ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణం | telangana bandh success | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Sun, Sep 8 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

telangana bandh success

 ఖమ్మం, న్యూస్‌లైన్:
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేక చర్యలకు నిరసనగా... తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై సంతకాలు చేసి బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. పెట్రోలు బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ, భారతీయ జనతాపార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలవారు ఉదయం నుంచే రోడ్డుపైకి వచ్చి బంద్ నిర్వహించారు.  డిపోల వద్దకు వెళ్లి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం బస్‌డిపో వద్ద పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్ సందర్భంగా జిల్లాలో పలుచోట్ల  జేఏసీ, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.
 
  తెలంగాణ కళాకారులు ప్రధాన కూడళ్ల వద్ద ఆటాపాటా నిర్వహించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫైళ్లకు నిప్పంటించారు. సింగరేణి గనుల్లో పనిచేస్తున్న కార్మికులు బంద్‌కు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు తెలంగాణ వాదులు దహనం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 28 మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
 
     ఖమ్మంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు బయటకు తీయవద్దని డిపో ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులకు డిపో మేనేజర్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. టీచర్స్ జేఏసీ, ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న తెలంగాణ ఉద్యోగులను పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేసి అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ ఫ్లెక్సీని దహనం చేశారు. న్యాయవాదులు ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. మెడికల్, సంక్షేమభవన్, పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగజేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానించడానికి ముఖ్యమంత్రి ఎపీ ఎన్‌జీవోల సభకు అనుమతించారని అన్నారు.  సీమాంధ్ర గుండాలతో తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి అండతో జిల్లాలో సీమాంధ్ర అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులే  బాధ్యత వహించాలని హెచ్చరించారు.
 
  కొత్తగూడెం నియోజకవర్గంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఆర్టీసీ బస్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 7 గంటల వరకు బస్సులు యథావిధిగా నడిచినప్పటికీ అనంతరం జేఏసీ నాయకులు వాటిని నిలిపివేయించారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు.  పాల్వంచ పట్టణంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.  ఉపాధ్యాయులు ఆంధ్రా ఉద్యోగులకు పూలు ఇచ్చి నిరసన తెలిపారు.  కేటీపీఎస్ ఓఅండ్‌ఎం, ఐదు, ఆరోదశ కార్యాలయాల ఎదుట తెలంగాణ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉదయం విధులకు వెళ్లే కార్మికులను అడ్డుకున్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేశారు.
 
  ఇల్లెందు నియోజకవర్గంలో  బంద్ ప్రశాం తంగా జరిగింది. పట్టణంలో హోటళ్లు,సినిమా హాళ్లు, షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. బంద్‌ను పురస్కరించుకుని టీజేఏసీ ఆధ్వర్యం లో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్  ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ విజయవంతం చేయాలని కోరారు. బయ్యారం, గార్ల మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. రాజకీయ జేఏసీ, న్యూడెమోక్రసీ  వేర్వేరుగా మోటర్‌సైకిల్ ర్యాలీ లు నిర్వహించాయి. రాజకీయ జేఏసీ నాయకులు రహదారిపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. బంద్‌కు టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, పార్టీల నాయకులు నాయకత్వం వహించారు.  టేకులపల్లిలో బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఆర్‌పీఎస్ , న్యూడెమోక్రసీ (చంద్రన్న) జేఏసీ ఒక వర్గంగా న్యూడెమోక్రసీ (రాయల) వర్గం మరో వర్గంగా   బంద్ నిర్వహించాయి. పోటాపోటీగా ప్రదర్శనలు చేశారు.  కామేపల్లిలో  ఎన్డీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.  
 
  సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో శనివారం తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్తక, వాణిజ్య సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా  పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
  మధిర నియోజకవర్గంలో  ఆర్టీసీ బస్సులు, ఆటోలు నిలుపుదలచేయించారు. పలు పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, బ్యాంకు కార్యాలయాలను బంద్‌చేయించారు. ముదిగొండ మండలంలోని టీఆర్‌ఎస్, ఎమ్మార్పీఎస్, తెలంగాణ బీసీసంక్షేమసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  బోనకల్ మండలంలో బీజెపీ, టీఆర్‌ఎస్, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో  ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, పాఠశాలలు, కళాశాలలు బంద్‌చేశారు. ముష్టికుంట్ల గ్రామంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బోనకల్-ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనంచేశారు. ఎర్రుపాలెం, చింతకాని  మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, కళాశాలలు మూతబడ్డాయి. పోలీసులు జిల్లా సరిహద్దుల్లో, రైల్వేస్టేషన్‌లో అధిక సంఖ్యలో మోహరించారు.
 
  పినపాక నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, గుండాల, పినపాక మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో  టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అశ్వాపురం మండలంలో  టీఆర్‌ఎస్, సీపీఐ, ఎన్డీ, బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మణుగూరు మండలంలోని జేఏసీ సారధ్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. డీపో నుంచి ఒక్క ఆర్టీసీ బస్సుకుడా బయటకు రాలేదు. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ పాటించినాయి. జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే విధంగా ఆర్టీసీ డీపో ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.  పినపాక మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. గుండాల మండలంలో ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని వ్యాపార సంస్థలు మూసివేశారు.
 
  భద్రాచలం డివిజన్‌లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో టీఆర్‌ఎస్, బీజేపీ, టీఆర్‌ఎల్‌డి, కులసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. దుకాణాలు,పెట్రోల్ బంక్‌లు, హోటల్ వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటించారు. వాజేడులో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. కూనవరం మండలంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేసారు. వీఆర్‌పురం మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు.
 
  అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో టీజేఏసీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దమ్మపేట మండలం మందలపల్లి రింగ్ సెంటర్‌లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్, సీపీఐ, ఎంఎల్  ఎన్‌డీ, బీజే పీ ఆధ్వర్యంలో దహనం చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు, ముల్కలపల్లి, చంద్రుగొండ మండలాల్లో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది.
 
  పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం  రూరల్ మండలంలోని  పెదతండాలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి, ఎంపీడీఓ కారాలయానికి తాళం వేసి తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. జలగంనగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను బయటికి పంపించి వేశారు. అనంతరం పెదతండా వద్ద ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో న్యూడెమోక్రసీ, తిరుమలాయపాలెంలో ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. నేలకొండపల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. రాస్తారోకో చేస్తున్న తెలంగాణ వాదులు పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండల కేంద్రంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేసి బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారు.
 
  టీఆర్‌ఎస్, ఎన్‌డీల ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు.
  వైరా నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.  వైరాలో ఉదయాన్నే సత్తుపల్లి ఆర్టీసీ బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన 13 మంది తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వైరా, కొణిజర్ల,  జూలురుపాడు, కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్యబ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు మూసివేశారు. మండల కేంద్రాలలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement