సాక్షి, నెల్లూరు: ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారని, అం దరూ కలిసికట్టుగా విభజనను అడ్డుకునేందుకు ఉద్యమించాలని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదాయపాళెం సెంటర్‌లో ఆ పార్టీ నేతలు బుధవారం నుంచి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన మేకపాటి మాట్లాడుతూ విశాలాంధ్ర ఏర్పడ్డాక అన్ని ప్రాంతాల ప్రజలూ హైదరాబాద్‌కు చేరుకుని అభివృద్ధి చేసి బతుకుతున్నారన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వెళ్లిపొమ్మంటే ఎలా వెళతారని ఎంపీ ప్రశ్నించారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని బెదిరిపోయిన కాంగ్రెస్, ఆయన్ను అడ్డుకొనేందుకే రాష్ట్రాన్ని విభజించిందని ఎంపీ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని నియంతృత్వ ధోరణి తో ఈ దుశ్చర్యకు పాల్పడిందని మండిపడ్డారు. 14 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ విభజనకు సిద్ధమైందని ఆరోపించారు. అందరూ సమైక్యంగా ఉద్యమించి విభజనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
పార్టీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రం జోలికి వచ్చే సాహసం చేయలేదన్నారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని కోటంరెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ,టీడీపీ నేతలు రాజీనామా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎంపీ మేకపాటి సమైక్యాంధ్ర కోసం మరోమారు రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని కోటంరెడ్డి కొనియాడారు.
పార్టీ నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్,టీడీపీ నేతలు కుమ్మక్కై జగన్‌ను అడ్డుకొనేందుకు విభజన కుట్రలు చేశారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రజలు తిరగబడే సరికి రాజీనామా నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ అనిత మాట్లాడుతూ విభజన వల్ల అన్నివర్గాల వారూ తీవ్రంగా నష్టపోతారన్నారు.
తొలిరోజు పార్టీ నేతలు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, నరసింహయ్య ముదిరాజ్, పురుషోత్తమ్ యాదవ్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు రాఘవరెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, తాటి వెంకటేశ్వరరావు, పాపకన్ను రాజశేఖరరెడ్డి, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి, స్పందన ప్రసాద్, వహీద్‌బాషా, చంద్రమౌళి, పద్మారెడ్డి పాల్గొన్నారు.
విభజన కుట్రను అడ్డుకుందాం
Published Thu, Aug 15 2013 4:06 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM
Advertisement
Advertisement