సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం కంటే ముందే ఉక్కపోత షురూ అయ్యింది. ఇప్పటికే గ్రామాలకు, వ్యవసాయానికి అధికారికంగా కోతలు ప్రకటించిన విద్యుత్ సంస్థలు... పరిశ్రమలపైనా గురిపెట్టాయి. అధిక విద్యుత్ వినియోగ వేళల్లో (పీక్ అవర్స్) అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ కోతలు అమలు చేయాలని నిర్ణయించాయి. అనధికారికంగా శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ సమయంలో కేవలం లైటింగ్‌కు మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని పరిశ్రమలకు ఆదేశాలు ఇప్పటికే జారీచేసినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటివారంలోనే ఇంత భారీస్థాయిలో విద్యుత్ కోతలు అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్‌లో పరిస్థితిని తలచుకుని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
- రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. వర్షాలు బాగా కురవడం వల్ల భూగర్భజల మట్టం పెరిగింది. దీంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగింది.
- ఈ నెల 6న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 283 మిలియన్ యూనిట్లు (ఎంయూలు). సరఫరా కేవలం 263 ఎంయూలు.
- విద్యుత్ లోటు 20 ఎంయూలు. అంటే 2 కోట్ల యూనిట్లు అన్నమాట. దీన్ని పూడ్చుకునేందుకు భారీగా కోతలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి అధికారికంగా గంట విద్యుత్ కోతలు విధించాయి.
- అదనపు విద్యుత్‌ను పొందేందుకు తాపీగా విద్యుత్ సంస్థలు చర్యలు ప్రారంభించాయి. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.
- దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వివిధ విద్యుత్ సంస్థల నుంచి 125 మెగావాట్ల విద్యుత్‌ను తాజాగా కొనుగోలు చేశాయి.
- నాఫ్తా, రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) ద్వారా మరో 400 మెగావాట్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. బహుశా మార్చి నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
ఇదీ కోతల కాలం!
- గ్రామాల్లో 12 గంటలు
- మండల కేంద్రాల్లో 8 గంటలు
- జిల్లా కేంద్రాలు, మున్సిపాల్టీల్లో 4-6 గంటలు
- హైదరాబాద్, వరంగల్, తిరుపతిల్లో 2 గంటల మేరకు కోతలు అమలుచేస్తున్నారు.
- వ్యవసాయానికి అధికారికంగా ఒక గంట కోత. కేవలం 6 గంటలు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు.
- వ్యవసాయానికి నికరంగా 2-3 గంటలు కూడా రాని దుస్థితి. రబీ నారు ఎండిపోతోంది.
పరిశ్రమలకూ కోతలు
Published Sat, Feb 8 2014 1:55 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement