తెలంగాణ ఇస్తే సంబరం.. లేకుంటే సమరమే.. : సుష్మాస్వరాజ్ | If congress not give Telangana war will be started, says Sushma Swaraj | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇస్తే సంబరం.. లేకుంటే సమరమే.. : సుష్మాస్వరాజ్

Published Sun, Sep 29 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

తెలంగాణ ఇస్తే సంబరం..  లేకుంటే సమరమే.. : సుష్మాస్వరాజ్

తెలంగాణ ఇస్తే సంబరం.. లేకుంటే సమరమే.. : సుష్మాస్వరాజ్

తెలంగాణ ప్రజాగర్జన సభలో సుష్మాస్వరాజ్
 తెలంగాణపై మడమ తిప్పం, మాట తప్పం
ప్రకటించి రెండు నెలలైనా అడుగు ముందుకు పడలేదేం?
కాంగ్రెస్ తీరు అనుమానాస్పదంగా ఉంది
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలి
తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర సమస్యలపై దృష్టి
తెలుగులో ప్రారంభం, హిందీలో కొనసాగిన ప్రసంగం

 
(మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణ ఇస్తే సంబరం, ఇవ్వకుంటే సమరమేనని బీజేపీ స్పష్టం చేసింది. రాజకీయ పొత్తులున్నా లేకున్నా తెలంగాణపై మాట తప్పం, మడమ తిప్పమని తెగేసి చెప్పింది. తెలంగాణ ప్రజా గర్జన పేరిట మహబూబ్‌నగర్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. అనుకున్న సమయానికి గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సభలో ఆమె తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి హిందీలో కొనసాగించారు. తెలంగాణ కోసం అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. అందర్నీ ఏకం చేసి ఐక్యపోరాటాన్ని నడిపిస్తున్న కోదండరాంకు అభినందనలు తెలిపారు. జై తెలంగాణ, జై సీమాంధ్ర అని సభికులతో నినాదాలు చేయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. రతంగ్ పాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ... సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత పార్లమెంటులో చర్చల సందర్భంగా తమ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలపై వచ్చిన ఊహాగానాలను తోసిపుచ్చారు. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు.
 
  ‘‘ఒకవైపు సంతోషం, మరోవైపు విజయం సిద్ధిస్తుందన్న నమ్మకం ఉన్నా... మనసులో ఏదో మూల సందేహం కూడా ఉంది. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రకటన చేసి కొన్ని రోజుల తర్వాత వెనక్కు తీసుకున్నారు. జూలై 30న సీడబ్ల్యుసీ తెలంగాణపై ప్రకటన చేసింది. ఇప్పటికి రెండు నెలలు కావస్తున్నా ఎటువంటి ముందడుగు పడకపోవడమే ఈ సందేహానికి కారణం. రెండుమూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య పొంతన ఉండడం లేదు. శిక్ష పడిన వారిని చట్టసభలకు దూరంగా ఉంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ వ్యవహారంలోనూ ప్రధాని ఓ విధంగా, రాహుల్ గాంధీ ఓ విధంగా స్పందించారు. అందుకే నా అనుమానం. ఈసారి కాంగ్రెస్ మోసం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారు. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అంటే డిసెంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రెండు నెలల సమయం ఉంటుంది.
  దాన్ని సద్వినియోగం చేసుకుని సీడబ్ల్యుసీ ప్రకటించినట్టుగా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను శీతాకాల సమావేశాల్లో పెట్టాలి. అలా పెడితే బీజేపీ భేషరతుగా మద్దతు ఇస్తుంది. మేము గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు అందర్నీ సంప్రదించి ఇచ్చాం. కానీ ఈరోజు విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది... ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారు... ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేస్తారు... గాంధీ విగ్రహం ముందు ప్రదర్శనలు నిర్వహిస్తారు... ఎందుకిలా జరుగుతుంది?’’ అని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి తెలంగాణ కల సాకారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్వప్నం నెరవేరిన తర్వాత సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. అదే సమయంలో విజయం సాధించిన వారు సంయమనం పాటించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లను తరిమేస్తామని, ఉండనివ్వబోమని చెప్పడం వల్ల నష్టం జరుగుతుందని సూచించారు. తాము కోరుకుంటున్నది ప్రాంతాల విభజనే తప్ప ప్రజల మధ్య కాదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో తమ పార్టీ, కోదండరాంతో కలిసి సంఘటితంగా కృషి చేస్తుందని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసిన దానికి రాజకీయ ప్రాధాన్యత లేదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల కూటమి, భవిష్యత్ పొత్తుల ప్రస్తావన ఈ భేటీలో రానే రాలేదని తెలిపారు. పొత్తులున్నా, లేకున్నా తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.
 
 తమ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పిస్తుందన్నారు. కృష్ణ, గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తుందని హామీ ఇచ్చారు. పాలమూరు గత వైభవానికి చిహ్నంగా తిరిగి ఈ ప్రాంతం పాలు, మీగడలతో తూలతూగేలా చేస్తామన్నారు. ‘‘అభివృద్ధి కోసమే తెలంగాణకు మద్దతిస్తున్నాం. రెండు నెలల సమయంలో తెలంగాణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ శీతాకాల సమావేశాల్లో పెట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. అదే జరిగితే విజయోత్సాహాల్లో  పాల్గొనేందుకు వస్తా. లేకుంటే తిరిగి ఉద్యమం రెండో అధ్యాయాన్ని ప్రారంభించేందుకు వస్తా. కోదండరాం సిద్ధంగా ఉండాలి’’ అని సుష్మా స్వరాజ్ తన ప్రసంగాన్ని ముగించారు.
 
 సీమాంధ్రలో నాయకత్వ పోరు : కిషన్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం నాయకత్వ పోరులో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సీమాంధ్రలో నాయకత్వానికి పోటీపడుతూ ఉద్యమాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎంగా కొనసాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతేనని చెప్పారు.
 
 టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణకు అడ్డం పడుతున్న ముఖ్యమంత్రి మీద, బిల్లు పెట్టడంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద గర్జించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇస్తే వచ్చేవి మూడు సమస్యలేనని, ఇవ్వకపోతే 30 వస్తాయని చెప్పారు. ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, సాధించిన విజయాలను చూసి గర్వించాలని సూచించారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని తరిమికొట్టే రోజు వచ్చిందని సీహెచ్ విద్యాసాగరరావు చెప్పారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, మరికొందరు సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని మాజీమంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి తప్పుబటా ్టరు. వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణ సచివాలయం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement