తెలంగాణకు ‘కరెంటు’ షాక్ | Erratic power hits Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ‘కరెంటు’ షాక్

Published Wed, Jun 18 2014 1:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

తెలంగాణకు ‘కరెంటు’ షాక్ - Sakshi

తెలంగాణకు ‘కరెంటు’ షాక్

* జెన్‌కో పీపీఏలు రద్దు!  
* అదే జరిగితే తెలంగాణకు 370 మెగావాట్ల నష్టం
* ఎక్కడి ప్లాంట్లు అక్కడే: ఏపీ జెన్‌కో ఈఆర్‌సీ, డిస్కంలకు లేఖ
* నేటి ఈఆర్‌సీ భేటీలో నిర్ణయం!

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కరెంటు షాక్ కొట్టనుంది. ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) అన్నీ రద్దవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)తో పాటు తెలంగాణలోని రెండు డిస్కంలు (సీపీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్), ఆంధ్రాలోని రెండు డిస్కం (ఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లకు ఏపీ జెన్‌కో మంగళవారం ఈ మేరకు లేఖ రాసింది. దీనిపై బుధవారం ఈఆర్‌సీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ పీపీఏల రద్దుకు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికే చెందనున్నాయి.
 
 అంటే ఏ రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ ఆ రాష్ట్రానికే చెందనుంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం సుమారు 370 మెగావాట్లు, అంటే 9 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్‌ను నష్టపోనుందని అంచనా. పీపీఏలు రద్దయ్యూక ఏ రాష్ట్రంలోని డిస్కంలతో ఆ రాష్ట్రంలోని జెన్‌కో పీపీఏలు చేసుకోవచ్చంటున్నారు. ఈ దెబ్బకు తెలంగాణలో విద్యుత్ కోతలు మరింత పెరగవచ్చని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,450 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉండగా తెలంగాణలో కేవలం 960 మెగావాట్ల ప్లాంట్లే నిర్మాణంలో ఉన్నాయి. పైగా వాటి పీపీఏలకు కూడా ఈఆర్‌సీ అనుమతివ్వలేదు. అంటే వాటి పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే చందం కానుంది. అలా కూడా తెలంగాణ రాష్ట్రం భారీగానే నష్టపోనుంది.
 
 ఈఆర్‌సీ అనుమతి లేక...
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జెన్‌కోకు 8924.9 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్లున్నాయి. వీటిలో 6,530 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లతో నాలుగు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలు 2002తో ముగిశాయి. వాటిని కొనసాగించాలంటూ 2009లో జెన్‌కో, డిస్కంలు లేఖలు రాసినా ఈఆర్‌సీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మిగతా కొత్త విద్యుత్ ప్లాంట్లకు జెన్‌కో, డిస్కంలు 2009లోనే పీపీఏలు కుదుర్చుకున్నారుు.
 
 వాటిని అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నా ఈఆర్‌సీ ఇప్పటిదాకా అధికారికంగా అనుమతివ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారమే పీపీఏలు కొనసాగుతాయని ఆ మేరకే ఇరు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొంది. ఫలితంగా పీపీఏలకు అనుగుణంగా ప్లాంట్లు ఎక్కడున్నాయన్న దానితో నిమిత్తం లేకుండా తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా అవుతోంది. అరుుతే పీపీఏలకు అధికారికంగా ఈఆర్‌సీ అనుమతివ్వలేదు గనుక అవి కొనసాగుతున్నట్టు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
 
 ఇందుకనుగుణంగా గతంలో తాము సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను పరిశీలించాల్సిన అవసరం లేదని ఈఆర్‌సీకి రాసిన లేఖలో పేర్కొంది. గతంలో నాలుగు డిస్కంలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది. విభజన చట్టంలోనే పేర్కొన్నట్టుగా ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడికే చెందుతాయని కూడా తెలిపింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ పూర్తిగా ఆ రాష్ట్రానికే చెందనుంది. ఈఆర్‌సీ నుంచి అనుమతి వచ్చినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కో ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని ఇంధన శాఖ వర్గాలంటున్నాయి. అదేవిధంగా తెలంగాణలోని ప్లాంట్లు కూడా ఆ రాష్ట్రానికే చెందనున్నాయి. అయితే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం తక్కువ. ఆ కారణంగా తెలంగాణకు వెంటనే విద్యుత్ నష్టం వాటిల్లనుంది.
 
 నష్టం ఇలా...
 -    ఉమ్మడి రాష్ట్రంలో జెన్‌కోకు 8924.9 మెగావాట్ల ప్లాంట్లున్నాయి. ఇందులో తెలంగాణలో 4235.3 ఎంవీ, ఆంధ్రప్రదేశ్‌లో 4689.6 ఎంవీ ప్లాంట్లున్నారుు
 -    వర్షాకాలంలో నడిచే హైడల్ ప్లాంట్లను మినహాయిస్తే నిరంతరం విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్‌లో 2810 మెగావాట్లు, తెలంగాణలో 2282.5 మెగావాట్ల మేరకున్నాయి. వీటిలో ప్రస్తుతం తెలంగాణకు 53.89 శాతం లెక్కన 2651.9 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం లెక్కన 2440.5 మెగావాట్ల విద్యుత్ అందుతోంది.
 -    పీపీఏల రద్దు అమల్లోకి వస్తే ఏ రాష్ట్ర ప్లాంట్లు ఆ రాష్ట్రానికే చెందుతాయి. దాంతో తెలంగాణకు 2282.5 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 2810 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. అంటే తెలంగాణ 369.5 మెగావాట్ల (సుమారు 9 ఎంయూ) విద్యుత్‌ను నష్టపోనుంది.
 
 మనమెందుకు అనుమతివ్వలేదు?
 పీపీఏల రద్దు కోరుతూ మీడియాలో కథనాలు, జెన్‌కో నుంచి లేఖ అందడం తదితరాల నేపథ్యంలో ఈఆర్‌సీ చైర్మన్ భాస్కర్ తాజాగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పీపీఏల కోసం 2009లో దరఖాస్తు చేసుకున్నా మనమెందుకు అనుమతివ్వలేదనే ప్రశ్నను భేటీలో లేవనెత్తారని సమాచారం. పీపీఏల రద్దుపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి బుధవారం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఈఆర్‌సీ అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. మరోవైపు జెన్‌కో-డిస్కంల మధ్య ఏటా పీపీఏ ప్రకారమే పెట్టుబడి వ్యయం, విద్యుత్ కొనుగోలు, అమ్మకం ప్రక్రియ జరుగుతున్నందున పీపీఏలు అమల్లో ఉన్నట్టేననే అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తమ్మీద పీపీఏల భవితవ్యం ఈఆర్‌సీ తీసుకునే నిర్ణయంతో తేలనుంది.
 
 పీపీఏ రద్దు లేఖ అందింది
 ‘‘పీపీఏలను రద్దు చేసుకుంటామంటూ ఏపీ జెన్‌కో రాసిన లేఖ మాకందింది. దాన్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. ఈ లేఖపై బుధవారం విద్యుత్ సౌధలో సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తాం’’
 - తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement