నేటి నుంచి విద్యుత్ ప్లాంట్లకు సబ్సిడీ గ్యాస్ వేలం
న్యూఢిల్లీ: విద్యుత్ ప్లాంట్లకు ఉపయోగించే గ్యాస్‌పై సబ్సిడీకి సంబంధించి వేలం మంగళవారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే వేలంలో దాదాపు రూ. 1,600 కోట్ల విలువ చేసే సబ్సిడీ కోసం జీఎంఆర్, ఎన్టీపీసీ, ఎస్సార్ పవర్, టాటా పవర్ తదితర సంస్థలు పోటీపడనున్నాయి. ప్రభుత్వ రంగ ఎంఎస్‌టీసీ దీన్ని నిర్వహించనుంది. దిగుమతి చేసుకున్న ఖరీదైన గ్యాస్‌ను దేశీ కంపెనీలు తమ విద్యుత్ ప్లాంట్లకోసం కొనుగోలు చేసుకునేందుకు ఈ వేలం ఉపయోగపడనుంది. గ్యాస్ కొరతతో నిల్చిపోయిన ప్లాంట్లకు ఊపిరినిచ్చేందుకు ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ఖరీదైన గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం పవర్ సిస్టం డెవలప్‌మెంట్ ఫండ్ (పీఎస్‌డీఎఫ్) కింద కొంత సబ్సిడీ కల్పిస్తోంది. అత్యధికంగా సబ్సిడీ వదులుకునేందుకు సిద్ధపడిన సంస్థలకు దిగుమతి చేసుకున్న గ్యాస్ కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. దీనికోసమే తాజాగా రివర్స్ ఈ-ఆక్షన్ నిర్వహిస్తోంది. 24 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లకు ఈ గ్యాస్‌తో ప్రయోజనం చేకూరనుంది.