లక్ష కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాలు
*భవిష్యత్తులో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ
* 2018 ఫిబ్రవరి నాటికి 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
* భద్రాద్రి పవర్ ప్రాజెక్టు శంకుస్థాపనలో సీఎం కేసీఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో దాదాపు రూ. లక్ష కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మణుగూరు సమీపంలో 1,080 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018 నాటికి తెలంగాణలో కొత్తగా నెలకొల్పే విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు. ఈ ఏడాది చివర్లోఆదిలాబాద్ జిల్లా జయపూర్ వద్ద 1,900 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం కానుందన్నారు.
అలాగే, కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. కరెంటు కోతలనుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తిచేసి తీరుతామన్నారు. ఈ ప్లాంట్ ఈశాన్యంలో ఉండటం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును ఖమ్మం ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా డిజైన్ చేయాలని నిర్ణయించామన్నారు. జిల్లా రైతుల అవసరాల కు సాగునీటి ప్రాజెక్టులను సిద్ధం చేస్తామ న్నారు. 2018 ఫిబ్రవరికి రాష్ట్రంలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కానున్నదన్నారు.
భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తాం
తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలంను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని, భద్రాచలం ప్రాంతంలో ఉన్న గోదావరీ తీరం, రామాలయం, పర్ణశాల వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. భద్రాచలం మండలం నుంచి ఆంధ్రా ప్రాంతంలో కలిసిన 4 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకువచ్చేందుకు, ఈ అంశాన్ని ప్రధానమంత్రికి వివరిస్తానన్నారు. ఈ గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు నాయిని, తుమ్మల, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు బాలసాని , పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.