వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా అధికార పార్టీ ముఖ్య నేతల స్వరం మారుతోంది. నిన్నటి వరకు కలుపుకునిపోయిన నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై గొంతు విప్పుతున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీరి స్వరం మారుతోంది. సీఎం కనుసన్నల్లో మెదిలిన నాయకులుగా ముద్రపడిన నాయకులు సైతం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పలు సందర్భాల్లో క్రమంగా గొంతు పెంచారు. మరోవైపు కొంత వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
కాగా, కేంద్రం రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించడంలో ఈ నేతలు ముందున్నారు. విజయోత్సవాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే క్రమంలో కేంద్రంలో, సీమాంధ్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు వీరిలో ఒకింత ఆందోళన రేకిత్తిస్తోంది. పైగా తెలంగాణవాదుల నుంచి క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ దిశలో సీఎం కిరణ్ బహిరంగంగానే సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిపోతుందనే భయం వెన్నాడుతోంది. దీంతో కిరణ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. బహిరంగంగా దాడి చేయనప్పటికీ గతానికి భిన్నంగా సీఎం తీరును ఎత్తిచూపే యత్నం చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర సాధన పోరులో ఎంపీ సిరిసిల్ల మినహా మిగిలిన నేతల పాత్ర తక్కువే అయినప్పటికీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో తమ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎంపీ సిరిసిల్ల మినహా జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు పోరిక బలరాంనాయక్, పొన్నాల, బస్వరాజు, చీఫ్‌విప్ గండ్ర తదితరులు సీఎం కిరణ్‌ను ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భం లేదనే చెప్పాలి. గండ్ర లాంటివారు ఆయన కనుసన్నల్లోనే తెలంగాణ వాదం వినిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. బస్వరాజుకు తొలి నుంచి తెలంగాణవాదిగా ముద్రపడింది. పొన్నాల ఇటీవల చురుకుగా ముందుకు సాగుతున్నారు.
అయితే తెలంగాణ ఎంపీలతో కలిసి గళమెత్తడంలో జిల్లా నుంచి సిరిసిల్ల చురుకైన పాత్ర పోషించారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న పోరిక బలరాంనాయక్ ఊగిసలాడే ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. చివరికి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఆయన కూడా గొంతు విప్పుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా సోనియా నిర్ణయం శిరోధార్యమంటున్నారు.
తాజా రాజకీయ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగానే మారాయి. శ్రేణులు ఇప్పుడైనా తెలంగాణ కోసం మీరు గట్టిగా నిలబడాలంటూ నేతలను ప్రశ్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఈ అవకాశం చేజారితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్లిష్టతరమయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో నోరెత్తుతున్నారు. రానున్న రోజుల్లో సమస్య తీవ్రమైతే ఈ నేతల తీరెలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.
సీఎం తీరుపై అసంతృప్తి
Published Sat, Aug 24 2013 5:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement