ఉపసంహరణ! | cm kcr decide to new power plants | Sakshi
Sakshi News home page

ఉపసంహరణ!

Published Mon, Jul 4 2016 2:45 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

ఉపసంహరణ! - Sakshi

ఉపసంహరణ!

కొత్త విద్యుత్ ప్లాంట్లపై సర్కారు పునరాలోచన
భవిష్యత్‌లో భారమనే అంచనాలతో అప్రమత్తం
కొత్త ప్లాంట్ల కంటే కరెంటు కొనుగోలే మేలు
  మున్ముందు డిమాండ్ పెరిగినా సరిపడ విద్యుత్
  ప్లాంట్ల పెట్టుబడి ఖర్చులు, నిర్వహణ భారం తడిసిమోపెడు
  రాష్ట్రానికి అనవసర భారమని హెచ్చరించిన కేంద్ర మంత్రి
  అటకెక్కనున్న దామరచర్ల, మణుగూరు ప్లాంట్ల నిర్మాణం

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని  కంకణం కట్టుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కంటే అవసరమైనప్పుడల్లా కరెంటు కొనుగోలు చేయటమే లాభసాటి నిర్ణయమని భావిస్తోంది. కొత్త ప్రాజెక్టులపై వెచ్చించే రూ.లక్ష కోట్ల పెట్టుబడి వ్యయంతో భవిష్యత్‌లో రాష్ట్రానికి మేలు జరగడం పక్కనపెడితే అపార నష్టం వాటిల్లుతుందనే అంచనాకు వచ్చింది. తాజా పరిస్థితుల్లో కొత్త ప్లాంట్లపై ముందడుగు వేయాలా? వెనకడుగు వేయాలా? అని తర్జనభర్జనలు పడుతోంది.
 
 అప్పటివరకు దామరచర్ల, మణుగూరు ప్రాజెక్టుల ప్రతిపాదనను కోల్డ్ స్టోరేజీలో పెట్టాలని భావిస్తోంది. ‘‘నాలుగేళ్లలో రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. 2018 నాటికి అదనంగా 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు కొత్త ప్లాంట్లు నిర్మిస్తాం...’’ అని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తలెత్తిన విద్యుత్ కొరత, ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల ఉల్లంఘన వివాదాల నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు సీఎం పట్టుదలతో వ్యవహరించారు.
 
 ఒకవైపు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు తాత్కాలిక, మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అవసరమైతే ఎక్ఛేంజీ నుంచి సరిపడేంత కొనుగోలు చేయటం ద్వారా విద్యుత్ సమస్యను అధిగమించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత సాధించారు. కానీ గడిచిన రెండేళ్ల అనుభవాల నేపథ్యంలో.. కొత్తగా నిర్మించే విద్యుత్ ప్లాంట్లు రాష్ట్రానికి తలకు మించిన భారంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలు ప్రభుత్వానికి చురక అంటించాయి.
 
 దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్
 దేశవ్యాప్తంగా ప్రస్తుతం డిమాండ్‌కు మించి విద్యుత్ అందుబాటులో ఉంది. సగటున రోజుకు 3 లక్షల యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే.. వినియోగం 1.40 లక్షల యూనిట్లకు మించి లేదు. ఏటేటా విద్యుత్ అవసరాలు 4 నుంచి 5 శాతం పెరిగినా రాబోయే పదేళ్ల వరకు విద్యుత్‌కు ఢోకా ఉండదని కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న కొత్త విద్యుత్ ప్లాంట్లు మరో రెండేళ్లలో ఉత్పత్తి  స్థాయికి చేరుకుంటాయి. మరోవైపు సౌర విద్యుత్ వాడకం కూడా పెరుగుతోంది. ఫలితంగా భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా మరింత మిగులు విద్యుత్ ఉంటుందని, విద్యుత్ కొనుగోలు ధర గణనీయంగా పడిపోతుందని కేంద్ర ఇంధన శాఖ అంచనా.
 
 ప్రస్తుతం వర్షాలు పడుతుండటం, వాతావరణం చల్లగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ సగానికి పడిపోయింది. కొనేవారెవరూ లేకపోవటంతో ఆదివారం పవర్ ఎక్ఛేంజీ పరిధిలో 4,900 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉండటం గమనార్హం. దీంతో విద్యుత్ ధర కేవలం రూ.2.20కు పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ జెన్‌కో అధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్‌కు సగటున రూ.5 ఖర్చవుతోంది. దీంతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సగానికంటే తక్కువ ధరకే దొరుకుతోంది.
 
 కొత్త ప్లాంట్లతో లాభం లేదన్న కేంద్రమంత్రి
 ఇటీవల కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్, సీఎం కేసీఆర్ మధ్య జరిగిన భేటీలో భవిష్యత్‌లో విద్యుత్, ఉత్పత్తి అవసరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో చేపట్టే కొత్త ప్లాంట్ల నిర్మాణంతో తెలంగాణకు లాభమేమీ ఉండదని, అనవసరమైన భారం పెంచుకుంటున్నారని గోయల్ కరాఖండిగా తన అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. దీంతోపాటు సింగరేణి, ఇంధన శాఖలో పని చేసిన అనుభవమున్న ఐఏఎస్ అధికారులు, విద్యుత్ రంగ నిపుణులు సైతం కొత్త ప్లాంట్ల నిర్మాణంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్లాంట్లపై ఆచితూచి అడుగులేయాలని, అవసరమైతే విసృ్తత సమాలోచనలు జరపాలని సీఎం యోచిస్తున్నారు.
 
 డిమాండ్ పెరిగినా కొరత ఉండదు!
 తెలంగాణలో సగటున ప్రతిరోజు కనిష్టంగా 5 వేల మెగావాట్ల నుంచి గరిష్టంగా 7 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. జెన్‌కో పరిధిలో ఉన్న థర్మల్ ప్లాంట్లు, కేంద్ర విద్యుత్ ప్లాంట్లు, తాత్కాలిక, మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో 7 వేల మెగావాట్లకు మించి విద్యుత్ లభ్యమవుతోంది. దీంతో రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్‌కు ఢోకా లేదు. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇచ్చినా, మెట్రో రైలు ప్రాజెక్టు, పారిశ్రామిక అవసరాలు పెరిగినా ఈ డిమాండ్ 10 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా.
 
 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే.. ఈ డిమాండ్‌ను సునాయాసంగా అధిగమించే వీలుంది. సింగరేణి విద్యుత్ ప్లాంట్ నుంచి 1,200 మెగావాట్లు, భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ప్లాంట్ విస్తరణ జరుగుతోంది. పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4 వేల మెగావాట్ల ఎన్‌టీపీసీ ప్లాంటు నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగానే రామగుండంలో 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. దీంతో మూడు వేల మెగావాట్ల డిమాండ్ పెరిగినా కొరత తలెత్తే పరిస్థితి రాదు.
 
 ఎక్స్ఛేంజీలో కొనుగోలు చేస్తేనే లాభం..
 మణుగూరులో 1,080 మెగావాట్లు, దామరచర్లలో 4 వేల మెగావాట్ల ప్లాంట్లు, కేటీపీఎస్ విస్తరణ.. ఇలా నాలుగేళ్లలో మొత్తం 11,800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించిన కొత్త ప్రాజెక్టులకు రూ.92 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలేసింది. వీటికి ఆర్‌ఈసీ రూ.24 వేల కోట్లు, పీఎఫ్‌సీ రూ.15 వేల కోట్లు రుణమిచ్చేందుకు ముందుకు రావటంతో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
 
 ఇంత భారీగా రుణం తెచ్చి ప్లాంట్లు నిర్మించినా పెట్టుబడికితోడు ఏటేటా నిర్వహణ భారం తడిసి మోపెడవుతుంది. దీనికి బదులుగా గరిష్ట డిమాండ్ ఉన్న సందర్భంలో పవర్ ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తేనే సర్కారుకు ఎక్కువ లాభమని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి భారం, నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలన్నీ కలిపితే కొత్త విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసే కరెంటు ఖర్చు యూనిట్ రూ.10 దాటిపోతుంది. కానీ బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు అంతకంతకు తగ్గితే రూ.2 లేదా రూ.3 చొప్పున లభ్యమవుతుంది. ఒకవేళ డిమాండ్‌కు మించి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసినా.. అడ్డికి పావుశేరు అన్నట్లుగా యూనిట్‌కు రూ.10 వెచ్చించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను రూ.2కు యూనిట్ చొప్పున తెగనమ్ముకోవాల్సి వస్తుంది.
 
 దీనికి వీటికి తోడు కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో రాష్ట్రం చేరటం కొత్త పరిణామం. దీంతో విద్యుత్ సరఫరా.. అదనంగా బొగ్గు సరఫరా మాటలెలా ఉన్నా.. నాణ్యమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కేంద్రం సహకరిస్తోంది. ఫలితంగా కారిడార్లు అభివృద్ధి చెంది.. ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత చౌక ధరకు దొరికే విద్యుత్ కొనుగోలు చేసే వీలుంటుంది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్న వెయ్యి మెగావాట్లకు మార్గం సుగమమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement