Sheela bhide committee
-
కొలిక్కిరాని ‘విభజన’ సమస్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు మరోసారి కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మంగళవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం పెద్దగా ఫలితమివ్వకుండానే ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలపాటు ఈ భేటీలో చర్చించగా రెండు రాష్ట్రాలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. కేంద్ర హోంశాఖ జోక్యం వద్దు.. షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికార పరిధి లేదని పాడిపరిశ్రమల సంస్థ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిందని సమావేశంలో తెలంగాణ గుర్తు చేసింది. షెడ్యూల్–9లో 91 సంస్థలుండగా 90 సంస్థల విభజనపై షీలా బిడే కమి టీ చేసిన సిఫారసులన్నింటినీ అంగీకరించాలని ఏపీ కోరింది. అయితే కేసులు తేలే వరకు నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (దిల్) ఆస్తుల విభజనకు షీలా బిడే కమిటీ సిఫారసులు చేసిందని తెలంగాణ తప్పుబట్టింది. ‘దిల్’భూములను తెలంగాణ స్వాదీనం చేసుకోవడాన్ని ఏపీ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించిందని గుర్తుచేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కేసు తేలాకే ఆ సంస్థను విభజించాలని తెలంగాణ స్పష్టం చేసింది. కోర్టు కేసులపై పరిశీలన జరపాలని కేంద్ర హోంశాఖను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. నగదు నిల్వల పంపకాలపై తెలంగాణ ఓకే.. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా షెడ్యూల్–10లోని సంస్థల నగదు నిల్వల పంపకాలను జనాభా దామాషా ప్రకారం జరపాలని కేంద్రం ఉత్తర్వులకు తెలంగాణ మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టులో ఏపీ వేసిన కేసు పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థను విభజించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51% వాటాను తమకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపర్చిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆప్మెల్’నే విభజించాల్సి ఉందని స్పష్టం చేసింది. బియ్యం సబ్సిడీల్లో తెలంగాణ వాటా బకాయిలను ఏపీ చెల్లిస్తే ఏపీ పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ తీసుకున్న రూ. 354 కోట్ల రుణాలను చెల్లించడానికి తెలంగాణ అంగీకరించింది. విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. నగదు, బ్యాంకుల్లో నిల్వల విభజన విషయంలో ‘కాగ్’సహకారం తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. పన్నుల్లో తేడాల నిర్మూలనకు విభజన చట్ట సవరణ జరపాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. గిరిజన వర్సిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలించండి... తెలంగాణ విజ్ఞప్తులకు స్పందిస్తూ విభజన హామీలైన గిరిజన వర్సిటీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉన్నత విద్య, రైల్వే శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వెనుబడిన జిల్లాల అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
షీలా కమిటీ సిఫార్సులే దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9లో పొందుపరచిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల మొత్తం ఆస్తులు, అప్పులను షీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలూ విభజించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ వద్ద ప్రతిపాదించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకు వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ మాత్రం ఏపీ ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ► షెడ్యూల్ 9లో పేర్కొన్న 90 ప్రభుత్వ రంగ సంస్ధలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు విభజిస్తూ షీలా భిడే నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. అయితే 68 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం, వీటిలో 53 సంస్ధల సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని రోజులుగా అంగీకరిస్తూ వచ్చినా విభజన మాత్రం జరగలేదు. తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 90 సంస్ధలకు సంబంధించి షీలా భిడే సిఫార్సులను యధాతథంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరగా న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ► విభజన చట్టం షెడ్యూల్ 10లో పేర్కొన్న ఇన్స్టిట్యూట్స్ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పదో షెడ్యూల్లోని 142 ఇన్స్టిట్యూషన్ల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. అందుకు అనుగుణంగా ఒక సంస్థ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచి్చంది. అయితే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నందున ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. దీనిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరింది. ► ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తులను ఇరు రాష్ట్రాలకు త్వరగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. విభజన చట్టం నిబంధనల మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయాలని, జాప్యం చేయవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యయం భారీగా పెరుగుతోంది.. ► నూతన రాజధాని కోసం రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో పేర్కొన్నారని, ఆ నివేదిక ఇచ్చి చాలా సంవత్సరాలైనందున వ్యయం భారీగా పెరుగుతుందని, ఆ మేరకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మీరిచ్చే రూ.2,500 కోట్లు ఏ మూలకూ సరిపోవని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావించగా వయబుల్ కాదని రైల్వే శాఖ పేర్కొంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కారణంగానే విభజన చట్టంలో చేర్చారని, వయబుల్ కాకపోయినప్పటికీ కేంద్రం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖకు సూచించారు. -
నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తాం
⇒ తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై షీలాబిడే కమిటీ సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి మరో నెల రోజుల్లో పరిష్కారం చూపుతామని షీలాబిడే కమిటీ శుక్రవారం తెలిపింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి తుది నివేదికలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులను కమిటీ ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు, ఉద్యోగుల విభజన సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు విన్పిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణా విద్యుత్ సంస్థలు 1252 మంది ఉద్యోగులను తొలగించాయి. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయి, తెలంగాణ సంస్థల్లో చేరారు. ఉద్యోగుల ఆస్తుల విభజన కోసం నియమించిన షీలా బిడే కమిటీ అనేక పర్యాయాలు చర్చలు జరిపింది. స్థానికత మార్గదర్శకాలు రూపొందించే ప్రక్రియలో రెండు రాష్ట్రాల అధికారులు ఏకతాటిపైకి రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశం కొంత సానుకూలంగా ఉన్నట్టు ఇరుపక్షాల అధికారులు చెబుతున్నారు. జనవరిలో నిర్ణయం వెల్లడి 2014 జనవరి ఒకటవ తేదీ నాటికి విద్యుత్ సంస్థల ఆడిట్ బ్యాలెన్స షీట్స్‌ను పరిగణలోనికి తీసుకోవాలని, దీని ఆధారంగా ఆస్తుల విభజన చేయాలని కమిటీ సూచించింది. రెండు రాష్ట్రాలు వీటిని అందించాలని పేర్కొంది. దీనిపై ఏపీ, తెలంగాణ సమగ్ర వివరాలతో ముసాయిదాలను రూపొందించాలని తెలిపింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోగా వాస్తవ పరిస్థితిని వివరించాలని కోరింది. ఉద్యోగుల విభజన చేపట్టడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని రెండు రాష్ట్రాలు తమ నివేదికల్లో పేర్కొనాలని తెలిపింది. ఇరు పక్షాలు ఈ నివేదికలపై చర్చించుకుని డిసెంబర్ 30లోగా తమ అభ్యంతరాలు తెలపాలని కమిటీ సూచించింది. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని జనవరి మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని షీలాబిడే కమిటీ పేర్కొంది. కమిటీ సమావేశానికి ఏపీ తరపున ట్రాన్సకో సీఎండీ విజయానంద్, జేఎండీ దినేష్ పరుచూరి, జెన్కో డెరైక్టర్ (ఫైనాన్స) ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. -
ఉద్యోగుల విషయం తేలాకే ఆస్తుల పంపిణీ
తొలుత జనాభా నిష్పత్తి మేరకు ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలి * తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది * కేంద్రానికీ, షీలాభిడే కమిటీకి ఏపీ సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో గల ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పంపిణీ పూర్తి అయ్యే వరకు ఆ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్నీ, షీలాభిడే కమిటీని కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో గల 90 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే నిమిత్తం షీలాభిడే కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షీలాభిడే కమిటీ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని ఒక కొలిక్కి తీసుకువచ్చింది. అయితే ఈ విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య ఏకాభిప్రాయం లేదు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆ లేఖలో ఏపీ సీఎస్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను, కేంద్ర సూచనలను టీ సర్కారు అమలు చేయకపోవడంతో 1,253 మంది ఉద్యోగుల కుటుం బాలు వీధిన పడ్డాయన్నారు. అప్పులు, ఆస్తుల పంపిణీ పూర్తి కాగానే ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలనే వ్యూహాన్ని టీ సర్కారు అనుసరిస్తోందని ఏపీ సీఎస్ ఆరోపించారు. ఈ వ్యూహంలో భాగంగానే టీ సర్కారు షీలాభిడే కమిటీ నివేదికను అంగీకరించిందని వివరించారు. అయితే ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ సర్కారు అంగీకరించడం లేదన్నారు. ఆస్తులు, అప్పుల పంపిణీని ఉద్యోగుల పంపిణీని వేర్వేరుగా చూడరాదని ఏపీ సీఎస్ పేర్కొన్నారు. -
ఏకాభిప్రాయానికి వస్తేనే పరిష్కారం
విద్యుత్ ఆస్తుల పంపకంపై షీలాభిడే కమిటీ సూచన సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న విద్యుత్ ఆస్తుల పంపకంపై ఉభయరాష్ట్రాలూ ఏకాభిప్రాయానికి రావాలని, అప్పుడే తాము అవసరమైన సిఫారసులు చేయగలమని షీలాభిడే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు షీలాభిడే నేతృత్వంలో ఓ కమిటీని నియమించడం తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ అధికారులు సత్యమూర్తి(డెరైక్టర్, ఫైనాన్స్ ఏపీ), శ్రీనివాస్(జేఎండీ, తెలంగాణ) గురువారం హాజరయ్యారు. ఇరుపక్షాలూ తమ అభ్యంతరాల్ని కమిటీ సభ్యులు కేవీ రావు, ఏకే గోయల్‌కు తెలియజేశారు. యూనిట్లవారీగా ఆస్తుల లెక్కింపుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్టేదని ఏపీ ఆరోపించినట్టు సమాచారం. అదేవిధంగా పూర్తి ఆడిట్ నివేదికల్ని తమకివ్వకుండా ఇష్టానుసారంగా ఆస్తుల పంపకాలు చేశారని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ కూడా ఏపీ అధికారుల అధీనంలోనే ఉందని తెలంగాణ ప్రత్యారోపణ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంతర్గత వ్యవహారాలపై చర్చించుకుని.. ఏకాభిప్రాయానికి రావాలని షీలాభిడే కమిటీ సభ్యులు ఇరుపక్షాలకు సూచించారు. దీంతో సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది. -
జూన్ 3న ఆర్టీసీ విభజన
కొత్త ముహూర్తం ఖరారు చేసిన ఎండీ 28న విభజన వాయిదాపై నిరసనల నేపథ్యంలో కొత్త తేదీ ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజనకు కొత్త ముహూర్తం ఖరారైంది. జూన్ 3 నుంచి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు విడివిడిగా పనిచేయ బోతున్నాయి. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాభిడే కమిటీ పర్యవేక్షిస్తుండగా పని విభజనకు వీలుగా ఆర్టీసీ అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా స్థానికత ఆధారంగా ఎక్కడి వాళ్లు అక్కడే పద్ధతిలో అధికారులు, సిబ్బంది కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. ఈనెల 28 నుంచి రెండు ఆర్టీసీలు విడివిడిగా పని ప్రారంభిస్తాయని గతంలోనే ఎండీ సాంబశివరావు ముహూర్తం ఖరారు చేశారు. కానీ అనూహ్యంగా దాన్ని వాయిదా వేస్తూ మూడు రోజుల క్రితం ఆయన మెమో జారీ చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆంధ్ర ప్రాంత అధికారులు ఆప్షన్ల పేరుతో తెలంగాణలో కొనసాగేందుకు వీలుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భౌగోళికం గా ఆంధ్ర ప్రాంతానికి చెంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు ఈడీగా వ్యవహరిస్తున్న జయరావు నుంచి ఆ బాధ్యతను తొలగిస్తూ తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణరావు ఆదేశాలు జారీ చేశారు. వెరసి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ ఎండీ కొత్త ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ మూడు నుంచి రెండు రవాణ సంస్థలు విడివిడిగా పనిచేస్తాయని వెల్లడిం చారు. జూన్ ఒకటి నాటికి రెండు రాష్ట్రాలకు కేటాయించే అధికారుల జాబితాను తేల్చాల్సి ఉంటుంది. కాగా, విభజన జరిగితే బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, బీ బ్లాక్ కేంద్రంగా తెలంగాణ ఆర్టీసీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. నేడు షీలాభిడే కమిటీతో ఎండీ, జేఎండీ భేటీ ఆర్టీసీ విభజనకు సంబంధించి తీసుకున్న చర్య లు, ప్రస్తుత పరిస్థితిపై షీలాభిడే కమిటీ ఆర్టీసీ ఎండీని ప్రశ్నించింది. కమిటీ సభ్యులకు శుక్రవారం ఆ వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణరావులు శుక్రవారం కమిటీతో భేటీ కానున్నారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై నిర్ణయించేందుకు జరగాల్సిన ఆర్టీసీ బోర్డు సమావేశం ఇప్పటికి నాలుగుసార్లు వాయిదాపడిన విషయాన్ని అధికారులు కమిటీకి వివరించనున్నారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి దానిపై తుది నిర్ణయం తీసుకుని నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించే అవకాశం ఉంది. ఆగస్టు వరకు కమిటీ గడువు పొడిగింపు? షీలాభిడే కమిటీ గడువు ఈనెల 31తో ముగియనున్నా ఆర్టీసీ విభజన కొలిక్కి రాని నేపథ్యంలో కమిటీ గడువును పొడిగిస్తూ రేపో, మాపో ఉత్తర్వు వెలువడనుంది. కనీసం మూ డు నెలల గడువు అవసరమని కమిటీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఆగస్టు వరకు గడువు పెంచే అవకాశం ఉందని సమాచారం. తాజా మెమోలోనూ మెలిక ? జూన్ 3న విభజన ముహూర్తం ఖరారు చేస్తూ గురువారం జారీ చేసిన మెమోలో పేర్కొన్న ఒక వాక్యంపై తెలంగాణ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో స్టేట్ క్యాడర్ పోస్టుల విభజన ఉంటుంది’ అని తాజా మెమోలో ఎండీ పేర్కొనడం, బస్ భవన్ కేంద్రంగా రెండు ఆర్టీసీల విభజన ఉంటుందనే మరో వాక్యానికి ఇది అనుసంధానంగా ఉండటంతో ఆ విభజన బస్ భవన్‌కే పరిమితం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.