cm kiran kuma reddy
-
విభజన ఆగితేనే సీఎం కొత్త పార్టీ!: ఏరాసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతే సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారేమోగానీ.. విభజన జరిగితే పార్టీ పెట్టడానికే అవకాశం ఉండదని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కొత్త పార్టీ పెడతారని, జెండా ఖరారైందని మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోందన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ నెల 24, 25ల్లో అందరం కూర్చొని భవిష్యత్ కార్యచరణ ఖరారు చేసుకుందామని సీఎం తమతో చెప్పారన్నారు. సీమాంధ్ర నేతలు శుంఠలు అంటూ జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇలాంటివి మాట్లాడం అంత పెద్దాయనకు సరికాదన్నారు. -
మరోసారి హస్తిన బాట పట్టనున్న కిరణ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ సిద్ధమవుతుండడం, 19న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానానికి మరోసారి అన్ని అంశాలు వివరించాలని భావిస్తున్న ఆయన ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే నేడు ....లేనిపక్షంలో బుధవారం తప్పనిసరిగా హస్తినకు వెళ్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విదేశీయానాన్ని ముగించుకున్న సోనియాగాంధీ ఢిల్లీకి వచ్చారు. ఆమె ఆమోదాన్ని తీసుకున్న తరువాతే తెలంగాణ నోట్‌ను కేబినెట్‌కు పంపించాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సోనియాను కలిసి తెలంగాణపై నిర్ణయం ఆపాలంటూ కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇదే సమయంలో సమైక్యం కోసం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులపై కూడా దాడులు జరుగుతున్న విషయాన్ని సోనియాకు, ఇతర కేంద్ర నాయకులకు వివరించాలని కిరణ్ భావిస్తున్నారు. మరోవైపు నిన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి ఉద్యమ బాట
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ తెలంగాణ స్వయంపాలన, ఆత్మగౌరవ సాధనలో అగ్రభాగాన నిలిచిన ఉద్యోగ సంఘాలు మరోసారి ఉద్యమబాటను ఎంచుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి నుంచీ పొలికేక వేస్తున్న ఉద్యోగులు... మరో దఫా సమరభేరి మోగించేందుకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ స్వాభిమాన్ పేరిట పోరుబాటకు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై టీఎన్జీవోలు ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ వెన్నుదన్నుగా నిలవడాన్ని... ఆందోళనలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్య ఉద్యమానికి తెరవెనుక ప్రధాన సూత్రదారిగా ఉన్న సీఎం కిరణ్... సీమాంధ్ర ముఖ్యమంత్రిగా మారారనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శుక్రవారం నుంచి బహిరంగ ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ స్వాభిమాన్ సదస్సు వరకు దఫాలవారీగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల భాగస్వామ్యం తెలంగాణ సానుకూల ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య విద్వేషాలు పెరుగకుండా టీఎన్జీవోల ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీలు నిర్వహించారు. ఈ నెల రెండు నుంచి ఐదో తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సద్భావన ర్యాలీలు చేపట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా సీమాంధ్ర, హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగులపై దాడులను ఖండిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సదస్సు నేపథ్యంలో జరిగిన ఘటనలు టీఎన్జీవోలను ఆలోచింపజేశారుు. ఈ నేపథ్యంలోనే స్వాభిమాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 వేల మంది రిటైర్డ్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, క్యాజువల్, పర్మినెంట్ ఉద్యోగులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేదిశగా జిల్లా ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ, టీఎన్జీవోలు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని కదులుతున్నారు. -
సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సీఎం కిరణ్
ఇల్లెందు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీ చైర్మన్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులపై దాడి అమానుషమని పేర్కొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. స్థానిక జగ దాంబసెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు యాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఏపీఎన్జీవోస్కు సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చి తెలంగాణ శాంతిర్యాలీకి అనుమతిని నిరాకరించడం దారుణమన్నారు. అక్రమాస్తులు కలిగివున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ దినేశ్కుమార్రెడ్డికి ఒక్క రోజు కూడా ఆ బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదన్నారు. తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు సాగిస్తున్న కుట్రల వెనుక సీఎం, డీజీపీల హస్తం ఉందని ఆరోపించారు. నిజాం కళాశాల విద్యార్థులపై దాడి చేయించడమే కాకుండా దెబ్బలు తగిలిన వారికి వైద్యం చేయించడంలోనూ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం తెలంగాణ బంద్ విషయంలో ఒక తీరు...ఏపీఎన్జీవోల సభ విషయంలో మరో తీరుగా వ్యవహరించడం సరికాదని టీజేఏసీ డివిజన్ చైర్మన్ పి.అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జాన్పాషా, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, రామచందర్‌నాయక్, సిలివేరు సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణం
ఖమ్మం, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేక చర్యలకు నిరసనగా... తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై సంతకాలు చేసి బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. పెట్రోలు బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ, భారతీయ జనతాపార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలవారు ఉదయం నుంచే రోడ్డుపైకి వచ్చి బంద్ నిర్వహించారు. డిపోల వద్దకు వెళ్లి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం బస్‌డిపో వద్ద పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్ సందర్భంగా జిల్లాలో పలుచోట్ల జేఏసీ, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ కళాకారులు ప్రధాన కూడళ్ల వద్ద ఆటాపాటా నిర్వహించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫైళ్లకు నిప్పంటించారు. సింగరేణి గనుల్లో పనిచేస్తున్న కార్మికులు బంద్‌కు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు తెలంగాణ వాదులు దహనం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 28 మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఖమ్మంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు బయటకు తీయవద్దని డిపో ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులకు డిపో మేనేజర్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. టీచర్స్ జేఏసీ, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న తెలంగాణ ఉద్యోగులను పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేసి అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ ఫ్లెక్సీని దహనం చేశారు. న్యాయవాదులు ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. మెడికల్, సంక్షేమభవన్, పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగజేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానించడానికి ముఖ్యమంత్రి ఎపీ ఎన్జీవోల సభకు అనుమతించారని అన్నారు. సీమాంధ్ర గుండాలతో తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి అండతో జిల్లాలో సీమాంధ్ర అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఆర్టీసీ బస్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 7 గంటల వరకు బస్సులు యథావిధిగా నడిచినప్పటికీ అనంతరం జేఏసీ నాయకులు వాటిని నిలిపివేయించారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. పాల్వంచ పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు ఆంధ్రా ఉద్యోగులకు పూలు ఇచ్చి నిరసన తెలిపారు. కేటీపీఎస్ ఓఅండ్ఎం, ఐదు, ఆరోదశ కార్యాలయాల ఎదుట తెలంగాణ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉదయం విధులకు వెళ్లే కార్మికులను అడ్డుకున్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ ప్రశాం తంగా జరిగింది. పట్టణంలో హోటళ్లు,సినిమా హాళ్లు, షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. బంద్‌ను పురస్కరించుకుని టీజేఏసీ ఆధ్వర్యం లో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ విజయవంతం చేయాలని కోరారు. బయ్యారం, గార్ల మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. రాజకీయ జేఏసీ, న్యూడెమోక్రసీ వేర్వేరుగా మోటర్‌సైకిల్ ర్యాలీ లు నిర్వహించాయి. రాజకీయ జేఏసీ నాయకులు రహదారిపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. బంద్‌కు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, పార్టీల నాయకులు నాయకత్వం వహించారు. టేకులపల్లిలో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ , న్యూడెమోక్రసీ (చంద్రన్న) జేఏసీ ఒక వర్గంగా న్యూడెమోక్రసీ (రాయల) వర్గం మరో వర్గంగా బంద్ నిర్వహించాయి. పోటాపోటీగా ప్రదర్శనలు చేశారు. కామేపల్లిలో ఎన్డీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో శనివారం తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్తక, వాణిజ్య సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధిర నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు నిలుపుదలచేయించారు. పలు పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, బ్యాంకు కార్యాలయాలను బంద్చేయించారు. ముదిగొండ మండలంలోని టీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్, తెలంగాణ బీసీసంక్షేమసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బోనకల్ మండలంలో బీజెపీ, టీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, పాఠశాలలు, కళాశాలలు బంద్‌చేశారు. ముష్టికుంట్ల గ్రామంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బోనకల్-ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనంచేశారు. ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, కళాశాలలు మూతబడ్డాయి. పోలీసులు జిల్లా సరిహద్దుల్లో, రైల్వేస్టేషన్లో అధిక సంఖ్యలో మోహరించారు. పినపాక నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, గుండాల, పినపాక మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అశ్వాపురం మండలంలో టీఆర్ఎస్, సీపీఐ, ఎన్డీ, బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మణుగూరు మండలంలోని జేఏసీ సారధ్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. డీపో నుంచి ఒక్క ఆర్టీసీ బస్సుకుడా బయటకు రాలేదు. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ పాటించినాయి. జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే విధంగా ఆర్టీసీ డీపో ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. పినపాక మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. గుండాల మండలంలో ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని వ్యాపార సంస్థలు మూసివేశారు. భద్రాచలం డివిజన్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎల్డి, కులసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. దుకాణాలు,పెట్రోల్ బంక్‌లు, హోటల్ వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటించారు. వాజేడులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. కూనవరం మండలంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేసారు. వీఆర్‌పురం మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో టీజేఏసీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దమ్మపేట మండలం మందలపల్లి రింగ్ సెంటర్లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్, సీపీఐ, ఎంఎల్ ఎన్డీ, బీజే పీ ఆధ్వర్యంలో దహనం చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు, ముల్కలపల్లి, చంద్రుగొండ మండలాల్లో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండాలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి, ఎంపీడీఓ కారాలయానికి తాళం వేసి తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. జలగంనగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను బయటికి పంపించి వేశారు. అనంతరం పెదతండా వద్ద ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో న్యూడెమోక్రసీ, తిరుమలాయపాలెంలో ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. నేలకొండపల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. రాస్తారోకో చేస్తున్న తెలంగాణ వాదులు పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండల కేంద్రంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేసి బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. టీఆర్ఎస్, ఎన్డీల ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. వైరా నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. వైరాలో ఉదయాన్నే సత్తుపల్లి ఆర్టీసీ బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన 13 మంది తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వైరా, కొణిజర్ల, జూలురుపాడు, కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్యబ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు మూసివేశారు. మండల కేంద్రాలలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను తెలిపారు. -
కుట్రల కిరణ్
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఇస్తామని 2004, 2009 మెనిఫెస్టోల్లో పేర్కొంది కాంగ్రెస్ కాదా... టీఆర్ఎస్తో ప్రభుత్వాన్ని పంచుకుంది మరిచిపోయావా... అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నిం చారు. అదే మెనిఫెస్టో ప్రజల ముందు పెట్టి గెలిచారు.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో భాగంగా ఆయన శుక్రవారం హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో మహాదీక్ష చేపట్టారు. ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దిగ్విజయ్, ఆంటోని, గులాంనబీ ఆజాద్, ఇతర మంత్రులతో సమావేశమవుతూ రోజుకు మూడు లీక్‌లు ఇస్తూ... సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్య మంత్రి... దాన్ని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే సమైక్య ఉద్యమాన్ని స్వయంగా నడిపించడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ మధ్య జరుగుతున్న ఘర్షణతో రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టిందని విమర్శిం చారు. హైదరాబాద్ రాజధానిగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు తామేమీ కొత్తది కోరడం లేదని... పాత రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. 1956లో విలీనం చేసినపుడే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారన్నారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్న క్రమంలో కిరణ్ హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టించి వైషమ్యాలు సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎంగా సభ పెట్టించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకే ఈ సభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ పెడుతున్నారో చెప్పాలని, అక్కడి సమస్యలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య ఫొటోలతో తెలంగాణ సంబరాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.... ఎన్ని సంబరాలు చేసుకున్నా... ప్రజల హృదయాలను గెలవలేరని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన విద్యార్థి జేఏసీ నాయకుడు యాకూబ్‌రెడ్డిని చితక్కొట్టించిన సంఘటన.. బనారుుంచిన అక్రమ కేసులు... లాఠీ చార్జీలను తెలంగాణ ప్రజలు మరిచిపోరన్నారు. సీమాంధ్రలో చంద్రబాబు ఆత్మగౌరం పేరుతో యూత్ర చేపట్టి ఆత్మ వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. వరంగల్ ప్లీనరీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నారా, ఏ రాష్ట్రానికి సీఎం అవుతామనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు నోటి వెంట ఏనాడైనా జై తెలంగాణ నినాదం వచ్చిందా.. అని ప్రశ్నించారు. బీజేపీది మడమ తిప్పని పోరాటం తెలంగాణపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మడమ తిప్పని పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వాన్ని సుష్మాస్వరాజ్ నిలదీశారని గుర్తు చేశారు. తెలంగాణపై సోనియాను, ప్రధానమంత్రిని ప్రశ్నించారని వివరించారు. రాజ్యసభలో తెలంగాణపై ప్రైవేట్ తీర్మానం పెట్టి చర్చ పెట్టించిన ఘనత బీజేపీదేనన్నారు. 1100 మంది ప్రాణాలు పోవడానికి కారణం సోనియా గాంధీనేనని, దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, కళాకారులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలు కీలక భూమిక పోషించారన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలు సమస్యల్లో కూరుకుపోయాయన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారని, వరంగల్ జిల్లాలో సాగునీరు కరువైందని, పాలమూరులో వలసలు పెరిగాయని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభత్వమేనని... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వరంగల్ జిల్లాలో నైజాం, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారకార్థం వరంగల్‌లో అమరవీరుల స్మృతి కిరణం ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి ప్రాంతంలో గోదావరి పొడవునా కారిడార్ ఏర్పాటు చేసి బొగ్గు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు నయవంచన చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ధ్వజమెత్తారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఆశీర్వదించాలని వేడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బలిదానాలు, త్యాగాలతో సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని మార్తినేని ధర్మారావు అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని మాజీ ఎంపీ జంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ చోద్యం చూడకుండా వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్రెడ్డిడిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ చేయించి బీజేపీ నేతలు వికాసపుత్రులు కావాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని జేఏసీ జిల్లా చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి తీరుతుంది తెలంగాణ వచ్చి తీరుతుంది. ఇందు లో ఎలాంటి సందేహం లేదు. నేను తెలంగాణ ప్రజా సమితి రిజిస్ట్రేషన్‌కు ఢిల్లీకి వెళ్లి రాత్రి అక్కడే పడుకున్నా. ఆ రోజు కలలో వినాయకుడు ప్రత్యక్షమై నువ్వు సక్సెస్ అవుతావు.. తెలంగాణ వస్తుందని చెప్పారు. తెలంగాణను చూసేందుకే బతికున్నా. నేటి బంద్‌ను విజయవంతం చేయాలి. అంబేద్కర్, జయప్రకాష్‌నారాయణ చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెప్పారు. - భూపతి కృష్ణమూర్తి , తెలంగాణ గాంధీ డ్రామా ట్రూప్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. డ్రామా ట్రూప్‌గా వ్యవహరిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నది. ఈ ఆలస్యం ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు కూడా దక్కవు. ఓట్లు వస్తాయా లేదా అనే సందేహంతో వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 1977 నాటి జనతా ప్రభంజనం బీజేపీ నాయకత్వంలో రానుంది. యూపీఏ తెలంగాణ ఇవ్వకపోతే... బీజేపీ ఇస్తుంది. - బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నదమ్ముల్లా విడిపోవాలని అనుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా దోపిడీదారులు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. యూటీ చేస్తామని అనడంతో కృష్ణకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఉసురు ఏపీఎన్జీవోలకు, ముఖ్యమంత్రి కిరణ్‌కు తగులుతుంది. తెలంగాణను అడ్డుకునే ప్రక్రియలో భాగమే ఈ సభ. నిరసనలు తెలుపుదాం. బంద్‌కు మద్దతిద్దాం. - నాగం జనార్దన్‌రెడ్డి , ఎమ్మెల్యే -
అశోక్‌బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలి
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యాలపై టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు ఈటెల రాజేంద్ర మండిపడ్డారు.శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అశోక్‌బాబు వ్యాఖ్యలకు సీఎం కిరణ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నిర్వహించే సభలకు తాము వ్యతిరేకమని, అందుకే తెలంగాణ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సిటి కళాశాల నుంచి ఇందిరాపార్క్ వరకు శాంతి ర్యాలీ చేపట్టేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరామన్నారు.అందుకు ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రే తమ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రాంతంలో సభలు నిర్వహిస్తు తమపై ఆరోపణలు చేయడం దారుణమని ఆయన అశోక్ బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవాలంటే సీమాంధ్రలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాలు ఉన్నాయి. అలాంటప్పుడు హైదరాబాద్‌లోనే సభ నిర్వహించడం వెనకు ఉన్న ఉద్దేశ్యం ఏమిటని ఈటెల రాజేంద్ర ఈ సందర్భంగా ఏపీఎన్జీవో సంఘాన్ని ప్రశ్నించారు. -
అశోక్‌బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలి
-
అధిష్టానం పిలుపుతో సీఎం ఢిల్లీ పయనం
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఆయన ఈ సాయంత్రం ఆంటోనీ కమిటీతో సమావేశమవుతారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో ఉద్యమాలు ఉధృతం కావడంతో వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో ఉద్యమాలు - 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ముందుకు తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన నేపధ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో పరిస్థితులను, సీమాంధ్ర ఉద్యమాల గురించి సీఎం ఆంటోనీ కమిటీకి వివరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేపు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆయన ప్రధాన మంత్రితోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుస్తారని తెలుస్తోంది. యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ వైద్యం కోసం అమెరికా వెళ్లినందున ఆమెను కలిసే అవకాశం లేదు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధిష్టానం నేతలు, ఆంటోనీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితోపాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కూడా సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తోంది. -
తెలంగాణ వచ్చాక కిరణ్‌ను వెళ్లగొడతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్లగొడతామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. ఆయనకు ఇక్కడ కర్రీ పాయింట్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వబోమని అన్నారు. ఆయన శుక్రవారం సచివాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నుంచి విద్యా సంస్థలను మినహాయించాలని కోరారు. -
సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటూ, వారిని రెచ్చగెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రే నాయకత్వం వహిస్తున్నట్లు ఉందని, ఆయనకు సీమాంధ్ర ఉద్యమంపై నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖల పక్షం సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపి, విభజన సమయంలో వ్యతిరేకంగా మట్లాడడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలు పార్టీల వైఖరిని అర్ధం చేసుకుని తెలంగాణకు సహకరించాలని కోరారు. ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి.. ఎన్నో ఏళ్లుగా పోడుభూములు సేద్యం చేసుకుంటున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుండా, సర్వేల పేరుతో కాలయాపన చేసి, అరకొర భూములు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీచేయడం దుర్మార్గమన్నారు. అటవీ అధికారులు గొత్తికోయల నివాసాలను ధ్వంసం చేస్తూ గుడిసెలు తగులబెడుతూ జంతువులకు తరిమినట్లు తరుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ 10 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వచ్చేనెల 2న వేలాది మందితో కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళణ, ఖమ్మం, పాల్వంచ డివిజన్లలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను జిల్లాలో భాగంగా ఉంచాలని, ప్రజల అభిప్రాయం స్వీకరణకు రెఫరెండం జరపాలని డిమాండ్ చేస్తూ 4న భద్రాచలంలో రెడ్‌క్రాస్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సదస్సు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వచ్చే నెల 3న ‘రూపాయి పతనం- ఆర్ధిక సంక్షోభం- ప్రజల జీవనంపై ప్రభావం’ అంశంపై ఎన్డీకార్యాలయంలోసదస్సు జరుగుతుందని చెప్పారు. కార్యాక్రమాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ఎన్డీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సురేష్‌లు ఉన్నారు. -
సీఎం తీరుపై అసంతృప్తి
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా అధికార పార్టీ ముఖ్య నేతల స్వరం మారుతోంది. నిన్నటి వరకు కలుపుకునిపోయిన నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై గొంతు విప్పుతున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీరి స్వరం మారుతోంది. సీఎం కనుసన్నల్లో మెదిలిన నాయకులుగా ముద్రపడిన నాయకులు సైతం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పలు సందర్భాల్లో క్రమంగా గొంతు పెంచారు. మరోవైపు కొంత వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాగా, కేంద్రం రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించడంలో ఈ నేతలు ముందున్నారు. విజయోత్సవాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే క్రమంలో కేంద్రంలో, సీమాంధ్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు వీరిలో ఒకింత ఆందోళన రేకిత్తిస్తోంది. పైగా తెలంగాణవాదుల నుంచి క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ దిశలో సీఎం కిరణ్ బహిరంగంగానే సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిపోతుందనే భయం వెన్నాడుతోంది. దీంతో కిరణ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. బహిరంగంగా దాడి చేయనప్పటికీ గతానికి భిన్నంగా సీఎం తీరును ఎత్తిచూపే యత్నం చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర సాధన పోరులో ఎంపీ సిరిసిల్ల మినహా మిగిలిన నేతల పాత్ర తక్కువే అయినప్పటికీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో తమ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎంపీ సిరిసిల్ల మినహా జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు పోరిక బలరాంనాయక్, పొన్నాల, బస్వరాజు, చీఫ్‌విప్ గండ్ర తదితరులు సీఎం కిరణ్‌ను ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భం లేదనే చెప్పాలి. గండ్ర లాంటివారు ఆయన కనుసన్నల్లోనే తెలంగాణ వాదం వినిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. బస్వరాజుకు తొలి నుంచి తెలంగాణవాదిగా ముద్రపడింది. పొన్నాల ఇటీవల చురుకుగా ముందుకు సాగుతున్నారు. అయితే తెలంగాణ ఎంపీలతో కలిసి గళమెత్తడంలో జిల్లా నుంచి సిరిసిల్ల చురుకైన పాత్ర పోషించారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న పోరిక బలరాంనాయక్ ఊగిసలాడే ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. చివరికి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఆయన కూడా గొంతు విప్పుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా సోనియా నిర్ణయం శిరోధార్యమంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగానే మారాయి. శ్రేణులు ఇప్పుడైనా తెలంగాణ కోసం మీరు గట్టిగా నిలబడాలంటూ నేతలను ప్రశ్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఈ అవకాశం చేజారితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్లిష్టతరమయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో నోరెత్తుతున్నారు. రానున్న రోజుల్లో సమస్య తీవ్రమైతే ఈ నేతల తీరెలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. -
మీ సేవ ద్వారా నిశ్శబ్ద విప్లవం: సీఎం కిరణ్
-
మీ సేవ ద్వారా నిశ్శబ్ద విప్లవం: సీఎం కిరణ్
సికింద్రాబాద్: త్వరలో మూడవ దశ రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో ఆయన ప్రసంగిచారు. విజయం కోసం చేసే యుద్ధం కన్నా విలువల కోసం పోరాటం గొప్పదని తాము నమ్ముతామన్నారు. మీసేవ నిశ్శబ్ద విప్లవం సాధించినట్లు తెలిపారు. పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. 18 ఏళ్ల విరామం తరువాత మన రాష్ట్రంలో 20 సూత్రాల పథకం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత తమదేనన్నారు. అన్ని పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. పుట్టిన ప్రతి ఆడ పిల్ల రక్షణ కోసం బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నిజాయితీ పారదర్శకత ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోథుల పెన్షన్ 4 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. అభయ హస్తం పథకం మరో 9 లక్షల మందికి వర్తింపజేసినట్లు చెప్పారు. -
విభజన కుట్రను అడ్డుకుందాం
సాక్షి, నెల్లూరు: ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారని, అం దరూ కలిసికట్టుగా విభజనను అడ్డుకునేందుకు ఉద్యమించాలని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదాయపాళెం సెంటర్లో ఆ పార్టీ నేతలు బుధవారం నుంచి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన మేకపాటి మాట్లాడుతూ విశాలాంధ్ర ఏర్పడ్డాక అన్ని ప్రాంతాల ప్రజలూ హైదరాబాద్‌కు చేరుకుని అభివృద్ధి చేసి బతుకుతున్నారన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వెళ్లిపొమ్మంటే ఎలా వెళతారని ఎంపీ ప్రశ్నించారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని బెదిరిపోయిన కాంగ్రెస్, ఆయన్ను అడ్డుకొనేందుకే రాష్ట్రాన్ని విభజించిందని ఎంపీ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని నియంతృత్వ ధోరణి తో ఈ దుశ్చర్యకు పాల్పడిందని మండిపడ్డారు. 14 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ విభజనకు సిద్ధమైందని ఆరోపించారు. అందరూ సమైక్యంగా ఉద్యమించి విభజనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రం జోలికి వచ్చే సాహసం చేయలేదన్నారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని కోటంరెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ,టీడీపీ నేతలు రాజీనామా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎంపీ మేకపాటి సమైక్యాంధ్ర కోసం మరోమారు రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని కోటంరెడ్డి కొనియాడారు. పార్టీ నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్,టీడీపీ నేతలు కుమ్మక్కై జగన్‌ను అడ్డుకొనేందుకు విభజన కుట్రలు చేశారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రజలు తిరగబడే సరికి రాజీనామా నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ అనిత మాట్లాడుతూ విభజన వల్ల అన్నివర్గాల వారూ తీవ్రంగా నష్టపోతారన్నారు. తొలిరోజు పార్టీ నేతలు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, నరసింహయ్య ముదిరాజ్, పురుషోత్తమ్ యాదవ్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు రాఘవరెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, తాటి వెంకటేశ్వరరావు, పాపకన్ను రాజశేఖరరెడ్డి, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి, స్పందన ప్రసాద్, వహీద్‌బాషా, చంద్రమౌళి, పద్మారెడ్డి పాల్గొన్నారు.