పోస్టుల వివరాలు సిద్ధం చేయండి | Errabelli Dayakar Rao Order To Fill Posts In Panchayat Department | Sakshi
Sakshi News home page

పోస్టుల వివరాలు సిద్ధం చేయండి

Published Mon, Aug 5 2019 1:59 AM | Last Updated on Mon, Aug 5 2019 5:15 AM

Errabelli Dayakar Rao Order To Fill Posts In Panchayat Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణవికాసంలో కీలకమైన పంచాయతీరాజ్‌ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని, ఈ మేరకు వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీలలో అవసరమైన పోస్టుల భర్తీకి అనుగుణంగా విభాగాల వారీగా, హోదాల వారీగా వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా  మంత్రి ఎర్రబెల్లి  ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా గ్రామాల వికాసం కోసం సమగ్ర విధానం తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ‘గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులు, విధులపై స్పష్టత ఇస్తూ కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపొందించారు. పటిష్టమైన ఈ చట్టం అమలు కోసం చర్యలు తీసుకునేలా సంస్థాగతంగా పంచాయతీరాజ్‌ శాఖను బలోపేతం చేయాలి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలకు డీపీవోలను నియమించాలి. ప్రతి డివిజన్‌కు ఒక్కరు చొప్పున డీఎల్పీవోలుండాలి. ప్రతి మండలానికి ఒక ఎంపీవోను నియమించాలి. ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్‌డీ పేరును ఎంపీవోగా మార్చాలి.

అన్ని స్థాయిల అధికారులకు పదోన్నతులు కల్పించి పోస్టులను భర్తీ చేయాలి. ఎంపీడీవోల పోస్టులను భర్తీ చేయాలి. అర్హత కలిగిన వారితో సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయాలి. అర్హులైన పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు ఇవ్వాలి. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలి. అవసరమైన పోస్టులను వేగంగా భర్తీ చేయాలి. ఈ దిశగా వెంటనే చర్యలు మొదలుపెట్టాలి’అని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అవసరమైన పారిశుధ్య కార్మికుల నియామకం, హేతుబద్ధీకరణ, గౌరవ వేతనాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలు చేయాల్సిన 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకోసం త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, పవర్‌ వీక్, హరితహారం నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ శాఖ సంస్థాగత బలోపేతానికి అవసరమైన అన్ని వివరాలు, ముఖ్యంగా పోస్టుల వారీగా సమగ్ర వివరాలను, ఖాళీల సంఖ్యను సోమవారంలోపు ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement