పోటెత్తే.. గేట్లెత్తే! | Telangana Heavy Rains: Godavari Reaches Third Flood Warning Mark At Bhadrachalam | Sakshi
Sakshi News home page

పోటెత్తే.. గేట్లెత్తే!

Published Tue, Jul 12 2022 1:20 AM | Last Updated on Tue, Jul 12 2022 2:58 PM

Telangana Heavy Rains: Godavari Reaches Third Flood Warning Mark At Bhadrachalam - Sakshi

భద్రాచలంలో 53 అడుగులుగా నమోదైన గోదావరి నీటిమట్టం 

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: ఎగువన మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదిలో వరద పోటెత్తింది. ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల ప్రవాహాలు కూడా కలిశాక మహోగ్ర రూపంతో పరుగు పెడుతోంది. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో 53 అడుగుల మట్టంతో ఉరకలెత్తుతోంది. మొత్తంగా ఎగువన ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ దాకా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. జూలై రెండో వారంలోనే ఈ స్థాయిలో గోదావరికి వరదలు రావడం, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. 

వారం రోజుల వానతోనే.. 
నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షా లు కురుస్తున్నాయి. దీనితో అటు మహారాష్ట్ర నుంచే గోదావరిలో వరద పోటెత్తి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండిపోయింది. దానితో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు కడెం వాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెర సాని తదితర ఉప నదుల ప్రవాహాలూ చేరుతుండటంతో.. సోమవారం గోదావరిలో వరద పోటెత్తింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకుల గూడెం) బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎక్కడిక్కడ వాగులు, ఉప నదుల ప్రవాహాలు కలుస్తుండటంతో గోదావరిలో వరద పెరుగుతూ పోతోంది. లక్ష్మి బ్యారేజీ వద్ద నుంచి 8.68 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ నుంచి 11.82 లక్షల క్యూసెక్కులు, సీతమ్మ సాగర్‌ నుంచి 14.30 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. భద్రాచలం గోదావరి మట్టం గంట గంటకూ పెరుగుతూ.. 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

కృష్ణా నదిలో ప్రవాహాలు మొదలు.. 
ఎగువన కర్ణాటకలో వర్షాలతో కృష్ణా నదిలో వరద మొదలైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆది, సోమవారాల్లో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. మలప్రభ, ఘటప్రభ వంటి ఉప నదులపై ప్రాజెక్టులన్నీ నిండటంతో.. కృష్ణాలోకి భారీ వరద వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో ఆల్మట్టి డ్యామ్‌ నిండటానికి మరో 40 టీఎంసీలు అవసరమున్నా.. ముంపు ముప్పు తప్పించడానికి గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆ నీళ్లు నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు చేరుతున్నాయి.

సోమవారం రాత్రి ఇక్కడి నుంచి 61.9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా జూరాల వైపు పరుగెడుతోంది. ఒకట్రెండు రోజుల్లో వరద జూరాలకు చేరనుంది. వరద రానుండటంతో జూరాలలో సోమవారం రాత్రి మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి 10,200 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఎగువ నుంచి వరద చేరుకోగానే జూరాల గేట్లు ఎత్తనున్నట్టు వెల్లడించారు. మరోవైపు భారీగా ప్రవాహం వస్తుండటంతో తుంగభద్ర డ్యామ్‌ నిండుకుండలా మారింది. సోమవారం అర్ధరాత్రిగానీ, మంగళవారం ఉదయంగానీ తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీనితో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలవనుందని అధికారులు చెప్తున్నారు. 

చిన్న ప్రాజెక్టులూ నిండి.. 
ఎగువ నుంచి వరద వస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి 5,622 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. 

భద్రాచలంలో అప్రమత్తం 
గోదావరి ఉగ్రరూపం దాల్చడం, తీరం దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తగూడెం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మండలాల వారీగా గజ ఈతగాళ్లు, మరబోట్లను సిద్ధంగా ఉంచారు. 20 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం భద్రాచలం ఇప్పటికే చేరుకుంది.  

నేనూ వరద బాధితుడినే: మంత్రి పువ్వాడ 
గోదావరి వరదలు ఎలా ఉంటాయో, క్షణాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో తెలుసని.. తానూ వరద బాధితుడినేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. భద్రాచలంలో సోమవారం వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘‘నేను పుట్టి పెరిగింది కూనవరంలో. ఆ గ్రామంలో మాకు రెండు అంతస్తుల ఇల్లు ఉండేది. సాధారణంగా మొదటి అంతస్తులోకి నీళ్లు వస్తే.. రెండో అంతస్తులోకి లేదా ఇంటి పైకప్పు మీదికి వెళ్లేవాళ్లం.


భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులు 

ఓసారి గోదావరికి బాగా వరద వచ్చింది. మొదటి అంతస్తు ఖాళీ చేసి రెండో అంతస్తులోకి వెళ్లగా.. కొద్దిసేపట్లోనే రెండో అంతస్తులోకీ నీళ్లు రావడం మొదలైంది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో భయపడ్డాం. సహాయక బృందాలు పడవల్లో వచ్చి మమ్మల్ని రక్షించాయి.’’అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement