తొలుత జనాభా నిష్పత్తి మేరకు ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలి
* తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది
* కేంద్రానికీ, షీలాభిడే కమిటీకి ఏపీ సీఎస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో గల ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పంపిణీ పూర్తి అయ్యే వరకు ఆ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్నీ, షీలాభిడే కమిటీని కోరింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో గల 90 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే నిమిత్తం షీలాభిడే కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షీలాభిడే కమిటీ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని ఒక కొలిక్కి తీసుకువచ్చింది. అయితే ఈ విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య ఏకాభిప్రాయం లేదు.
విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆ లేఖలో ఏపీ సీఎస్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను, కేంద్ర సూచనలను టీ సర్కారు అమలు చేయకపోవడంతో 1,253 మంది ఉద్యోగుల కుటుం బాలు వీధిన పడ్డాయన్నారు. అప్పులు, ఆస్తుల పంపిణీ పూర్తి కాగానే ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలనే వ్యూహాన్ని టీ సర్కారు అనుసరిస్తోందని ఏపీ సీఎస్ ఆరోపించారు.
ఈ వ్యూహంలో భాగంగానే టీ సర్కారు షీలాభిడే కమిటీ నివేదికను అంగీకరించిందని వివరించారు. అయితే ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ సర్కారు అంగీకరించడం లేదన్నారు. ఆస్తులు, అప్పుల పంపిణీని ఉద్యోగుల పంపిణీని వేర్వేరుగా చూడరాదని ఏపీ సీఎస్ పేర్కొన్నారు.
ఉద్యోగుల విషయం తేలాకే ఆస్తుల పంపిణీ
Published Sat, Aug 22 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement