
ఇప్పుడెందుకు చెప్పినట్టు ?
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన 60 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్టుండి శుక్రవారం మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా పెదవి విప్పడంపై కాంగ్రెస్ నేతల్లో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ సిద్ధమయ్యాక నోరు విప్పడంలో ఆంతర్యమేంటి?
సీఎం కిరణ్ వ్యాఖ్యలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో అనుమానాలు
ముందే చెబితే ‘డిసెంబర్ 23’ పునరావృతమయ్యేదని వ్యాఖ్య
సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగిన రెండు నెలలకు సందేహాలా?
నిర్ణయం ముందే తెలిసినప్పుడు నిమ్మకు నీరెత్తిన సీఎం
తుది ఘట్టంలో సమస్యల ఏకరువు ఎందుకు?
అంతా అధిష్టానం డెరైక్షన్‌లోనే జరుగుతోందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన 60 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్టుండి శుక్రవారం మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా పెదవి విప్పడంపై కాంగ్రెస్ నేతల్లో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం పార్టీ నేతలను బుజ్జగిస్తూ వచ్చిన కిరణ్, తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమై త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు రానున్న తరుణంలో... ‘సమస్యలున్నాయి’ అంటూ ఏకరువు పెట్టడంలో ఆంతర్యమేంటన్న దానిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను కిరణ్ నెత్తికెత్తుకున్నారని, పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని గత జూన్ నుంచీ అధిష్టానం పెద్దలు చెబుతూనే వస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా జూలై 30న యూపీఏ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఇంత ప్రక్రియ నడిచినా, విభజనతో సమస్యలు తలెత్తుతాయని ఎప్పుడూ చెప్పని కిరణ్, తాజాగా ఇలా తెర ముందుకు రావడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ విభజన ప్రక్రియ పూర్తయ్యేదాకా సీఎంగా కొనసాగాల్సిందేనని ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అధిష్టానం పెద్దలు ఆదేశించగా సరేనని తిరిగొచ్చిన కిరణ్ తాజా వ్యాఖ్యల వెనుక కూడా పెద్దల ఆదేశాలే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు చెప్పిన విషయాలనే కోర్‌కమిటీ ముందు హాజరైనప్పుడు గానీ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడు గానీ కిరణ్ బహిరంగంగా చెప్పి ఉంటే నేడు సీమాంధ్రలో ఉద్యమం చేయాల్సిన అవసరమే ఉండేది కాదంటున్నారు. కనీసం కోర్‌కమిటీ భేటీకి ముందుగానీ, భేటీలోగానీ ఇదే వాదనను ఆయనెందుకు గట్టిగా వినిపించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటున్నారు.
రాష్ట్ర విభజన దిశగా 2009 డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేసినప్పుడు కిరణ్ అసెం బ్లీ స్పీకర్‌గా ఉన్నారని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు సమర్పించడంతో కేంద్రం ఒక్కసారిగా వెనక్కు తగ్గుతూ డిసెంబర్ 23న మరో ప్రకటన చేసిందని నేతలు గుర్తుచేస్తున్నారు. కిరణ్‌ది నిజంగా సమైక్యవాదమే అయితే ఇన్ని రోజులపాటు ఎందుకు మౌనం దాల్చారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితుడయ్యాక తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కిరణ్‌తో పాటు డిప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్సలను ఆదేశించారు. అంతేగాక దానిపై పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా నేతలంతా కట్టుబడి ఉండాలని చెప్పారు. వారు ముగ్గురూ అందుకు సరేనన్నారు. తర్వాత జూలై 12న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోం శాఖ కార్యాచరణ ప్రణాళికను అందజేసింది.
అంతేగాక తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని కూడా సంకేతాలిచ్చారు. అప్పటి నుంచి సీడబ్ల్యూసీ తీర్మానం దాకా కిరణ్ మూడు దఫాలు ఢిల్లీ వెళ్లారు. సోనియాతోపాటు రాహుల్‌నూ రెండుసార్లు కలిశారు. మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ వంటి పార్టీ పెద్దలతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. వాటన్నిం ట్లోనూ కిరణ్‌కు వారు చెప్పిన మాటల సారాంశం ఒక్కటే... తెలంగాణకు నిర్ణయం జరిగిపోయిందనే! అయినా ఏ రోజూ కిరణ్ తన వైఖరేంటో బహిరంగంగా చెప్పలేదు. పైగా విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలకు సిద్ధపడ్డ సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కూడా, ‘ఇంకా నిర్ణయం కాలేదు, తొందరపడొద్దు’ అని వారిస్తూ వచ్చారు.
అలాగాక అధిష్టానం నిర్ణయం కిరణ్‌కు తెలియగానే దాన్ని రాష్ట్ర నేతలకు చేరవేస్తే అంతా మూకుమ్మడిగా పార్టీపై ఒత్తిడి తెచ్చేవారమని, లేదంటే అందరమూ రాజీనామా చేసి సంక్షోభం సృష్టిస్తే అసలు విభజన నిర్ణయమే జరిగేది కాదని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు. అలాగాక ఉన్నట్టుండి, ‘సమస్యలు’ అంటూ కిరణ్ ఈ రోజు కొత్తగా మాట్లాడుతుండటం వింతగా ఉందని సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరన్నారు. ‘‘గత 50 రోజులుగా సీమాంధ్రలో తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్నా సీఎం హోదాలో కిరణ్ స్పందించను కూడా లేదు. రాష్ట్రం అతలాకుతలమవుతున్నా కనీసం క్యాంపు ఆఫీసు నుంచి బయటకు రాలేదు’’ అని గుర్తు చేశారు. సమైక్యోద్యమాన్ని పక్కదారి పట్టించడానికో, అధిష్టానం ఆదేశాల మేరకో కిరణ్ ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తున్నట్టు గతంలో ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా వార్తలు రాగా తీవ్రంగా ఖండించడం తెలిసిందే. పైగా అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు!