కుట్రల కిరణ్‌ | cm kiran kumar reddy conspiracy on telangana | Sakshi
Sakshi News home page

కుట్రల కిరణ్‌

Published Sat, Sep 7 2013 2:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

cm kiran kumar reddy  conspiracy on telangana

ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :
 తెలంగాణ రాష్ట్రం ఇస్తామని  2004, 2009 మెనిఫెస్టోల్లో పేర్కొంది కాంగ్రెస్ కాదా... టీఆర్‌ఎస్‌తో ప్రభుత్వాన్ని పంచుకుంది మరిచిపోయావా... అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నిం చారు.  అదే మెనిఫెస్టో ప్రజల ముందు పెట్టి గెలిచారు.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో భాగంగా ఆయన శుక్రవారం హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో  మహాదీక్ష చేపట్టారు. ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దిగ్విజయ్, ఆంటోని, గులాంనబీ ఆజాద్, ఇతర మంత్రులతో సమావేశమవుతూ రోజుకు మూడు లీక్‌లు ఇస్తూ... సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు.
 
  సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్య మంత్రి... దాన్ని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే సమైక్య ఉద్యమాన్ని స్వయంగా నడిపించడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ మధ్య జరుగుతున్న ఘర్షణతో రాష్ట్రంలో పాలన  భ్రష్టు పట్టిందని విమర్శిం చారు. హైదరాబాద్ రాజధానిగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు తామేమీ కొత్తది కోరడం లేదని... పాత రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. 1956లో విలీనం చేసినపుడే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారన్నారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్న క్రమంలో కిరణ్ హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టించి వైషమ్యాలు సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎంగా సభ పెట్టించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
 
  హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకే ఈ సభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ పెడుతున్నారో చెప్పాలని, అక్కడి సమస్యలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య ఫొటోలతో తెలంగాణ సంబరాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.... ఎన్ని సంబరాలు చేసుకున్నా...  ప్రజల హృదయాలను గెలవలేరని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన విద్యార్థి జేఏసీ నాయకుడు యాకూబ్‌రెడ్డిని చితక్కొట్టించిన సంఘటన.. బనారుుంచిన అక్రమ కేసులు... లాఠీ చార్జీలను తెలంగాణ ప్రజలు మరిచిపోరన్నారు. సీమాంధ్రలో చంద్రబాబు ఆత్మగౌరం పేరుతో యూత్ర చేపట్టి ఆత్మ వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు.  వరంగల్ ప్లీనరీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నారా, ఏ రాష్ట్రానికి సీఎం అవుతామనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు నోటి వెంట ఏనాడైనా జై తెలంగాణ నినాదం వచ్చిందా.. అని ప్రశ్నించారు.
 
 బీజేపీది మడమ తిప్పని పోరాటం
 తెలంగాణపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మడమ తిప్పని పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు పార్లమెంట్‌లో యూపీఏ ప్రభుత్వాన్ని సుష్మాస్వరాజ్ నిలదీశారని గుర్తు చేశారు. తెలంగాణపై సోనియాను, ప్రధానమంత్రిని ప్రశ్నించారని వివరించారు. రాజ్యసభలో తెలంగాణపై ప్రైవేట్ తీర్మానం పెట్టి చర్చ పెట్టించిన ఘనత బీజేపీదేనన్నారు. 1100 మంది ప్రాణాలు పోవడానికి కారణం సోనియా గాంధీనేనని, దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, కళాకారులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలు కీలక భూమిక పోషించారన్నారు.
 
  సమైక్యాంధ్రలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలు సమస్యల్లో కూరుకుపోయాయన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారని, వరంగల్ జిల్లాలో సాగునీరు కరువైందని, పాలమూరులో వలసలు పెరిగాయని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభత్వమేనని... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వరంగల్ జిల్లాలో నైజాం, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారకార్థం వరంగల్‌లో అమరవీరుల స్మ­ృతి కిరణం ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి ప్రాంతంలో గోదావరి పొడవునా కారిడార్ ఏర్పాటు చేసి బొగ్గు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తామన్నారు.
 
  ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు నయవంచన చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ధ్వజమెత్తారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఆశీర్వదించాలని వేడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బలిదానాలు, త్యాగాలతో సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని మార్తినేని ధర్మారావు అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని  మాజీ ఎంపీ జంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ చోద్యం చూడకుండా వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డిడిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు  పాస్ చేయించి బీజేపీ నేతలు వికాసపుత్రులు కావాలని   ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆకాంక్షించారు.  హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని జేఏసీ జిల్లా చైర్మన్ పాపిరెడ్డి అన్నారు.
 
 తెలంగాణ వచ్చి తీరుతుంది
 తెలంగాణ వచ్చి తీరుతుంది. ఇందు లో ఎలాంటి సందేహం లేదు. నేను తెలంగాణ ప్రజా సమితి రిజిస్ట్రేషన్‌కు ఢిల్లీకి వెళ్లి రాత్రి అక్కడే పడుకున్నా. ఆ రోజు కలలో వినాయకుడు ప్రత్యక్షమై నువ్వు సక్సెస్ అవుతావు.. తెలంగాణ వస్తుందని చెప్పారు. తెలంగాణను  చూసేందుకే బతికున్నా. నేటి బంద్‌ను విజయవంతం చేయాలి. అంబేద్కర్, జయప్రకాష్‌నారాయణ చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెప్పారు.
 - భూపతి కృష్ణమూర్తి ,
 తెలంగాణ గాంధీ
 
 డ్రామా ట్రూప్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్
 కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. డ్రామా ట్రూప్‌గా వ్యవహరిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నది. ఈ ఆలస్యం ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు కూడా దక్కవు.  ఓట్లు వస్తాయా లేదా అనే సందేహంతో వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 1977 నాటి జనతా ప్రభంజనం బీజేపీ నాయకత్వంలో రానుంది. యూపీఏ తెలంగాణ ఇవ్వకపోతే... బీజేపీ ఇస్తుంది.
 - బండారు దత్తాత్రేయ,
 బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు
 
 అన్నదమ్ముల్లా విడిపోవాలని అనుకున్నాం.  ఇప్పుడు అలా కాకుండా దోపిడీదారులు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. యూటీ చేస్తామని అనడంతో కృష్ణకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఉసురు ఏపీఎన్జీవోలకు, ముఖ్యమంత్రి కిరణ్‌కు  తగులుతుంది.  తెలంగాణను అడ్డుకునే ప్రక్రియలో భాగమే ఈ సభ. నిరసనలు తెలుపుదాం. బంద్‌కు మద్దతిద్దాం.
 - నాగం జనార్దన్‌రెడ్డి , ఎమ్మెల్యే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement