగించాలి..
తెలంగాణ ప్రాంతంలోని జిల్లా ఎంపిక కమిటీల(డీఎస్సీ) ద్వారా 20 శాతం, జోనల్ పోస్టుల్లో 30 శాతం ఓపెన్ కేటగిరీ కింద ఎంపికైన సీమాంధ్ర ఉద్యోగులను ఇక్కడే కొనసాగించాలి. తమ రాష్ట్రానికి వెళ్లాలని ఉద్యోగులు కోరే వరకు వారిని ఇక్కడే కొనసాగించాలి. ఇదే సూత్రాన్ని సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలి. ఎక్కువ మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండాలని భావిస్తే పోస్టులు లేకపోయినా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారిని కొనసాగించాలి.

అఖిల భారత సర్వీసులోని ఉద్యోగులకు వారి నివాసం, స్థానికత అంశాల ఆధారంగా ఆప్షన్ కల్పించాలి. భార్యా భర్తలు ఒకే చోట పని చేసేవారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు విభజన నుంచి మినహాయింపు ఇవ్వాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు చాలా మంది హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉంటున్నారు, ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర పెన్షనర్లను వారి రాష్ట్రానికి పంపరాదు. ఇదే సూత్రాన్ని సీమాంధ్రలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ పెన్షనర్లకు వర్తింప చేయాలి. అధికరణ 371(డి) ఎత్తివేస్తే ఏ ప్రాతిపదిక ఆధారంగా నియామకాలను జరుపుతారో స్పష్టం చేయాలి.

1956కు పూర్వం ఉన్న ప్రకారమే విభజన..
1956కు పూర్వం ఉన్న ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని మునగాల మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలి. రెండు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పునర్వ్యవస్థీకరించాలి. నదీ జలాలను యథాతథంగా కొనసాగించాలి. విభజన వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండుగా చీలిపోతాయి. హైదరాబాద్‌కు నీటి పంపిణీ చాలా క్లిష్టమైన సమస్య అవుతుంది, దాని పరిష్కారానికి చట్టబద్ధమైన అధికారాలు కావాలి.

ప్రస్తుతం ఉన్న నీటి కేటాయింపులను ఇరు రాష్ట్రాలకు నిజాయితీగా ఆమోదయోగ్యమయ్యేలా పంపిణీ చేయడానికి అవసరమైన యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.1,10,000 కోట్లు అవసరం కాగా ఆంధ్రా ప్రాజెక్టులకు దాదాపు రూ. 29,029 కోట్లు(26.39%), రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 7,700 కోట్లు(7 శాతం), తెలంగాణ ప్రాజెక్టులకు దాదాపు రూ. 73,216 కోట్లు(66.56%) అవసరం. ఎత్తిపోతల ద్వారా నడిచే తెలంగాణ ప్రాజెక్టులకు 6,489 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకు రూ.38,000 కోట్ల మూలధనం కావాలి.

ఆస్తులు-ఆదాయం పంపిణీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, ఆదాయ పంపిణీ జనాభా ప్రాతిపదికన చేయాలి. ఆర్టీసీ, ఏపీ, జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, సింగరేణిలో తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాలి. గనుల నుంచి వచ్చే రాయల్టీని ఏ రాష్ట్రానికి చెందినది ఆ రాష్ట్రానికే ఇవ్వాలి. ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయాలను ప్రాంతాల వారీగా విభజించినా, హైదరాబాద్‌లోని ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు ఉన్నందున జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాలి. కొత్త రాజధానిలో పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లోని ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లిపోమనే అవకాశం ఉంది... ఈ నేపథ్యంలో వారికి రక్షణ, ఉపాధి అవకాశాలను కొనసాగించేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement