మూడేళ్లలో మిగులు విద్యుత్
గణపురం : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించే దిశలో విద్యుత్ ప్లాంట్ల విస్తరణను ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఇంజినీర్స్‌డేను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదనాచారి తెలంగాణ ఇంజినీర్స్ పితామహు డు అలీనవాజ్ బహదూర్‌జంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయనను తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియోషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియోషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని.. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదమేనన్నారు. రైతులు, పారిశ్రామిక అవసరాలకు సరిపోను విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ మేరకు పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సమాయత్తమవుతున్నాయని చెప్పారు.
చెల్పూరు రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నుంచి 2015 జూన్‌లోగా విద్యుత్ ఉత్పత్తి అయ్యేవిధంగా కార్యాచరణ అమలవుతోందన్నారు. మరో 800 మెగావాట్ల ప్లాంట్‌కు సంబంధించిన భూసేకరణ తదితర పనులను వేగవంతం చేయూలని జెన్‌కో అధికారులకు ఇప్పటికే అదేశాలు ఇచ్చామని చెప్పారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాల్సిన గురుతబాధ్యత ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ఉద్యోగులపై ఉందని పేర్కొన్నారు.
భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కేటీపీపీ సీఈ శివకుమార్, ఎస్‌ఈలు వేంకటేశ్వర్లు, మంగేష్‌కుమార్, ఈఈ అంజయ్య, తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్స్ అసోసియేషన్, ఏఈల సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు సదానందం, సంతోష్, కార్యదర్శులు గడ్డం బుచ్చయ్య, పుట్ట తిరుపతి, నరేష్, లింగనాయక్, ప్రమీల, లీల, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.