కాంగ్రెస్ ఇస్తుందన్న నమ్మకం లేదు: కిషన్‌రెడ్డి
మీట్ ది ప్రెస్‌లో బీజేపీ నేత కిషన్‌రెడ్డి
తెలంగాణపై సోనియా, చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారు
కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణకు విఘాతమే
సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు పార్టీలు ప్రయత్నించాలి
ఎల్లకాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కుదరదు
సాక్షి, హైదరాబాద్: కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఇప్పటికీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత 2009 నాటి పరిస్థితిని పునరావృతం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ, చంద్రబాబే ఈ నాటకం ఆడిస్తున్నారని, వీళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడయిందని విమర్శించా రు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
తెలంగాణపై మాట తప్పని నేరానికి తమను సీమాంధ్రలో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ప్రకటించినప్పటికీ పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లక తప్పదని, ఎటువంటి ఆప్షన్లు ఉండవని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రక్రియకు విఘాతమేనని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు, నిరసనలు వ్యక్తమవుతున్న దశలో కేసీఆర్ సంయమనం పాటించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన విధివిధానాల మేరకు ఉద్యోగుల విభజన ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రాణాలను అడ్డం పెట్టయినా తెలంగాణలోని సీమాంధ్రుల్ని కాపాడతామన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన మరణాలకు బాధ్యులైన వారిపై కోర్టుల్లో ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉందని, ప్రజలు ఆ హక్కును ఉపయోగించుకుంటే సంతోషిస్తానని చెప్పారు.
కలసికట్టుగా సముదాయిద్దాం: సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు అన్ని పార్టీలు నడుంకట్టాలని కిషన్‌రెడ్డి పిలుపిచ్చారు. ‘‘రాష్ట్ర విభజన ఆవశ్యకతను తెలియజెప్పి, ఉద్యమకారులను బుజ్జగించేందుకు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, బీజేపీ, టీడీపీల అధ్యక్షులు కలిసికట్టుగా సీమాంధ్రలో పర్యటించాలి. ప్రజల్లో అనుమానాలను పోగొట్టాలి. కేంద్ర సహకారంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలైతే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. వేలాది పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు మంచి ప్యాకేజీ రాబడదాం. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకు కృషిచేద్దాం.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎల్లకాలం కొనసాగించడం కుదరదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని కేంద్రం అంటే అప్పుడు స్పందిస్తాం’’ అని చెప్పారు. మీడియా సహకరిస్తే సీమాంధ్ర ఉద్యమకారుల్ని సముదాయించడం సులువేనని అభిప్రాయపడ్డారు. మజ్లిస్‌కు ఇష్టమున్నా లేకున్నా తెలంగాణ ఏర్పడితే బీజేపీదే అధికారమన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కుపోయాయన్నారు. 2014లో అధికారం తమదేనని, మోడీయే భావి ప్రధానిగా తమ పార్టీ ప్రకటించక మునుపే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. సమావేశానికి టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించగా పల్లె రవికుమార్, క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, శైలేష్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.