సీఎంతో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తమ సమ్మె కొనసాగుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కూడా సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో జరిగిన చర్చలు విఫలమైనట్టు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(సేవ్ జేఏసీ), హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(హై జాక్) నేతలు సాయిబాబా, శ్రీనివాస్, గణేశ్, నరసింహులు, అనురాధ, ప్రత్యూష తదితరులు ప్రకటించారు. సమ్మె విరమణపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులతో సీఎం సమావేశమయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం నేతలు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోదనే నమ్మకం తమకు ఉందన్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారని... అయినప్పటికీ మినహాయింపు ఇచ్చేదిలేదని తేల్చిచెప్పామన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ర్ట విభజనపై కేంద్రం మంత్రల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. అవన్నీ జరిగేవి కావని వ్యాఖ్యానించారు.
కొత్త రాష్ట్రాలు ఏర్పడేందుకు ఏళ్లు పట్టొచ్చన్న సీఎం!
‘నేనూ సమైక్యవాదినే. తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. మీ సందేశం కేంద్రానికి చేరింది. పేదలను ఇబ్బందికి గురిచేస్తూ సమ్మె చేయడం సరికాదు’ అని విద్యుత్ ఉద్యోగులతో సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే, ఇందుకు ఉద్యోగులు ససేమిరా అన్నారు. రాష్ట్ర విభజన 57 రోజుల్లో అయిపోతుందని అంటున్నారు కదా అని ఉద్యోగులు వ్యాఖ్యానించగా... ‘లేదు లేదు 57 రోజుల్లో అయిపోతుందని మీకు ఎలా సమాచారం వచ్చిందో తెలియదు కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడేందుకు రెండు, మూడు సంవత్సరాలు కూడా పట్టవచ్చు’ అని సీఎం అన్నట్టు సమాచారం. విద్యుత్ కోతల వల్ల ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేయగా.. మరీ అంత పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఆలోచిస్తామని ఉద్యోగులు అన్నట్టు తెలిసింది. మరోవైపు చర్చలు సాగుతుండగానే.. ఉద్యోగులు సమ్మె విరమిస్తామని చెప్పినట్లు మంత్రులు మీడియాకు తెలిపారు. దీంతో చర్చలు సఫలమయ్యాయంటూ టీవీల్లో వార్తలొచ్చాయి. చివరికి ఉద్యోగులు బయటకు వచ్చాక సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
మంత్రులతో మూడున్నర గంటలు
సీఎంతో భేటీకి ముందు మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘ సభ్యులైన ఆనం రామనారాయణరెడ్డి, పితాని ఉద్యోగులతో చర్చించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సమ్మెను విరమించాలని కోరారు. సెలవుల నేపథ్యంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ స్తంభించిందని అన్నారు. అయితే, సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన కేంద్రం నుంచి వచ్చే వరకూ సమ్మె విరమించేదిలేదని నేతలు స్పష్టం చేశారు. అయితే, కనీసం అత్యవసర సేవలైన ఆసుపత్రులు, రైల్వేలు, వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై జిల్లా జేఏసీలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తామని నేతలు తెలిపారు. మూడున్నర గంటలపాటు సాగిన ఈ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు సీఎంతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. సీఎం వద్ద జరిగిన సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహు, జెన్‌కో ఎండీ కె. విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ (ఇన్‌చార్జి) మునీంద్ర పాల్గొన్నారు.