మూడేళ్లు.. 6,000 మెగావాట్లు
మూడేళ్లు.. 6,000 మెగావాట్లు
Published Fri, Jun 6 2014 2:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
రాజకీయ ఒత్తిళ్లుండవని భరోసా
తెలంగాణలో రానున్న మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంధన శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న విద్యుత్ లోటు దృష్ట్యా నిర్దిష్ట కాలపరిమితిలో ప్లాంట్లను నిర్మించాలన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ‘‘వరంగల్ జిల్లా భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా రామగుండం వద్ద ప్లాంట్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టండి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల సమీపంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోండి’’ అని సూచించారు. ఇంధన శాఖ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న విద్యుత్ లోటు దృష్ట్యా నిర్దిష్ట కాలపరిమితిలో ప్లాంట్లను నిర్మించాలన్నారు. విద్యుదుత్పత్తిని ప్రైవేటు రంగానికి వదిలేసేది లేదని, కొత్త ప్లాంట్ల ఏర్పాటును పూర్తిగా ప్రభుత్వపరంగానే చేపడతామని చెప్పారు. తద్వారా ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటుపై అధికారుల బృందం వెళ్లి అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో మాట్లాడానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణ మండలి (టీఈఆర్‌సీ) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందాను ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, చిన్న పట్టణాలల్లో రూఫ్ టాప్ సోలార్ విద్యుదుత్పత్తిని పెంచాలన్నారు. అది తన ఫామ్ హౌస్‌లో విజయవంతమైందని తెలిపారు. అధికారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ ఉండబోవని భరోసా ఇచ్చారు. పూర్తి అవినీతిరహిత పాలనను అందిస్తామని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
కాంక్రీట్ జంగిల్‌తోనే కరువుకాటకాలు
‘‘వ్యక్తిగతంగా నేను రైతును. వ్యవసాయమన్నా, చెట్ల పెంపకమన్నా నాకు చాలా ఇష్టం. మీరేం చేస్తరో తెల్వదు. వచ్చే ఐదేండ్లల్ల పచ్చదనం బాగా పెరగాలె. చెట్లు, అడవుల పెంపకాన్ని విస్తృతంగా చేపడుదాం. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో రింగ్‌రోడ్లు, పెద్ద రోడ్లు, గ్రామాల్లోనూ రోడ్ల నిర్మాణం సందర్భంగా చెట్లను విధిగా పెంచడం వంటి చర్యలు తీసుకోవాలె’’ అని అటవీ శాఖ అధికారులతో కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు కావాల్సిన బడ్జెట్, సిబ్బంది వంటివాటిపై పూర్తి నివేదికలతో రావాలని సచివాలయంలోని తన చాంబర్‌లో అటవీ శాఖ సమీక్షలో ఆదేశించారు. ‘‘15 రోజుల్లో మరో సమావేశం పెట్టుకుందాం. నిర్దిష్టమైన ప్రణాళికలతో భారీగా అడవులను పెంచుదాం’ అని సూచించారు. అడవుల విస్తీర్ణం పెరిగితే సర్వసమస్యలూ దూరమవుతాయన్నారు. అందుకు బడ్జెట్ ఎంతైనా వెనకాడొద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, జిల్లాలవారీగా పరిస్థితి, దశాబ్ద కాలంలో ఎక్కడెక్కడ తగ్గింది, కారణాలేమిటి, పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది, బడ్జెట్ వంటివాటిపై లోతుగా సమీక్షించారు. అయితే అటవీ శాఖ భూముల సరిహద్దులు, ఆక్రమణలు తదితరాలపై కేసీఆర్ ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం, సమాధానం ఇవ్వలేకపోయారు. అటవీ శాఖకు బడ్జెట్ కేటాయింపులు ఏటేటా తగ్గుతున్నాయన్నారు. నాగార్జునసాగర్, ఆదిలాబాద్, ఖమ్మం అడవుల పరిస్థితి, సమస్యలను వివరించారు. మొత్తం భూబాగంలో అడవులు 33 శాతం ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో 25 శాతమే ఉన్నాయని చెప్పారు. అడవులు, చెట్లు ఎక్కువగా ఉంటే వానలు సమృద్ధిగా ఉంటాయని కేసీఆర్ వారికి గుర్తు చేశారు. ‘‘మొన్న బాన్సువాడ నుండి ఒక యువకుడు వచ్చిండు. వాళ్ల ఊళ్లె ఎన్నడూ కరువే రాలేదని మాటల సందర్భంగా అన్నడు. అదేందని అడిగితె ఊళ్లె, పొలాల కాడ బాగా చెట్లు పెంచినమన్నడు. ఇగ వానలెందుకు రావు చెప్పమన్నడు. ఆ మాటలు మనకు ఆదర్శంగా ఉండాలె’’ అంటూ దిశానిర్దేశం చేశారు. రిజర్వు ఫారెస్టులనే కాకుండా సామాజిక అడవులను కూడా వీలైనంత ఎక్కువగా పెంచాలన్నారు. అటవీ మంత్రి జోగు రామన్న, శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్.బి.ఎల్.మిశ్రా, అధికారులు భేటీలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement