seemandhra power employees
-
తెలంగాణ ప్లాంటుకు నీళ్లు బంద్!
దిగువ సీలేరుకు నీటి విడుదలను అడ్డుకున్న సీమాంధ్ర ఉద్యోగులు నేటితో ఐదో రోజుకు చేరిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె బుధవారం నాలుగో రోజూ కొనసాగింది. దాంతో సీమాంధ్ర వ్యాప్తంగా పగటిపూట విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 400, 220, 132 కేవీ సబ్స్టేషన్లతో పాటు 33/11 కేవీ సబ్స్టేషన్లలో కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సమ్మె ప్రభావం తెలంగాణ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంటుపైనా పడింది. సీలేరు బేసిన్ మీద ఉన్న ఖమ్మం జిల్లాలోని దిగువ సీలేరుకు నీటి విడుదలను డొంకరాయి వద్ద సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకున్నారు. ఫలితంగా 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దిగువ సీలేరులో కేవలం 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే సాధ్యమయింది. సీలేరు బేసిన్ మీద మూడు జల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. సమ్మె ప్రభావంతో ఇప్పటికే 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎగువ సీలేరు, 30 మెగావాట్ల డొంకరాయి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దిగువ సీలేరులో ప్రస్తుతం ఉన్న నీటితో రెండు యూనిట్లలో మాత్రం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అదికూడా శుక్రవారం వరకు మాత్రమే సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. తగ్గిన డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో.. సమ్మె ప్రభావంతో సరఫరా నిలిచిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. పగటిపూట తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో 2,700 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకోవాల్సి ఉండగా... కేవలం 138 మెగావాట్లను మాత్రమే వినియోగించారు. అదేవిధంగా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ పరిధిలో 1,600 మెగావాట్లను సరఫరా చేయాల్సి ఉండగా 450 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కూడా డిమాండ్ కేవలం 8 వేల మెగావాట్లకే పరిమితమయ్యింది. వాస్తవానికి ఈ సమయంలో విద్యుత్ డిమాండ్ 10 వేల మెగావాట్ల వరకు ఉంటుంది. విద్యుత్ సరఫరా సామర్థ్యం 8,500 మెగావాట్లు ఉండగా, డిమాండ్ 8 వేల మెగావాట్లకే పరిమితం కావడంతో సుమారు 500 మెగావాట్ల మేర విద్యుత్ సరఫరా సామర్థ్యం ఎక్కువగా ఉంది. దీంతో సామర్థ్యం తగ్గించి (బ్యాక్‌డౌన్) ప్లాంట్లను నడిపించారు. -
సీఎంతో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తమ సమ్మె కొనసాగుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కూడా సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో జరిగిన చర్చలు విఫలమైనట్టు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(సేవ్ జేఏసీ), హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(హై జాక్) నేతలు సాయిబాబా, శ్రీనివాస్, గణేశ్, నరసింహులు, అనురాధ, ప్రత్యూష తదితరులు ప్రకటించారు. సమ్మె విరమణపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులతో సీఎం సమావేశమయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం నేతలు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోదనే నమ్మకం తమకు ఉందన్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారని... అయినప్పటికీ మినహాయింపు ఇచ్చేదిలేదని తేల్చిచెప్పామన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ర్ట విభజనపై కేంద్రం మంత్రల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. అవన్నీ జరిగేవి కావని వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడేందుకు ఏళ్లు పట్టొచ్చన్న సీఎం! ‘నేనూ సమైక్యవాదినే. తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. మీ సందేశం కేంద్రానికి చేరింది. పేదలను ఇబ్బందికి గురిచేస్తూ సమ్మె చేయడం సరికాదు’ అని విద్యుత్ ఉద్యోగులతో సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే, ఇందుకు ఉద్యోగులు ససేమిరా అన్నారు. రాష్ట్ర విభజన 57 రోజుల్లో అయిపోతుందని అంటున్నారు కదా అని ఉద్యోగులు వ్యాఖ్యానించగా... ‘లేదు లేదు 57 రోజుల్లో అయిపోతుందని మీకు ఎలా సమాచారం వచ్చిందో తెలియదు కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడేందుకు రెండు, మూడు సంవత్సరాలు కూడా పట్టవచ్చు’ అని సీఎం అన్నట్టు సమాచారం. విద్యుత్ కోతల వల్ల ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేయగా.. మరీ అంత పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఆలోచిస్తామని ఉద్యోగులు అన్నట్టు తెలిసింది. మరోవైపు చర్చలు సాగుతుండగానే.. ఉద్యోగులు సమ్మె విరమిస్తామని చెప్పినట్లు మంత్రులు మీడియాకు తెలిపారు. దీంతో చర్చలు సఫలమయ్యాయంటూ టీవీల్లో వార్తలొచ్చాయి. చివరికి ఉద్యోగులు బయటకు వచ్చాక సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మంత్రులతో మూడున్నర గంటలు సీఎంతో భేటీకి ముందు మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘ సభ్యులైన ఆనం రామనారాయణరెడ్డి, పితాని ఉద్యోగులతో చర్చించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సమ్మెను విరమించాలని కోరారు. సెలవుల నేపథ్యంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ స్తంభించిందని అన్నారు. అయితే, సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన కేంద్రం నుంచి వచ్చే వరకూ సమ్మె విరమించేదిలేదని నేతలు స్పష్టం చేశారు. అయితే, కనీసం అత్యవసర సేవలైన ఆసుపత్రులు, రైల్వేలు, వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై జిల్లా జేఏసీలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తామని నేతలు తెలిపారు. మూడున్నర గంటలపాటు సాగిన ఈ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు సీఎంతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. సీఎం వద్ద జరిగిన సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహు, జెన్కో ఎండీ కె. విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ (ఇన్చార్జి) మునీంద్ర పాల్గొన్నారు. -
మూడోరోజూ ముచ్చెమటలు
సాక్షి, హైదరాబాద్ : సమ్మెలో తొలి రెండు రోజులూ ప్రధానంగా విద్యుదుత్పత్తిని నిలిపేసిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మూడో రోజైన మంగళవారం కరెంటు సరఫరా వ్యవస్థను దిగ్బంధించారు. కేంద్ర విద్యుత్ ప్లాంట్లపై గురిపెట్టడమేగాక విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)ను కూల్చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా చీకట్లోకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) నుంచి వచ్చే ఆదేశాలను కూడా బేఖాతరు చేయడమేగాక ఉద్దేశపూర్వకంగా వాటికి విరుద్ధంగా వ్యవహరించారు. కరెంటును నిలిపేయమంటే సరఫరా చేశారు, సరఫరా చేయమంటే నిలిపేశారు. దాంతో గ్రిడ్‌ను కాపాడుకునేందుకు ఎస్ఎల్డీసీ అధికారులు ఆపసోపాలు పడ్డారు. మంగళవారం కూడా సీమాంధ్రలో జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం మూతబడ్డ లాంకో, స్పెక్ట్రం, రిలయన్స్ వంటి ప్రైవేట్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి యూనిట్‌కు ఏకంగా రూ.15 వెచ్చించి నాఫ్తా ద్వారా స్పెక్ట్రం ప్లాంటులో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఇందుకోసం కాకినాడలో 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ట్రాన్స్‌కో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసుకుంది. దీంతోపాటు డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ ప్లాంట్ల నుంచి కరెంటును కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కాకతీయ, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్లలో సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోతలు కొనసాగాయి. రైల్వేలు, ఆసుపత్రులతో పాటు విమానాశ్రయాలకు కూడా సమ్మె సెగ తాకింది. ఎస్ఎల్డీసీ చెబితే వినాల్సిందే...! గ్రిడ్ ఫ్రీక్వెన్సీ కచ్చితంగా పాటించేందుకు రాష్ట్ర స్థారుులో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సమస్త సమాచారం ఈ సెంటర్‌కు ఎప్పటికప్పుడు చేరుతుంది. పూర్తిగా ఆన్లైన్ ద్వారా విద్యుత్ వ్యవస్థను నియంత్రించే వ్యవస్థ ఎస్‌ఎల్‌డీసీలో ఉంటుంది. ఎక్కడి నుంచి ఎంత విద్యుత్ డిమాండ్ ఉంది, ఎంత సరఫరా చేయాలి, ఏయే ప్రాంతాల్లో నిలిపేయాలి, ఎక్కడ సరఫరా చేయాలి వంటి ఆదేశాలన్నీ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీని స్థిరంగా ఉంచేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఎస్‌ఎల్‌డీసీలు జారీచేసే ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది విధిగా పాటించాల్సిందే. లేదంటే గ్రిడ్ కుప్పకూలుతుంది. కానీ, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఎస్ఎల్డీసీ ఆదేశాలను పాటించకపోగా, అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అయినా ఎస్ఎల్డీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ట్రాన్స్‌కో గ్రిడ్ డెరైక్టర్ అన్వరుద్దీన్ 24 గంటల పాటు ఇక్కడే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌కో సీఎండీ(ఇన్చార్జి) మునీంద్ర, జేఎండీ రమేశ్ కూడా ఎస్ఎల్డీసీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులు ఆడుతున్నది చాలా ప్రమాదకరమైన ఆట అని, ఎంత అప్రమత్తంగా ఉన్నా సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరగవచ్చని అధికారులంటున్నారు.