
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిచారు.
సికింద్రాబాద్: త్వరలో మూడవ దశ రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో ఆయన ప్రసంగిచారు. విజయం కోసం చేసే యుద్ధం కన్నా విలువల కోసం పోరాటం గొప్పదని తాము నమ్ముతామన్నారు. మీసేవ నిశ్శబ్ద విప్లవం సాధించినట్లు తెలిపారు. పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.
18 ఏళ్ల విరామం తరువాత మన రాష్ట్రంలో 20 సూత్రాల పథకం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత తమదేనన్నారు. అన్ని పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. పుట్టిన ప్రతి ఆడ పిల్ల రక్షణ కోసం బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నిజాయితీ పారదర్శకత ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోథుల పెన్షన్ 4 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. అభయ హస్తం పథకం మరో 9 లక్షల మందికి వర్తింపజేసినట్లు చెప్పారు.