దిగువ సీలేరుకు నీటి విడుదలను అడ్డుకున్న సీమాంధ్ర ఉద్యోగులు
నేటితో ఐదో రోజుకు చేరిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె బుధవారం నాలుగో రోజూ కొనసాగింది. దాంతో సీమాంధ్ర వ్యాప్తంగా పగటిపూట విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 400, 220, 132 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సమ్మె ప్రభావం తెలంగాణ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంటుపైనా పడింది. సీలేరు బేసిన్ మీద ఉన్న ఖమ్మం జిల్లాలోని దిగువ సీలేరుకు నీటి విడుదలను డొంకరాయి వద్ద సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకున్నారు. ఫలితంగా 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దిగువ సీలేరులో కేవలం 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే సాధ్యమయింది. సీలేరు బేసిన్ మీద మూడు జల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. సమ్మె ప్రభావంతో ఇప్పటికే 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎగువ సీలేరు, 30 మెగావాట్ల డొంకరాయి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దిగువ సీలేరులో ప్రస్తుతం ఉన్న నీటితో రెండు యూనిట్లలో మాత్రం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అదికూడా శుక్రవారం వరకు మాత్రమే సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు.
తగ్గిన డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో.. సమ్మె ప్రభావంతో సరఫరా నిలిచిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. పగటిపూట తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌లో 2,700 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకోవాల్సి ఉండగా... కేవలం 138 మెగావాట్లను మాత్రమే వినియోగించారు. అదేవిధంగా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ పరిధిలో 1,600 మెగావాట్లను సరఫరా చేయాల్సి ఉండగా 450 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కూడా డిమాండ్ కేవలం 8 వేల మెగావాట్లకే పరిమితమయ్యింది. వాస్తవానికి ఈ సమయంలో విద్యుత్ డిమాండ్ 10 వేల మెగావాట్ల వరకు ఉంటుంది. విద్యుత్ సరఫరా సామర్థ్యం 8,500 మెగావాట్లు ఉండగా, డిమాండ్ 8 వేల మెగావాట్లకే పరిమితం కావడంతో సుమారు 500 మెగావాట్ల మేర విద్యుత్ సరఫరా సామర్థ్యం ఎక్కువగా ఉంది. దీంతో సామర్థ్యం తగ్గించి (బ్యాక్‌డౌన్) ప్లాంట్లను నడిపించారు.