మరోసారి హస్తిన బాట పట్టనున్న కిరణ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ సిద్ధమవుతుండడం, 19న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానానికి మరోసారి అన్ని అంశాలు వివరించాలని భావిస్తున్న ఆయన ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే నేడు ....లేనిపక్షంలో బుధవారం తప్పనిసరిగా హస్తినకు వెళ్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం విదేశీయానాన్ని ముగించుకున్న సోనియాగాంధీ ఢిల్లీకి వచ్చారు. ఆమె ఆమోదాన్ని తీసుకున్న తరువాతే తెలంగాణ నోట్‌ను కేబినెట్‌కు పంపించాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సోనియాను కలిసి తెలంగాణపై నిర్ణయం ఆపాలంటూ కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇదే సమయంలో సమైక్యం కోసం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులపై కూడా దాడులు జరుగుతున్న విషయాన్ని సోనియాకు, ఇతర కేంద్ర నాయకులకు వివరించాలని కిరణ్ భావిస్తున్నారు. మరోవైపు నిన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే.